నవతెలంగాణ – రాయపోల్ : భారత ఎన్నికల సంఘం, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాయపోల్ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో బీఎల్‌వోల ఆధ్వర్యంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రజల సమక్షంలో చదివి వినిపించారు.ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారితో పాటు వివిధ కారణాలతో పేర్లు తొలగించబడిన వారి వివరాలు, సంబంధిత ఓటర్లకు జారీ చేసిన నోటీసుల వివరాలను గ్రామసభలో వెల్లడించారు. జాబితాలో పేర్లు తొలగింపుపై అభ్యంతరాలు ఉన్నవారు, పేర్లలో సవరణలు చేయించుకోవాల్సిన వారు, అలాగే కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవాలనుకునే వారు 2026 సెప్టెంబర్ 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని బీఎల్‌వోలు గ్రామస్తులకు వివరించారు.అదేవిధంగా, ఓటర్లకు నోటీసులు జారీ చేసిన సందర్భాల్లో సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించినట్లయితే వారి ఓటు తుది ఓటర్ల జాబితాలో నమోదు అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. నోటీసులకు స్పందించి అవసరమైన పత్రాలు సమర్పించని వారి పేర్లు తుది ఓటర్ల జాబితాలో నమోదు కాకపోవచ్చని బీఎల్‌వోలు గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా రాయపోల్ తహసీల్దార్ కృష్ణమోహన్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా గ్రామసభలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు, జాబితాలో తప్పులు ఉంటే సవరణలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామల సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, జీపీవోలు, ఎన్నికల సూపర్‌వైజర్లు, బీఎల్‌వోలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ముసాయిదా ఓటర్ల జాబితాపై గ్రామసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



