పన్నెండేండ్లుగా తాత్సారం చేస్తున్న వైనం
తెలంగాణ ఒత్తిడితో కదిలిన సీడబ్ల్యూసీ
సెప్టెంబర్ 7న రెండు తెలుగు రాష్ర్టాలతో భేటీకి నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య నీటి వివాదాల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) ఉత్సవ విగ్రహాలుగా తయారయ్యాయి. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలో పని చేసే ఈ బోర్డులు రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ, నియంత్రణను పర్యవేక్షిస్తున్నాయి. అయితే దశాబ్దకాలంగా బోర్డులు తీసుకున్న నిర్ణయాలు అమలు కావడం లేదు. రెండు రాష్ర్టాల మధ్య నీటి వివాదాలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల నీటి పంపిణీ, నిర్వహణ వివాదాలను పరిష్కరించడానికి 2026 జనవరిలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మెన్ నేతృత్వంలో జలశక్తి మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. మూడు నెలల్లో కమిటీ నివేదికను అందిస్తుందని తెలిపింది. రెండు రాష్ట్రాల సీనియర్ అధికారులు, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మెన్లు, ఎసీడబ్ల్యూడీఏ ప్రతినిధులు సభ్యులుగా ఉన్న కమిటీ 2026 జనవరి 30న మొక్కుబడిగా ఒకసారి సమావేశమై చేతులు దులుపుకుంది. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలు ఇటీవల మరింత ముదిరిన నేపథ్యంలో కమిటీ పరిష్కారం చూపిస్తుందని భావించారు.
కమిటీ మొదటి సమావేశం జరిగి 8 నెలలు గడిచినా వివాదాలు పరిష్కారం కాక పోగా ఇంకా పెరిగాయి. దానికి తోడు బ్రిజేష్ కుమార్ నేతృత్వంలో ఏర్పాటైన క్రిష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్-2 (కేడబ్ల్యూడీటీ) కృష్ణా జలాల పునఃపంపకంపై సెక్షన్ 3 ప్రకారం ఇవ్వాల్సిన అవార్డు గడువును కేంద్రం పొడిగిస్తూనే ఉంది. అలాగే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యూనల్ గతంలో ఇచ్చిన అవార్డులో రాష్ట్రాల మధ్య స్పష్టమైన పంపకాలపై నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ర్టాల మధ్య నీటి వివాదాలు గత పన్నెండేండ్లుగా తెగడం లేదు. తాజాగా రెండు రాష్ర్టాల మధ్య నీళ్ల పంచాయతీలు రోడ్డుకెక్కాయి. ఈ నెల 24న జరిగిన కేఆర్‌ఎంబీ సమావేశంలో నీటి విడుదలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బుధవారం నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది. తెలంగాణ అధికారులు కేఆర్‌ఎంబీకి ఫిర్యాదు చేసినా అక్కడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దాంతో ఆగ్రహం చెందిన తెలంగాణ ఎడమ కాలువ ద్వారా 2వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేసింది. వివాదం ముదిరి పాకాన పడే పరిస్థితి ఏర్పడుతుందనే భయంతో కేంద్రం నిపుణుల కమిటీ రెండో సమావేశాన్ని సెప్టెంబర్ 7న న్యూఢిల్లీలోని సేవాభవన్‌లో ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించి సీడబ్ల్యూసీ సీఈ రాకేష్‌కుమార్ మీటింగ్ నోటీస్ జారీ చేశారు. రెండు రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖకు చెందిన అధికారులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు.
రెండు రాష్ర్టాలు స్పందించడం లేదు: సీడబ్ల్యూసీ
నదీ జలాల పరిష్కారానికి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సమావేశం 2026 జనవరి 30న జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు పాటించడం లేదు. నదీ జలాల వివాదాలపై ఎజెండా పంపాలంటూ ఫిబ్రవరి నుంచి లేఖలు రాసినా స్పందించడం లేదు. దాంతో సెప్టెంబర్ 7న రెండో సమావేశం ఏర్పాటు చేయాలని నోటీస్ జారీ చేశాం. ఈ సమావేశానికైనా రెండు రాష్ర్టాలు నిర్దేశించిన ఎజెండాతో రావాలి. అప్పుడే నీటి వివాదాలపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.



