Saturday, August 29, 2026
E-PAPER
Homeజాతీయంసంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయం

సంయుక్త ప్రకటనపై ఏకాభిప్రాయం

- Advertisement -

బ్రిక్స్ కసరత్తు… మధ్యప్రాచ్య యుద్ధంపై సభ్యదేశాల మధ్య విభేదాలు
న్యూఢిల్లీ : ప్రాదేశిక సమగ్రత, స్వేచ్ఛాయత సముద్ర వాణిజ్యం, పౌరులు – పౌర మౌలిక సదుపాయాలకు రక్షణ వంటి అంశాలపై సంయుక్త ప్రకటన కోసం ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నంలో భాగంగా భారత్, ఇతర బ్రిక్స్ సభ్యదేశాలు ఎలాంటి అరమరికలు లేకుండా చర్చలు జరుపుతున్నాయని తెలుస్తోంది. వచ్చే నెల 12 – 13 తేదీలలో న్యూఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరగబోతోంది. ఈ సందర్భంగా విడుదల చేసే సంయుక్త ప్రకటనపై అంగీకారానికి రావడానికి 11 సభ్యదేశాలు సంప్రదింపులు జరుపుతున్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా – ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య జరుగుతున్న పోరుపై సభ్యదేశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. బ్రిక్స్‌లో ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సభ్యదేశాలుగా ఉండడమే దీనికి కారణం. అజెండాను, సంయుక్త ప్రకటనను రూపొందించుకోవడం, సభ్యదేశాల మధ్య సమస్యలను పరిష్కరించడం వంటి అంశాలపై శిఖరాగ్ర సమావేశానికి ముందే సంప్రదింపులు జరుగుతున్నాయి. సమావేశానికి ముందు కూడా మరోసారి సభ్యదేశాల మధ్య చర్చ జరుగుతుంది.

మధ్యవర్తిత్వం కోసం భారత్ ప్రయత్నాలు
బ్రిక్స్ సమావేశానికి చైనా, రష్యా, ఇరాన్ అధ్యక్షులు హాజరవుతారని తెలుస్తోంది. బ్రిక్స్‌కు అధ్యక్షత వహిస్తున్న భారత్ సభ్యదేశాలతో సంప్రదింపులు జరుపుతూ పారదర్శక మధ్యవర్తిగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇజ్రాయిల్ – పాలస్తీనా సంఘర్షణలపై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ మధ్యప్రాచ్య ఘర్షణలపై మాత్రం అది సాధ్యపడడం లేదు. గతంలో జీ – 20కి అధ్యక్షత వహించినప్పుడు రష్యా – ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అత్యంత క్లిష్టమైన అంశాలపై భారత్ ఏకాభిప్రాయాన్ని సాధించగలిగింది. అయితే ఆ కూటమిలో ఉక్రెయిన్ సభ్యదేశం కాదు. కాగా అమెరికా డాలర్‌కు పోటీగా ప్రత్యేక రిజర్వ్ కరెన్సీని సృష్టించే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య లావాదేవీల వ్యయాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన సాంకేతిక చర్యల పైనే బ్రిక్స్ దేశాలు దృష్టి సారిస్తున్నాయి.

జరిమానాలు విధిస్తానంటూ ట్రంప్ బెదిరింపు
బ్రిక్స్ కూటమి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఒకవేళ బ్రిక్స్ సభ్యదేశాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో డాలర్‌కు స్థానం లేకుండా చేసి వేరే కరెన్సీతో వాణిజ్యం చేసేందుకు ప్రయత్నిస్తే జరిమానాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం బ్రిక్స్‌లో భారత్, బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్, ఇండోనేషియా సభ్యదేశాలుగా ఉన్నాయి. అయితే తన చేరికను సౌదీ ఇంకా అధికారికంగా అంగీకరించలేదు. న్యూఢిల్లీ సదస్సుకు సౌదీని కూడా ఆహ్వానించారు. సభ్యదేశాలనే కాకుండా ఆఫ్రికన్ యూనియన్, లాటిన్ అమెరికా – కరేబియన్ దేశాల సమాఖ్య, గల్ఫ్ సహకార మండలికి చెందిన ప్రాంతీయ సంస్థల అధిపతులను కూడా ఆహ్వానించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -