అంతిమయాత్ర ముగిసింది. కానీ, ఆయన్ను చివరిసారిగా చూసిన దృశ్యం మాత్రం మనసులోంచి వెళ్లడం లేదు. ఆ చివరిచూపు మదిలో మెదలాడుతుండగానే ఆయన గురించి రాయడానికి కూర్చుంటే, జ్ఞాపకాలకంటే ముందు ఒక ప్రశ్న ఎదురవుతోంది. ఒక వ్యక్తి మరణాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక ఆత్మీయుడిని కోల్పోయిన బాధ వ్యక్తిగతమైనది. కానీ ప్రజా జీవితంలో దశాబ్దాల పాటు నడిచిన మనిషి మరణం వ్యక్తిగత విషాదంతో ముగిసిపోదు. ఎందుకంటే… ఆయనతో పాటు ఓ కాలం వెళ్లిపోతుంది. అనేకానేక సంఘటనలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఒక అనుభవం దూరమవుతుంది. ఆ జ్ఞాపకాలు మాత్రం మిగులుతాయి. కాని వాటిని మనతో పంచుకోవడానికి ఆ మనిషి మాత్రం ఉండడు. సారంపల్లి మల్లారెడ్డి మరణాన్ని అర్ధం చేసుకోవాల్సింది ఈ కోణంలోనే. ఆయన రైతు నాయకుడు. కమ్యూనిస్టు ఉద్యమకారుడు.. నిత్య అధ్యయనశీలి. అనుభవశాలి. రాజకీయ విశ్లేషకుడు. రచయిత. అంతకుమించి తెలుగు ప్రజల జీవితాన్ని, ముఖ్యంగా రాజకీయ, వ్యవసాయ రంగాలను అర్థం చేసు కోవడానికి అనేక దశాబ్దాల అనుభవాన్ని తనలో సమీకరిం చుకున్న ఒక నడిచే విజ్ఞాన సర్వస్వం. అందుకే ఆయన మరణం ఒక వ్యక్తి నిష్క్రమణ మాత్రమే కాదు. ప్రజా ఉద్య మాలకు అందుబాటులో ఉన్న ఒక అనుభవ సంపదను కోల్పోవడం.
అధ్యయనం ఆయనకు అలవాటుకాదు.. నిరంతర ప్రక్రియ
మల్లారెడ్డి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొదట ప్రస్తావించాల్సింది ఆయన అధ్యయనశీలత. చదివిన విషయాలను గుర్తుపెట్టుకోవడం ఒక విషయం. వాటిని సమకాలీన పరిణామాలతో అనుసంధానించి అర్థం చేసు కోవడం మరో విషయం. మల్లారెడ్డిలో ఈ రెండూ కనిపించేవి. ఏ అంశంపై మాట్లాడినా ఆయన మాటల్లో ఒక నేపథ్యం ఉండేది. ఒక సామాజిక పరిణామాన్ని చెప్పేటప్పుడు దాని చారిత్రక సందర్భాన్ని గుర్తుచేసేవారు. వ్యవసాయ సమస్యను ప్రస్తావించినప్పుడు దాని వెనుక ఉన్న విధానపరమైన మార్పులను వివరించేవారు. ఒక రాజకీయ నిర్ణయాన్ని విశ్లేషించేటప్పుడు దాని సామాజిక, ఆర్థిక ప్రభావాలను పరిశీలించేవారు. ఎప్పుడు ఏ అంశంపై ఏది అడిగినా తడుముకోకుండా చెప్పగలిగే సామర్థ్యం ఆయనకు ఉండేది. అది కేవలం ఆయన జ్ఞాపకశక్తి వల్ల కాదు. నిరంతర అధ్యయనం, సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజా ఉద్యమాలతో ప్రత్యక్ష సంబంధం… ఈ మూడింటి సమ్మేళనం ఆయనలో ఒక ప్రత్యేకమైన మేధో సామర్థ్యాన్ని నిర్మించింది.
ఉద్యమం ఒక అనుభవాల పాఠశాల
కమ్యూనిస్టు ఉద్యమంలో సుదీర్ఘకాలం పనిచేసిన వారికి పుస్తక జ్ఞానంతో పాటు ఒక ప్రత్యేకమైన సామాజిక అనుభవం ఏర్పడుతుంది. వర్గ సంబంధాలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతుకూలీ జీవితం, భూమి సంబంధాలు… ఇవన్నీ ప్రత్యక్ష జీవితంలో కనిపిస్తాయి. మల్లారెడ్డి ఆ అనుభవాన్ని తన రాజకీయ అవగాహనలో భాగం చేసుకున్నారు. ఉద్యమం ఆయనకు సిద్ధాంతాన్ని జీవితంతో కలిపి చూడటం నేర్పింది. అందుకే రైతు సమస్య గురించి ఆయన మాట్లాడినప్పుడు అది కేవలం రైతు అనుకూల నినాదంగా ఉండేది కాదు. వ్యవసాయ సంక్షో భానికి దారితీసిన ఆర్థిక విధానాలు, మార్కెట్ సంబంధాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఉత్పత్తి వ్యయాలు, ధరల సమస్య వంటి అంశాల వరకు ఆయన చర్చను తీసుకెళ్లగలిగేవారు. ఒక విష యం తనకు తెలిసినంత మాత్రాన దాని ప్రయోజనం పూర్తికాదని, అది మరొకరికి ఉపయోగపడినప్పుడే ఆ జ్ఞానానికి అర్థం అని ఆయన భావించేవారు. ఈ లక్షణమే ఆయన జ్ఞానాన్ని వ్యక్తిగత పరిధిని దాటించి ప్రజా జీవితానికి ఉపయోగపడే మేధోవనరుగా మార్చింది. ఇక్కడే ఆయనకు మీడియాతో ఏర్పడిన అనుబంధాన్ని అర్థం చేసుకోవాలి.
మీడియాకు ఎందుకు అవసరమయ్యారు?
మల్లారెడ్డి ప్రాధాన్యత కమ్యూనిస్టు ఉద్యమ పరిధిని దాటి విస్తరించిన ప్రధాన కారణం ఇదే. ఆయనకు ఉన్న విస్తృత అధ్యయనం కేవలం వ్యక్తిగత పరిజ్ఞానంగా మిగిలిపోలేదు. దాన్ని సమకాలీన పరిణామాలను అర్థం చేసుకోవడానికి, వాటి నేపథ్యాన్ని వివరించడానికి, అవసరమైన వాస్తవాలు, గణాంకాలను అందించడానికి నిరంతరం ఉపయోగించేవారు. అందువల్ల ఒక అంశంపై స్పష్టమైన, ఆధారబద్ధమైన సమాచారం అవసరమైనప్పుడు ఆయనను సంప్రదించడం పాత్రికేయు లకు సహజమైన అలవాటుగా మారింది. తెలుగు మీడియా సంస్థలకు ఆయన ఒక విశ్వసనీయమైన వనరుగా ఉండేవారు. ఏ అంశంపై ప్యానల్ డిస్కషన్ ఏర్పాటు చేయాలి? ఏ రాజకీయ పరిణామంపై విశ్లేషణ కావాలి? వ్యవసాయ రంగంలో జరిగిన మార్పులకు నేపథ్యం ఎవరి దగ్గర దొరుకుతుంది? ఒక గణాంకాన్ని ధ్రువీకరించుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి? ఇలాంటి ప్రశ్నలకు చాలా సందర్భాల్లో సారంపల్లి ఓ సమాధానంగా నిలిచేవారు. ఇది ఆయన రాజకీయ గుర్తింపు వల్ల మాత్రమే ఏర్పడిన సంబంధం కాదు. ఆయనకు విషయంపై ఉన్న పట్టు కారణంగా ఏర్పడిన విశ్వాసం. మీడియా చర్చల్లో పాల్గొనేవారిలో రాజకీయ అభిప్రాయాలు కలిగినవారు చాలామంది ఉంటారు. కానీ ఒక అంశాన్ని దాని చారిత్రక నేపథ్యంతో, గణాంకాలతో, విధానపరమైన పరిణామాలతో వివరించగలిగే వ్యక్తులు అరుదు. మల్లారెడ్డి ఆ అరుదైన వర్గానికి చెందినవారు. అందుకే ఆయన మరణంతో నష్టపోయింది కేవలం ఒక రాజకీయ శిబిరం మాత్రమే కాదు. తెలుగు పాత్రికేయ రంగం కూడా తనకు అందుబాటులో ఉన్న ఒక ముఖ్యమైన వనరును కోల్పోయింది.
మల్లారెడ్డి జీవితం మనకు నేర్పుతున్నదేమిటి?
మల్లారెడ్డి మరణించిన సమయం ఆయన అవసరాన్ని మరింత గుర్తుచేస్తోంది. ప్రజా జీవితంలో సమాచారం అపారంగా పెరిగింది. కానీ సమాచారాన్ని విశ్లేషించే సామర్థ్యం అదే స్థాయిలో పెరగలేదు. సామాజిక మాధ్యమాల వేగం రాజకీయ చర్చల వేగాన్ని పెంచింది. టెలివిజన్ చర్చలు విస్తరించాయి. అభిప్రాయాల సంఖ్య పెరిగింది. రాజకీయాలు వ్యక్తుల చుట్టూ కేంద్రీకృతమవుతున్నాయి. చరిత్రను ఎంపిక చేసి వినియోగించే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. గణాంకాలను రాజకీయ ప్రచారానికి అనుగుణంగా వాడే ధోరణి పెరుగుతోంది. మీడియా చర్చల్లో శబ్దం పెరిగి, విషయం తగ్గిపోతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మల్లారెడ్డి వంటి ప్రజా మేధావి అవసరం మరింత స్పష్టమవుతుంది. ఆయనకు ప్రత్యామ్నాయం ఒక వ్యక్తిలో దొరకకపోవచ్చు. కానీ, ఆయనను అర్థం చేసుకోవడం ద్వారా ఒక మేధో సంస్కృతిని మాత్రం పునరుద్ధరించుకోవచ్చు. ఇదే మల్లారెడ్డి రాజకీయ పద్ధతి మనకు నేర్పే ముఖ్యమైన పాఠం.
నవతెలంగాణతో అనుబంధం
నవతెలంగాణతో మల్లారెడ్డి అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఆయన గురించి రాయడం అసంపూర్ణం. ఆయన పత్రికకు క్రమం తప్పకుండా వ్యాసాలు రాశారు. కానీ ఆయన పాత్ర వ్యాసకర్తగా మాత్రమే పరిమితం కాలేదు. సంపాదక విభాగానికి అవసరమైనప్పుడు ఆయనను సంప్రదించగలిగేవాళ్లం. ఏ అంశంపైనైనా అడిగిందే తడవుగా ఆయన సమాచారాన్ని అందించేవారు. పత్రిక తన ప్రజా పాత్రను మెరుగ్గా నిర్వహించడానికి తోడ్పడే ఒక మేధో సహకారం ఆయనది . నవతెలంగాణకు ఆయన అందించినది కేవలం వ్యాసాలు మాత్రమే కాదు. ఒక కథనానికి అవసరమైన నేపథ్యం, ఒక విశ్లేషణకు ఆధారం, ఒక సంపాదకీయానికి గణాంకం, ఒక రాజకీయ పరిణామానికి చారిత్రక అను సంధానం… ఇలా అనేకం. ఇలాంటి వ్యక్తులు ఏ పత్రికకైనా అరుదైన ఆస్తి.
ఆ చివరి కాగితం
ఇటీవల నవతెలంగాణ పదకొండవ వార్షికోత్సవ కార్యక్రమానికి మల్లారెడ్డి హాజరయ్యారు. ఆ సందర్భం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన జ్ఞాపకంగా మిగిలింది. జనశక్తి నుంచి ప్రజాశక్తి వరకు, అక్కడినుంచి నవతెలంగాణ వరకు సాగిన పత్రికా ప్రయాణాన్ని ఆయన శ్రద్ధగా, వివరంగా క్రమబద్ధీకరించి రాసుకొచ్చారు. ఆ కాగితాన్ని నా చేతికి ఇస్తూ, “ఇది నీకు అవసరం” అన్నారు. ఆ సమయంలో అది పత్రిక చరిత్రకు సంబంధించిన ఒక ఉపయోగకరమైన సమాచారం అనిపించింది. కానీ, ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే దాని అర్థం మరింత లోతుగా కనిపిస్తోంది. ఆయన మరణానికి కొద్దిరోజుల ముందే జరిగిన ఈ సంఘటన నన్ను వ్యక్తిగతంగా తీవ్రంగా కదిలిస్తోంది. మనిషి జీవితానికి ఒక పరిమితి ఉంటుంది. కానీ, మనిషి సేకరించిన జ్ఞానం తనకే పరిమితం కాకుండా సమా జానికి చేరినప్పుడే దానికి సామాజిక విలువ ఏర్ప డుతుంది. మల్లారెడ్డి ఆ విలువను అర్థం చేసుకున్న వ్యక్తి. తన దగ్గర ఉన్న సమాచారాన్ని తనతో తీసుకుపోవడం కాదు, అవ సరమైన చోట అందించడం ఆయన సహజ స్వభావం. అందుకే ఆ కాగితం ఇప్పుడు నాకు ఒక వ్యక్తిగత జ్ఞాపకమే కాదు. జ్ఞానాన్ని పంచుకోవడం కూడా ఒక ప్రజా బాధ్యతేనని గుర్తుచేసే పత్రం.
విషాదమే కాదు, బాధ్యత కూడా..
నవతెలంగాణ వంటి పత్రికకు మల్లారెడ్డి అనుబంధం మరో కారణంతో కూడా విలువైనది. ప్రత్యామ్నాయ జర్నలిజం కేవలం ఒక రాజకీయ వైఖరితో పూర్తికాదు. దానికి నిరంతర అధ్యయనం, వాస్తవాల సేకరణ, సామాజిక అవగాహన, చారిత్రక దృష్టి అవసరం. ఈ అవసరాన్ని ఆయన తన సహకారంతో నింపేవారు. బహుశా అందుకేనేమో… ఆయన అంతిమయాత్ర ముగించుకుని వచ్చినప్పటి నుంచీ ఒక ఆలోచన వెంటాడుతోంది. మనిషి మరణించాడనే విషయాన్ని ఒక దశలో అంగీకరించగలం, కానీ అతను ఇక అందు బాటులో ఉండడు అనే నిజాన్ని అంగీకరిం చడం మాత్రం అంత సులభం కాదు. నవతెలంగాణ సంపాదక విభాగంలో ఏదైనా అవసరమైనప్పుడు ఆయన పేరు సహజంగానే ప్రస్తావనకు రావచ్చు. అప్పుడు ఆయన లేరనే వాస్తవం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అది వ్యక్తిగత బాధ. కానీ ఆ బాధకే పరిమితమైతే మల్లారెడ్డి లక్ష్యం నెరవేరదు. ఆయన మనకు వదిలినది ఒక ఆలోచనా పద్ధతి… ‘చదివి తెలుసుకోవాలి. తెలుసుకున్నదాన్ని పరిశీలించాలి. పరిశీలించినదాన్ని ప్రజల జీవితాలతో అనుసంధానించాలి.
నిజాలను ఆధారాలతో చెప్పాలి. ప్రజా ప్రయోజనాన్ని కేంద్రంగా ఉంచాలి.’ ఇది ఆయన వ్యక్తిగత లక్షణాల జాబితా కాదు, ప్రజా జీవితంలో అవసరమైన ఒక మేధో నైతికత. మల్లారెడ్డి దానిని ఆచరించారు. అందుకే ఆయన మరణం మనకు ఒక విషాదాన్ని మాత్రమే ఇవ్వలేదు. ఒక బాధ్యతను కూడా ఇచ్చింది. వ్యక్తులు మరణిస్తారు. వారి భౌతిక ఉనికి ముగుస్తుంది. కానీ, వారు సమాజంలో సృష్టించిన ఆలోచనలు, పంచిన జ్ఞానం, నిర్మించిన సంస్థాగత జ్ఞాపకాలు, రాసిన రచనలు, ప్రభా వితం చేసిన తరాలు కొనసాగుతాయి. మల్లారెడ్డి విషయంలో కూడా మనం గుర్తుంచుకోవాల్సింది అదే. ఆయన ప్రజాదృష్టితో సమాజాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకోవాలి. ప్రజల సమ స్యలను తన సమస్యలుగా స్వీకరించిన నిబద్ధతను అంది పుచ్చుకోవాలి. అప్పుడే సారంపల్లి మల్లారెడ్డి మన మధ్య లేక పోవడం ఒక ముగింపుగా కాకుండా, కొనసాగింపుగా మారుతుంది.
రమేశ్ రాంపల్లి



