‘వందేమాతరం’ – అనే మన జాతీయ గేయాన్ని బంకిం చంద్ర ఛటర్జీ రాసి, నూటాయాభై ఏండ్లయిన సందర్భంగా 8 డిసెంబర్ 2025న లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ‘‘వందేమాతరం గేయాన్ని నెహ్రూ ముక్కలు చేశారు. దాని ఫలితంగానే ఈ దేశం ముక్కలయ్యింది’’ అని ప్రకటించారు. వందేమాతర గేయం గూర్చి పూర్తి నిజాలు దేశ ప్రజలకు తెలియజేయకుండా, నెహ్రూ మీద అభాండాలు వేశారు. అలా మాట్లాడడం జాతిపిత గాంధీజీని, నాటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ను, మౌలానా ఆజాద్‌ను, సుభాష్ చంద్రబోస్‌ను, ఆచార్యదేవ్‌ను, విశ్వకవి రవీంద్రనాథ్ టాగూరును మోడీ అవమానించినట్లయింది. ఎందుకంటే, మన జాతీయ గీతం ‘జన గణ మన’తో పాటు వందేమాతరాన్ని కూడా జాతీయ గేయంగా గుర్తించిన ప్రముఖులు వీరంతా. వందేమాతరాన్ని గుర్తించినపుడు అది రెండు చరణాలదే! అందులో సుజలాం, సుఫలాం, మలయజ శీతలాం – అంటూ దేశ ఔన్నత్యాన్ని తెలియజేప్పే చరణాలు ఉన్నాయి. బంకిం చంద్ర ఛటర్జీ ఆ రెండు చరణాల గేయం 1875లో రాశాడు. అది 1876లో ప్రచురింపబడింది. భారత ప్రభుత్వం ఆ రెండు చరణాలనే అనాడు అధికారికంగా గుర్తించింది.
స్వాతం త్రోద్యమ కాలంలో ఉద్యమకారులు ఆ రెండు చరణాలనే పాడుతూ ఉండేవారు. ఆ తరువాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. బంకించంద్ర, ఆ రెండు చరణాలకు తోడుగా మరో మూడు చరణాలు రాసి, 1882లో తన ‘అనంద్ మఠ్’ నవలలో చేర్చుకున్నాడు. అయితే తర్వాత, నవల కోసం రాసుకున్న చరణాలు ఈ దేశానికి సంబంధించినవి కావు. అవి దేవి/దుర్గ/కాళీమాత/లక్ష్మి/ సరస్వతి వంటి హిందూ దేవతల ప్రశంసలతో ఉన్నవి. నవలలోని చరణాలు మన జాతీయ గేయంలో భాగం కాదు. వాస్తవం ఇదయితే, పని గట్టుకుని నెహ్రూను దూషించడానికి దీన్ని ఉపయోగించారు. ఈ గేయం ముక్కలయినందువల్లే, హిందుస్తాన్- పాకిస్థాన్‌గా దేశం ముక్కలయ్యిందనడంలో ఔచిత్యం ఉందా? మన టెలిప్రాంప్టర్ ప్రచార (ప్రధాన) మంత్రి తన ఆక్రోశం వెళ్లగక్క డంలో అర్థం ఉందా? అని ఈ దేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దేశ ఔన్నత్యం గూర్చి రాసిన రెండు చరణాల వందేమాతర గేయానికి 2025 నాటికి 150 ఏండ్లయింది. బంకిం చంద్ర చటర్జీ ఆ తర్వాత 1882లో రాసిన మూడు చరణాలకు 150 ఏండ్లు రావాలంటే మనం 2032 దాకా వేచి ఉండాలి కదా ? ప్రధాని పదవిలో ఉండి అలవోకగా అబద్దాలాడడం హర్షించదగ్గ విషయమా?- దేశ ప్రజలు ఆలోచిస్తున్నారు. మోడీ ఒక అబద్ధానికి తెరలేపగానే, లోక్‌సభలో ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చాయి.
విశ్వకవి రవీంద్రుణ్ణి, ఆనాటి మహనీ యుల్ని అవమానించినట్లయిందని నినాదాలిచ్చాయి. అంత జరిగినా, బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ‘వందేమాతరం బిల్లు’ ఇటీవల పాస్ చేసుకుంది. అయినా, దేశ ప్రజల్లో ఫెయిల్ అయిన విషయం, అక్కడ పాస్ చేసుకుంటే లాభమేమిటీ? గతంలోకి వెళ్లికొన్ని వాస్తవాలు వెలికితీస్తే, అవి ఇలా ఉన్నాయి. ‘వందేమాతం’ గురించి చర్చ వచ్చినప్పుడు- అది సాహిత్య విషయం గనక, నాటి ప్రధాని నెహ్రూ విశ్వకవి, నోబెల్ గ్రహీత అయిన రవీంద్రుడి అభిప్రాయం కోరారు. ఆయన కూడా ఆ రెండు మొదటి చరణాలనే ఆమోదించారు. 1937 అక్టోబర్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ జాతీయ సమావేశంలో తొలిసారి ఆరెండు చరణాల్ని ఆలాపించారు. ఆ తర్వాత, ఆ రెండు చరణాలనే స్వాతంత్య్ర పోరాట యోధులు గొంతెత్తి పాడుకుంటుండే వారు. మొదట రాసిన ఆరెండు చరణాల్ని అమోదించడమే కాకుండా రవీంద్రుడు దానికి బాణిని కూడా సమకూర్చాడు.
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరం- వందేమాతరం –
శుభ్ర జ్యోత్న పులకిత యామిని
పుల్లకు సుమిత ధ్రుమదళ శోభిని
సుహాసినీం, సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం వందేమాతం (1875)
తర్వాత రాసి, నవలలో చేర్చిన చరణాలు ఇలా ఉన్నాయి.
సప్త కోటి కంఠ కలకల నినాదే- అన్న చరణంలో బెంగాల్ జనాభా ఏడుకోట్ల గురించి, వారికి ఆరాధ్య దైవమైన దుర్గామాత గురించి ఉంది. మరి మన దేశ జనాభా ఇప్పుడు – 1.48 బిలియన్లు! పైగా సెక్యులర్ దేశం!!
త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ
కమలా కమలదళ్ విహారిణీ
వాణీ విద్యా దాయినీ నమామిత్వం
నమామి కమలా అమలా అతులామ్-(1882)
ఇందులో బీజేపీ పార్టీ గుర్తు కమలం ఉన్నందువల్ల, వారు దాన్ని దేశ ప్రజలందరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారేమో? ఆనంద్‌మఠ్ నవల నుంచి తీసుకున్న చరణాల గూర్చి ఆ రోజుల్లోనే తర్జన భర్జన జరిగింది. 1939 జులై 1న గాంధీజీ తన ‘హరిజన్’ పత్రికలో ఇలా రాశారు. ‘‘బెంగాల్‌లోని హిందూ ముస్లింల మధ్య ఈ గేయం విద్వేషాలు రేకెత్తిస్తున్నట్లయితే – అందరూ కలిసి ఉన్న సమూహాల్లో దీన్ని పాడడం కొందరికి అభ్యంతరకరంగా ఉంటే – తక్షణం దాన్ని పాడడం ఆపేయాలి!’’ అని! మరోవైపు అక్టోబర్ 1938లో కరాచిలో జరిగిన ముస్లింలీగ్ కాన్ఫరెన్స్‌లో మహ్మద్ అలీ జిన్నా- వందే మాతరం పట్ల తన తీవ్రమైన అభ్యంతరం తెలియజేశాడు. హిందూ దేవతల ప్రార్థనగా ఉన్న ఈ గేయం ముస్లింల పట్ల ద్వేషభావాన్ని పెంచుతోంది. ముస్లింలు విగ్రహారాధనను ఇష్టపడరు. అలాంటప్పుడు ఈ ప్రార్థనా గీతాన్ని ఎలా ఒప్పుకుంటారు? – అని అన్నాడు. ఇలా భిన్నమైన అభిప్రాయాలు ఇప్పుడు కాదు, ఆ రోజుల్లోనే వెలువడ్డాయి. ఇది చారిత్రక సత్యం! అయితే, స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఏర్పడ్డ తొలి భారత ప్రభుత్వం 24 జనవరి 1950లో దేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పే ఆ మొదటి రెండు చరణాల్ని అధికారికంగా జాతీయగేయంగా గుర్తించింది.
జాతీయ గీతంగా ఉన్న ‘జనగణ మన అధినాయక జయహే’తో పాటు వందేమాతరానికి కూడా అస్థాయీ, గౌరవం ఇచ్చారు. అప్పుడు భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్! ఇందులో వందేమాతరం గేయాన్ని నెహ్రూ విరగొట్టిందెక్కడ? దేశాన్ని విభజించిందెక్కడ? దేశం విడిపోవడానికి మహ్మద్ అలీ జిన్నా ఎంత కారణమో హిందూమహాసభ కూడా అంతే కారణం. దేశం బ్రిటీషు వారి పాలనలో ఉండాలని కలలుగన్న వారు ఈ హిందూ మహాసభ/అరెస్సెస్ వారే కదా? వారి వారసులే జనసంఘ్/బీజేపీ నాయకులయ్యారు కదా? ఈ విషయాలు ఈ దేశంలో ఏ స్కూలు పిల్లాడిని అడిగినా చెపుతారు. స్వాతంత్ర్య పోరాటంలో ఏ మాత్రం పాలుపంచుకోని వీరు, ఇప్పుడు దేశ ప్రజలకు దేశభక్తి గురించి ఉపన్యాసాలిస్తున్నారు. ఆనాటి సుభాష్ చంద్రబోస్, మాలానా ఆజాద్, ఆచార్య దేవ్, రవీంద్రనాథ్ టాగూరు, గాంధీజీ, డా.రాజేంద్ర ప్రసాద్‌ల కంటే వీరు తెలివిగలవారా? త్యాగధనులా? నిజాయితీ, నిబద్ధతా గలవారా? వీరందరితో పాటు ఆ నిర్ణయంలో నెహ్రూ కూడా పాలు పంచుకున్నారే గానీ, ఆయన స్వంత నిర్ణయం ఎక్కడుందనీ? ‘విద్యలేని వాడు వింత పశువు’ – అని అంటుంటారు కదా? ప్రస్తుతం అధికారంలో ఉన్న మన దేశ నాయకుల్ని చూస్తే ఆ విషయం గుర్తుకొస్తుంది. వందేమాతరం గేయాన్ని ఇంగ్లీషులోకి అనువదించడానికి ప్రయత్నించిన అరవింద్ ఘోష్ దాన్ని అదే బాణీలో చేయలేక సాదాసీదాగా వచనంలో అనువదించాడు. గేయంగా లయతో ఇంగ్లీషులో ఒదగడం లేదన్నాడు. కానీ, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ మాత్రం దాన్ని అదే బాణీలో ఆ రెండు మొదటి రెండు చరణాల్ని ఉరుదూలోకి అనువదించాడు. తన భారతీయతను, దేశభక్తిని చాటుకున్నాడు.
తస్లిమాత్ మాఁ తస్లిమాత్
తు భరీ హై మీఠీ పానీసే
ఫల్ ఫూలోంకి షాబాదీ సే
దక్కన్ కి ఠండీ హవాఁ ఓసే
తస్లిమాత్ మా తస్లిమాత్
జన గణ మన – జాతీయ గీతంగా ఎందుకు ఎంచుకున్నారంటే, అది లయబద్దంగా ఉంది. మార్చింగ్ సాంగ్ వలె ఉత్తేజభరితంగా ఉంది. ఆ నాటి మహనీయులు అన్ని అలోచించే నిర్ణయిం చారు. అయితే ఇటీవల మన అంధభక్తుల ఆలోచనలు వేరుగా ఉన్నాయి. చూస్తూనే ఉన్నాం కాదా? జాతీయ గీతంగా ఉన్న ‘జనగణమన’ను తొలగించి, దాని స్థానంలో వందేమాతరాన్ని పెట్టాలని కొంతమంది ఆ మధ్య ఢిల్లీ కోర్టులో పిల్స్ వేశారు. ఈ సెక్యులర్ దేశానికి దుర్గామాత స్త్రోతం అవసరం లేదని కోర్టు వాటినన్నింటినీ కొట్టేసింది. రెండు చరణాలున్న గేయాన్ని పెంచి ఐదారు చరణాల పెద్ద గేయంగా మార్చారు కదా? ఆ మొత్తం గేయాన్ని మోడీ, షాలు తప్పులు లేకుండా, తడబడకుండా చదివి వినిపిస్తే ఈ దేశ ప్రజలు ధన్యులవుతారు!పోనీ, మొత్తం అక్కర లేదు. ఒకప్పుడు భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన ఆ రెండు చరణాలు, తప్పులు లేకుండా వినిపించే సాహసం చేయగలరా?
ఈస్ట్ఇండియా కంపనీ అక్రమాలను ఎదిరిస్తూ, హిందూ సన్యాసులు తిరుగుబాటు చేశారు. వారికి ముస్లిం ఫకీర్లు జత కలిశారు. సన్యాసులు – ఫకీర్లు కలిసి, అంటే- హిందువులూ ముస్లింలు కలిసే బ్రిటీష్ కంపనీపై తిరుగుబాట్లు చేశారని ప్రస్తుతం అధి కారంలో ఉన్న ఓట్ చోరీ నాయకులకు తెలిసి నట్టులేదు. ఈ దేశంలో హిందువులు-ముస్లింలు – క్రైస్తవులు – మైనార్టీలు – ఆదివాసీలు ఎప్పుడైనా కలిసే ఉన్నారు. వీరిని విడగొట్టడానికి ఒకప్పుడు బ్రిటీషు వారు ప్రయత్నించారు. నేడు అధికారంలో ఉన్న అరెస్సెస్- బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
వ్యాసకర్త: కవిరాజు త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలిగ్రహీత, జీవ శాస్త్రవేత్త.
ప్రొ. దేవరాజు మహారాజు



