Saturday, August 29, 2026
E-PAPER
Homeసోపతిపల్లె జీవన సౌందర్యాన్ని పలికించిన‘కోపిక’ బాలల కథలు

పల్లె జీవన సౌందర్యాన్ని పలికించిన‘కోపిక’ బాలల కథలు

- Advertisement -


​నేటి డిజిటల్ యుగంలోని విద్యార్థులు టెక్నాలజీ మోజులో పడిపోయారు. పాఠశాలలో డిజిటల్ పాఠాలుతో, ఇంటిదగ్గర ఫోనులో వీడియోలు, రీల్స్.. ఇలా బిజీగా గడిపేస్తున్నారు. జ్ఞానం మొత్తం ఫోన్లోనే ఉందనే భ్రమలో ఉన్నారు. సాంకేతిక పరికరాలతో కాలం గడుపుతూ సృజనాత్మకతను కోల్పోతున్నరు. అయితే సూర్యాపేట జిల్లా కోదాడ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు అందుకు భిన్నంగా ఉన్నారు. సమాజాన్ని అర్థం చేసుకుంటూ ఉపాధాయుల సహకారంతో వారిలోని ఆలోచనలకు కథలుగా మలిచి ‘కోపిక’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
‘జంతువులకు, పక్షులకు కూడా దయా జాలి గుణాలు ఉంటాయి’ అనే విషయాన్ని రుణం తీర్చుకున్న దున్న అనే కథలో ఎస్ ఉమా మహేష్ చాలా చక్కగా తెలియజేశాడు. అదేవిధంగా కాకి జాలి గుణం గురించి ఎస్. కె రషీద్ తన కథలో ఎంత పెద్ద తప్పు చేసినప్పటికీ ఎదుటివారిని క్షమించినప్పుడు ఎదుటివారిలో పశ్చాత్తాపం కలుగుతుందనే విషయాన్ని తోటి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో చక్కగా రచించాడు. హెచ్. ధర్మేంద్ర చారి రాసినటువంటి అక్షయపాత్ర కథ చాలా ఆలోచింపచేస్తుంది. స్వార్థానికి కాకుండా పరులు కోసం మన సంపద ఉపయోగపడితే మనిషికి ఓ గుర్తింపు వస్తుందని చెప్పాడు.

సంసారం పది కాలాలపాటు పచ్చగా సాగాలంటే మానవ సంబంధాలతో పాటు ప్రకృతితో కూడా బలమైన బంధం ఏర్పడాలని ‘అలక’ అనే కథ ద్వారా యం.హేమంత్ ఆచారి చక్కగా వివరించాడు. ‘యుద్ధం’ కథ ద్వారా యస్.రాఘవేంద్ర సమాజం, పాలకులు, ప్రజలు, వారి శ్రేయస్సు గురించి అద్భుతమైన కథ రాశారు. స్నేహాన్ని నటిస్తూ తోటి వారిని దెబ్బ కొట్టాలని చూస్తే ఆ దెబ్బ తమకే తగులుతుందనే విషయాన్ని ‘చెడపకురా చెడేవు’ అనే కథ ద్వారా యస్.కె.మొబీనా చక్కగా వివరించారు. ‘ఏది దాగదు’ కథలో రాంచరణ్ గణేష్‌లలో వచ్చిన మంచి మార్పును తెలియజేస్తూ యస్.కె. హుస్సేన్ అనే విద్యార్థి మంచి సందేశాన్ని ఈ కథ ద్వారా సమాజానికి అందించాడు. పిల్లలు స్వతహాగా అనేక అంతర్గత శక్తులు కలిగి ఉంటారని పాఠశాల విద్యార్థులను తమ ఉపాధ్యాయులు ప్రోత్సహించటం వల్ల వచ్చిన ఫలితమే ఈ ‘కోపిక’ అనే కథ సంకలనం అని ప్రధానోపాధ్యాయులు ఇందూరి శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. కోదాడ మండల విద్యాశాఖ అధికారి ఎండి సలీం షరీఫ్ ఉపాధ్యాయుల కృషిని అభినందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులలోని సృజనాత్మకతను మేలుకొల్పి వారిని సాహిత్యం వైపు నడిపిస్తున్న నేటి ప్రభుత్వ ఉపాధ్యాయుల కృషికి ప్రత్యేక అభినందనలను తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పిల్లల్లో మరింత సృజనాత్మకత పెంచి కథలు, కవితలు, సాహిత్యాన్ని రాయిస్తూ ఉంటే విద్యార్థులకు సమాజంపై బలమైన పట్టు లభించి వారు మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయగలరని ఈ ‘కోపిక’ కథా సంకలనం ద్వారా మనకు అర్థమవుతుంది.

డా. పూసపాటి వేదాద్రి ,
9912197694

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -