బరేలీ : రాజకీయ ప్రచారం కోసం యూపీలో బీజేపీ నేతలు ఆర్భాటంగా నిర్వహించిన రాఖీ వేడుక విషాదంగా మారింది. కార్యక్రమానికి భారీగా మహిళలను ఆహ్వానించి, తగిన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ(45) మృతి చెందింది. పలువురు గాయపడ్డారు. చిన్నారులకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బరేలీ మేయర్ ఉమేష్ గౌతమ్, ఆయన కుమారుడు పార్థ గౌతమ్ తమ రాజకీయ ప్రచారంలో భాగంగా ‘యువ సేవక్ సంఘ్’, ‘పార్థ్ గౌతమ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో స్థానిక క్లబ్‌లో రాఖీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తమకు రాఖీలు కట్టేందుకు సుమారు 20 వేల మంది మహిళలను ఆహ్వానించారు. రాఖీ కట్టిన అనంతరం చీరలు, స్వీట్లు బహుమతులుగా ఇస్తామని ప్రకటించడంతో నగరం, పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు తరలివచ్చారు.
అయితే భారీ సంఖ్యలో మహిళలు వచ్చినప్పటికీ.. అందుకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో గందరగోళం చోటు చేసుకుంది. స్టేజీపైకి వెళ్లే క్రమంలో ఒక్కసారిగా జనసమ్మర్థం పెరగడంతో మహిళల మధ్య తోపులాట జరిగి ఒకరిపై మరొకరు పడిపోయారు. ఈ ఘటనలో ఊపిరాడక ఓ మహిళ(45) మృతి చెందింది. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గతేడాది ఇదే తరహా కార్యక్రమానికి సుమారు 15 వేల మంది మహిళలు హాజరయ్యారని, ఈసారి ఆ సంఖ్యను 20 వేలకు పెంచినప్పటికీ, అందుకు తగినట్లుగా భద్రతా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు. రాజకీయ ప్రచారం కోసం వేలాది మందిని ఒకచోట చేర్చి, వారి భద్రతను గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మహిళ మృతి చెందినట్టు తమకు సమాచారం అందలేదని పోలీసులు వెల్లడించడం గమనార్హం.
బీజేపీ ప్రచారార్భాటం.. ప్రాణాలు తీసిన రాఖీ వేడుక
- Advertisement -
- Advertisement -



