Saturday, August 29, 2026
E-PAPER
Homeసోపతిఎవరెస్ట్‌‌ను మించిన పర్వతాలు

ఎవరెస్ట్‌‌ను మించిన పర్వతాలు

- Advertisement -

ఎవరెస్ట్‌ ‌కంటే పెద్ద పర్వతాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ మీకు తెలుసా.. భూ అంతర్భాగంలో పెద్ద పర్వతాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి భూ ఉపరితలం పైనున్న ఎవరెస్ట్ కంటే అతి పెద్దవి కావడం విశేషం. ఈ పర్వతాలతో పోలిస్తే ఎవరెస్ట్ చాలా చిన్నదిగా కనిపిస్తుంది. తాజా అధ్యయనం ప్రకారం భూమి లోపల దాదాపు 1,200 మైళ్ల లోతున ఉన్న పర్వతాలను ‘లార్జ్ లో షియర్ వెలాసిటీ ప్రావిన్సెస్ (LLSVPs)’ అంటారు. ఇందులో ప్రతి ఒక్కటీ వేల కిలోమీటర్ల వెడల్పుతో ఎవరెస్ట్ కంటే 100 రెట్లు ఎక్కువ ఎత్తు పెరగడం గమనార్హం. ఎవరెస్ట్ వంటి పర్వత శిఖరాలు భూమి ఉపరితలంపై కనిపిస్తుంటాయి. కానీ, భూమి లోపల ఉన్న పర్వతాలు ‘మాంటిల్’ లోతుల్లో దాగి శాశ్వతంగా అదృశ్యంగా ఉంటున్నాయి. భూమి ఆవిర్భావం, పరిణామ క్రమాన్ని ఈ పర్వతాల అధ్యయనం ద్వారా తెలుసునే వీలుంది.

శాస్త్రవేత్తలు ఎలా కనుగొన్నారు?
భూకంపాలపై దశాబ్దాల పాటు జరిపిన పరిశోధన ఫలితంగానే ఈ భారీ నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. శక్తివంతమైన భూకంపాల తర్వాత భూమి గంట కొట్టినట్లుగా కంపించి అంతర్భాగంలో ప్రకంపనలు వ్యాపింపజేస్తుంది. ఈ భూకంప తరంగాలు ఎలా నెమ్మదిస్తాయి? ఎలా దారి మళ్లుతాయి? ఎలా వేగాన్ని మార్చుకుంటాయి? అనే అంశాలను పరిశీలించే క్రమంలో ఆఫ్రికా, పసిఫిక్ మహాసముద్రం కింద ఉన్న అసాధారణ ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. ‘LLSVP’లుగా గుర్తించిన ఈ అసాధారణ ప్రాంతాలు, భూపొరల్లో అపారమైన, రసాయనికంగా విభిన్నమైన ప్రదేశాలు.
అంతర్భాగంలో పర్వతాల వంటి ఈ నిర్మాణాలు (LLSVP) రాళ్లతో కాకుండా పురాతన పదార్థాలతో నిండి ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం ఇవి బిలియన్ సంవత్సరాల కిందట భూమిలో కలిసిపోయిన పాత సముద్రపు పలకల అవశేషాలు. మరికొన్ని సిద్ధాంతాల ప్రకారం ఇవి భూమి తొలి చరిత్ర నాటివని, ఖండాలు, మహాసముద్రాలకు ఆకారం ఇచ్చిన ప్రక్రియలతో ముడిపడి ఉండవచ్చని చెప్తున్నాయి. వాస్తవానికి ఇవి ఊహించలేనంత సుదీర్ఘ కాలం పాటు స్థిరంగా ఉన్నాయి. భూమి అంతర్గత గతిశీలతకు లంగర్లుగా భూపొర లోతుల్లో మనుగడ సాగిస్తున్నాయి. వేల కిలోమీటర్ల మేర విస్తరించిన వాటి పరిమాణం ఆశ్చర్యం కలిగిస్తుంది.

పరిణామాలకు కారణాలివే?
భూమిలోపల, కంటికి కనిపించని ఈ పర్వతాలు ఉపరితలంపై మార్పులకు కారణంగా తెలుస్తోంది. కరిగిన శిలల పొగలు, ఐస్‌లాండ్ వంటి అగ్నిపర్వత హాట్‌స్పాట్‌లతో LLSVPలకు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అవి భౌగోళిక కాలక్రమేణా టెక్టోనిక్ ప్లేట్ల కదలికను, సూపర్‌కాంటినెంట్ల విచ్ఛిన్నాన్ని కూడా ప్రభావితం చేయవచ్చని వెల్లడిస్తున్నారు. ఖండాల నిర్మాణం, అగ్నిపర్వతాల విస్ఫోటనం, భూ కంపాలకు ఈ పర్వతాల కదలికే కారణమని పేర్కొంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -