సాంకేతికతను నేర నియంత్రణకు సాధనంగా వినియోగించాలి
సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల
మాదకద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి
అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
నేరాల దర్యాప్తు, పోలీసింగ్‌లో వృత్తి నైపుణ్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు. నేరాల సమీక్షను కేవలం గణాంకాలకే పరిమితం చేయకుండా ప్రతి నేరం వెనుక కారణాలు, నేరస్థుల విధానం, దర్యాప్తు తీరు, కేసుల పరిష్కారాన్ని లోతుగా విశ్లేషించాలని సూచించారు. అన్ని యూనిట్ల పోలీసు ఉన్నతాధికారులతో శుక్రవారం డీజీపీ కార్యాలయంలో నిర్వహించిన అర్ధవార్షిక నేర సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఇటీవలి కాలంలో సీసీటీఎన్‌ఎస్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించడంతో 96 శాతానికి చేరిందని తెలిపారు. ప్రతి నెలా నిర్వహించే క్రైమ్ రివ్యూ సమావేశాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ సూచించారు. అన్ని జోన్ల డీఐజీలు, మల్టీజోన్ ఐజీలు ఇకపై ఇన్‌స్పెక్షన్ నోట్స్‌ను పరిశీలించాలని ఆదేశించారు. జిల్లాల పర్యటనలు, పోలీస్‌స్టేషన్ల తనిఖీల సమయంలో గుర్తించే అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల ధోరణిని ముందుగానే గుర్తించి, అవసరమైన చోట ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
సైబర్, ఆర్థిక నేరాల్లో ఊరట
సైబర్ నేరాలు 2024-25తో పోలిస్తే 2025-26లో 13.29 శాతం తగ్గాయి. ఆర్థిక నేరాల్లోనూ 13.28 శాతం తగ్గుదల నమోదైంది. ఈ రెండు విభాగాల్లో మూడేండ్ల కాలానికీ తగ్గుదల కనిపించడం సానుకూల పరిణామంగా పోలీస్ శాఖ భావిస్తోంది. రాష్ట్రంలో 7.15 శాతం నేరాలు పెరిగిన తీవ్ర నేరాల క్యాటగిరీలో మాత్రం 10.33 శాతం తగ్గుదల కనిపించడం గమనార్హం. సాధారణ నేరాల్లో మూడేండ్లలో 7.28 శాతం పెరుగుదల నమోదైంది. నార్కొటిక్స్ కేసుల విషయంలో లక్ష జనాభాకు నేరాల రేటు 3.68 నుంచి 5.12కు పెరిగింది. మహిళలు, చిన్నారులపై తగ్గిన నేరాలకు సంబంధించి ఏడాదిలో 1.54 శాతం క్షీణత నమోదైంది.
మూడేండ్లలో ట్రాఫిక్ నేరాల్లో 9.48 శాతం పెరుగుదల కనిపించింది.
మొత్తంగా రాష్ట్ర నేరాల సరళిని పరిశీలిస్తే.. తీవ్ర నేరాలు, సైబర్, ఆర్థిక నేరాల్లో తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ మాదకద్రవ్యాలు, వ్యవస్థీకృత నేరాలు, సాధారణ నేరాలు, ట్రాఫిక్ నేరాల్లో పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో నేరాలపై లోతైన విశ్లేషణ, నెలవారీ సమీక్షలు, క్షేత్రస్థాయి తనిఖీలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఈ సమీక్షా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిజిటల్ పోలీసింగ్ పోర్టళ్లలో సమాచారాన్ని నిర్ణీత గడువులోగా నవీకరించాలని ఆనంద్ అధికారులను ఆదేశించారు. సమయానుకూలంగా, కచ్చితమైన సమాచారాన్ని నమోదు చేస్తున్న పోలీసు యూనిట్ల పనితీరును ఆయన అభినందించారు. ఇతర యూనిట్లు కూడా ఇదే విధానాన్ని పాటించి పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. నేర నియంత్రణలో సాంకేతికత వినియోగంపై సమీక్షలో ప్రత్యేకంగా చర్చించారు. ఏఐ ఆధారిత పోలీసింగ్ అప్లికేషన్లు, సీసీటీఎన్‌ఎస్, టీజీ-కాప్, హాక్‌ఐ తదితర డిజిటల్ వేదికల పనితీరు, వినియోగంపై అధికారులు ప్రజెంటేషన్లు ఇచ్చారు. కొత్త నేర చట్టాల (ఎన్‌సీఎల్) అమలు, ఇంటర్‌ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్), సైబర్ నేరాల నియంత్రణ చర్యలు, ఈగల్ కార్యకలాపాలు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) పనితీరు, కేసుల భారంపైనా సమీక్షించారు.
యువ ఐపీఎస్ అధికారులు పోలీసింగ్‌లో చేపట్టిన నూతన ఆవిష్కరణలు, సాంకేతిక ఆధారిత కార్యక్రమాలను సమావేశంలో వివరించారు. పోలీసు శాఖ ఆర్థిక, బడ్జెట్ అంశాలు, పోలీసు గృహ నిర్మాణ ప్రాజెక్టులు, మౌలిక వసతుల అవసరాలు, కార్యకలాపాలకు సంబంధించిన అంశాలపైనా చర్చించారు. లొంగిపోయిన మావోయిస్టులకు సంబం ధించిన అంశాలు, వారి పునరావాస చర్యలను కూడా సమీక్షించారు. పోలీసు యూనిట్ల పనితీరుకు సంబం ధించిన ఇతర అంశాలపైనా అధికారులు చర్చించారు. ఆయా యూనిట్లలో నెలకొన్న నేర పరిస్థి తులకు అనుగు ణంగా ప్రాధాన్యాలను ఎప్పటి కప్పుడు మార్చుకోవాలని డీజీపీ సూచించారు. అధి కారులు క్షేత్రస్థాయిలో అందు బాటులో ఉంటూ పరిస్థి తులను నిశితంగా పర్యవేక్షిం చాలని చెప్పారు. నేరాల నివారణ, ఛేదన, దర్యాప్తులో డేటా విశ్లేషణకు ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ స్పష్టం చేశారు. సమర్థమైన ప్రాథమిక పోలీసింగ్, సకాలంలో డేటా విశ్లేషణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నిరంతర పర్యవేక్షణతోనే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. యూనిట్ స్థాయిలో జవాబు దారీతనం, సకాలంలో నిర్ణ యాలు, క్షేత్రస్థా యిలో లక్ష్యిత చర్యలు నేర నియంత్రణను మరింత బలో పేతం చేస్తాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీజీ (లా అండ్ ఆర్డర్) మహేష్ భగవత్, సీఐడీ డైరెక్టర్ శిఖా గోయెల్, ఉమెన్ సేఫ్టీ, సీఐడీ డైరెక్టర్ చారు సిన్హా, ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్యాతో పాటు పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతా ధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



