భారత్‌లో విద్యా స్వేచ్ఛకు సంకెళ్లు!
యూనివర్సిటీలపై కేంద్ర ప్రభుత్వ జోక్యం
2026లో 0.14కు పడిపోయిన అకడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్
న్యూఢిల్లీ : భారత్‌లో విద్యా స్వేచ్ఛ మరింత క్షీణించిందని ఎస్ఏఆర్ సంస్థ అధ్యయనం వెల్లడించింది. 2026లో భారత అకడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ (ఏఎఫ్ఐ) స్కోరు 0.14గా నమోదైంది. 2024లో ఉన్న 0.16తో పోలిస్తే తగ్గుదలను నమోదు చేయడం గమనార్హం. ఉన్నత విద్యా సంస్థల పాలన, నియామకాలు, విద్యా ప్రాధాన్యాలపై కేంద్ర ప్రభుత్వ ప్రభావం పెరుగుతోందని నివేదిక పేర్కొంది. యూజీసీని ప్రభుత్వ ప్రభావానికి ప్రధాన సాధనంగా ఉపయోగి స్తున్నారనే విమర్శలను కూడా ఇది ప్రస్తావించింది. 2025 జులై 1 నుంచి 2026 జూన్ 30 వరకు ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలు, ప్రాంతాల్లో ఉన్నత విద్యా సంస్థలు, విద్యా ర్థులు, అధ్యాపకులపై 382 దాడులు జరిగి నట్టు ఎస్ఏఆర్ వార్షిక సర్వే తెలిపింది. విద్యా ర్థుల భావప్రకటనపై హింసాత్మక పోలీసు, సైనిక చర్యలు భారత్‌తో పాటు మరికొన్ని దేశాల్లో నమోదయ్యాయి. ప్రభుత్వాల హింసాత్మక అణచివేత, విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిలో జోక్యం ప్రపంచవ్యాప్తంగా అకడమిక్ ఫ్రీడమ్ క్షీణతకు ప్రధాన కారణాలని నివేదిక గుర్తించింది.
భారత్ స్కోరులో పతనం
భారత్ అకడమిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ స్కోరు 2024లో 0.16గా ఉండగా, 2026లో 0.14కు పడిపోయింది. నివేదిక భారత్‌ను ‘తీవ్రంగా పరిమితమైన’ విభాగంలో ఉంచింది. గత కొన్నేండ్లుగా భారత్ స్కోరు నిరంతరం తగ్గుతోందని ఎస్ఏఆర్ పేర్కొంది. 2022 నుంచి పరిశోధన, బోధన స్వేచ్ఛపై పెరుగుతున్న ఆంక్షలు ఈ క్షీణతకు కారణమయ్యాయని స్పష్టం చేసింది. అయితే ఈ సూచీ ఒక ర్యాంకింగ్ మాత్రమే కాదు.. పరిశోధన స్వేచ్ఛ, బోధన, భావప్రకటన, సంస్థల స్వయంప్రతిపత్తి వంటి అంశాలను పరిశీలించే కొలమానం. స్కోరు తగ్గడం అంటే ఈ స్వేచ్ఛల పరిస్థితిపై ప్రతికూల సూచనగా పరిగణించబడుతుందని అర్థం.
యూనివర్సిటీలపై కేంద్రం ప్రభావం
భారత ఉన్నత విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం తన అధికారాన్ని విస్తరిస్తోందని ఎస్ఏఆర్ నివేదిక పేర్కొంది. విశ్వవిద్యాలయాల పాలన, నాయకత్వ నియామకాలు, విద్యా ప్రాధాన్యాలపై ఈ ప్రభావం పెరుగుతోందని వివరించింది. అధికార బీజేపీ యూజీసీని ఉన్నత విద్యపై ప్రభుత్వ ప్రభావాన్ని చూపే ప్రధాన సాధనంగా ఉపయోగిస్తోందనే విమర్శలను నివేదిక ప్రస్తావించింది. విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ ఆర్థిక సహకారం పొందుతు న్నప్పటికీ, వాటి విద్యా సంబంధ నిర్ణయాలు, పరిశోధన అంశాలు, అధ్యాపక నియామకాలు రాజకీయ జోక్యం లేకుండా సాగాల్సిన అవసరం ఉందని మేధావులు చెప్తున్నారు.
స్కాలర్స్ ఎట్ రిస్క్ నివేదికలో వెల్లడి
ప్రశ్నించే విద్యార్థులు.. స్వేచ్ఛగా పరిశోధన చేసే అధ్యాపకులు.. స్వతంత్రంగా పనిచేసే విశ్వవిద్యాలయాలు.. ప్రజాస్వామ్యానికి పునాదులైన ఉన్నత విద్యా సంస్థలపై ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి పెరుగుతోంది. స్కాలర్స్ ఎట్ రిస్క్ (ఎస్ఏఆర్) సంస్థ విడుదల చేసిన ఫ్రీ టూ థింక్ 2026 నివేదిక ప్రకారం 59 దేశాలు, ప్రాంతాల్లో ఏడాది వ్యవధిలో ఉన్నత విద్యా సంస్థలపై 382 దాడులు నమోదయ్యాయి. భారత్‌లో విద్యా స్వేచ్ఛ తీవ్రంగా పరిమితమైన స్థాయికి చేరిందని నివేదిక పేర్కొంది. విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తిపై ప్రభుత్వ జోక్యం, విద్యార్థి నిరసనలపై చర్యలు, పరిశోధన స్వేచ్ఛపై ఆంక్షలు దేశ విద్యా వ్యవస్థ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
విద్యార్థుల గొంతుకకు అడ్డుకట్ట
క్యాంపస్‌లలో స్వేచ్ఛాయుత చర్చలను అడ్డుకునే చర్యలు చోటుచేసుకున్నాయని నివేదిక వివరించింది. అధ్యాపకుల తొలగింపులు, విద్యా కార్యక్రమాల రద్దు, విద్యార్థుల భావప్రకటనపై పరిమితులు విధించే కొత్త విధానాలను ఎస్ఏఆర్ ప్రస్తావించింది. విద్యార్థుల నిరసనలు, ఇతర క్యాంపస్ సమావేశాల్లో పోలీసులు హింసకు పాల్పడిన ఘటనలను కూడా నివేదిక పేర్కొంది. ఢిల్లీ యూనివర్సిటీ, బనారస్ యూనివర్సిటీ, ముంబై యూనివర్సిటీల్లో కార్యక్రమాల రద్దు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్), జామియా మిల్లియా ఇస్లామియాలో విద్యార్థి నిరసనలపై అధికారుల ఒత్తిడి వంటి అంశాలను అధ్యయనం ప్రస్తావించింది.
ప్రపంచవ్యాప్తంగా అణచివేత
ఉన్నత విద్యా సంస్థలపై దాడులు భారత్‌కే పరిమితం కాలేదని నివేదిక పేర్కొంది. పలు దేశాల్లో ప్రత్యక్ష ప్రభుత్వ అణచివేతను వివరించింది. 16 దేశాల్లో క్యాంపస్‌లపై హింసాత్మక దాడులు, చొరబాట్లు, ఆక్రమణలు, దాడుల బెదిరింపులను పేర్కొంది. ఎనిమిది దేశాల్లో విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తి క్షీణించిందని అధ్యయనం తెలిపింది. ప్రజాస్వామ్య దేశాల్లోనూ ఉన్నత విద్యపై ఆంక్షలు పెరుగుతున్నాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా అమెరికాలో రాజకీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు, విద్యా విషయాలపై నియంత్రణ, పరిశోధన నిధులపై జోక్యం, విశ్వవిద్యాలయ పాలనా సంస్థల్లో రాజకీయ అనుబంధం ఉన్న వ్యక్తుల నియామకం వంటి చర్యలను ప్రస్తావించింది.
వివాదాస్పద
నిర్ణయాల ప్రస్తావన
భారత్‌లో విద్యా స్వేచ్ఛపై పరిమితులకు ఉదాహరణలుగా కొన్ని ఘటనలను ఎస్ఏఆర్ గుర్తించింది. వీటిలో ఎన్సీ ఈఆర్టీ పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతిపై అధ్యాయం రూపొందించిన ముగ్గురు విద్యా వేత్తలపై సుప్రీంకోర్టు మార్చిలో ఇచ్చిన జీవిత కాల నిషేధ ఉత్తర్వు, తరువాత ఉపసంహరణ, విశ్వవిద్యాలయాల్లో విద్యా, సాంస్కృతిక కార్యక్రమాల రద్దు, విద్యార్థి నిరసనలపై అధి కారుల ఒత్తిడి వంటివి ఉన్నాయి. ఈ ఘట నలు పరిశోధన స్వేచ్ఛ, భావప్రకటన హక్కు, సంస్థల స్వయంప్రతిపత్తిపై చర్చకు దారితీ స్తున్నాయని నివేదిక పేర్కొంది.



