నవతెలంగాణ – అశ్వారావుపేట
మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, బోధనా, బోధనేతర సిబ్బందిలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడంతో పాటు శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్. జె. హేమంత్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారత క్రీడా రంగానికి మేజర్ ధ్యాన్‌చంద్ అందించిన సేవలను, ఆయన క్రీడా ప్రస్థానాన్ని వివరించారు. అసాధారణ ప్రతిభతో పాటు కఠోర శ్రమ, క్రమశిక్షణతో ధ్యాన్‌చంద్ దేశానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతిభకు నిరంతర సాధన, పట్టుదల, క్రమశిక్షణ తోడైతేనే విజయాన్ని సాధించగలమని తెలిపారు.

క్రీడలు పోటీలకే పరిమితం కాకుండా విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని హేమంత్‌కుమార్ అన్నారు. క్రీడల ద్వారా మానసిక దృఢత్వం, సమయపాలన, జట్టుగా పనిచేసే తత్వం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కళాశాలలో క్రీడా సదుపాయాలను మరింత అభివృద్ధి చేసి, విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తామని తెలిపారు.
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా పోటీలతో పాటు వ్యాసరచన, ఎలోక్యూషన్, పోస్టర్ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. ‘మన జీవితంలో క్రీడలు, ఆటల ప్రాముఖ్యత’, యువతలో క్రీడల పాత్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి తదితర అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
వివిధ పోటీల్లో విజేతలు, రన్నరప్‌లకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థులతో పాటు కళాశాల సిబ్బందికి ప్రత్యేకంగా క్రీడా పోటీలు నిర్వహించడం కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.
కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీమతి జయమ్మ, డాక్టర్. శిరీష తదితరులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్లు డాక్టర్. జమీమా, డాక్టర్. పి. నీలిమ కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించారు. విద్యార్థులు, బోధనా, బోధనేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



