Sunday, August 30, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఆశయ నిబద్దులు... అంకితమైన కుటుంబాలు

ఆశయ నిబద్దులు… అంకితమైన కుటుంబాలు

- Advertisement -

సోమవారం నాడు రైతుసంఘం జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి హఠాత్తుగా కన్ను మూయడం అందరినీ విచారంలో ముంచింది.. వయస్సు రీత్యా పెద్దవారైనా ఆ సమయంలో ఆయన మరణం ఆకస్మాత్తుగానే సంభవించింది. చివరి సమయంలో కూడా ఆయన తనను డిశ్చార్చి చేస్తే వెళ్లి నల్గొండలో జరిగే అఖిలభారత రైతు మహాసభల కోసం కృషి చేయాలని ఆరాటపడినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తన గురించి తెలిసినవారికి ఇదేమీ ఆశ్చర్యం కలిగించలేదు. మల్లారెడ్డి మరణానంతరం మృతదేహం, చర్మం, నేత్రాలు భద్రపరిచి ఇతరులకు అమర్చే ఏర్పాట్లు చేశారు. ఆయన అంతిమయాత్రలో అన్ని రాజకీయ పార్టీల, సంఘాల నేతలు, మేధావులు నివాళులర్పించారు. భౌతికకాయాన్ని గాంధీ అస్ప్రతిలో వైద్య విద్యార్థుల పరీక్షల నిమిత్తం అందజేశారు. ఇటీవలి కాలంలో ఇదొక వరవడిగా మారడం మంచి పరిణామం.

అంకిత భావంతో.. ఆఖరుదాకా..
మల్లారెడ్డి మరణించిన మరురోజునే వి.సుమతి కూడా దూరమయ్యారు. సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నాయకుడు ఏపీ రాష్ట్రకమిటీ మాజీ కార్యదర్శి మధు సతీమణి మాత్రమే గాక నిబద్ద కార్యకర్త, చదువరి, రచయిత సుమతి. కుమార్తె డా. ప్రతిభ వైద్యశాలలో గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో పెనుగులాడుతూ ఆఖరిశ్వాస విడిచారు. ఆమె శరీరాన్ని కూడా ప్రభుత్వ వైద్యశాలకు అప్పగించారు. దీనికి కొన్నిరోజుల ముందు విశాఖ పట్టణంలో ప్రజాకళాకారుడు సిఐటియు కార్యకర్త అరుణ్‌‌జీ తన ఎనభయ్యవ యేటా చనిపోయారు. ఇప్పటికీ దాదాపు అయిదు దశాబ్దాలుగా ప్రజానాట్య మండలిలో, ఉద్యమాలలో కృషి చేస్తూ వస్తున్న అరుణ్‌జీ అందరికీ సుపరిచితులు. జాతీయస్థాయిలోనూ కొంతమంది కీలక నేతలు మేధావులు ఈ సమయంలోనే దూరమయ్యారు. కొద్దిరోజుల కిందట ప్రఖ్యాత చరిత్రకారుడు సుమిత్‌ ‌సర్కార్‌ అస్త మించారు. ఆధునిక భారత చరిత్రను ఉద్యమాలను వర్గదృక్పథంతో సామాజిక అవగాహనతో పరిశోధించి అక్షరీకరించిన సుమిత్‌ ‌తన రంగంలో అగ్రగామి. ఆయన్ను చాలామంది అధ్యయానికి మార్గదర్శిగా పరిగణిస్తారు. ఇక ఐద్వా నేతగా కీలకమైన సేవలనందించిన పరిశోధకురాలు, సోన్యా గిల్‌ ‌కూడా ఈ వారంలోనే కన్నుమూశారు. పీపుల్స్‌ ఆర్కివ్స్‌ ఆఫ్‌ ఇండియా పేరిట ప్రజా ఉద్యమాల ప్రజారాశుల చరిత్ర నిక్షిప్తం చేయడానికి కృషిచేసిన సోన్యా ప్రఖ్యాత పాత్రికేయుడు పాల గుమ్మి సాయినాథ్‌ ‌భార్య. అనేక మహిళా ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి వాస్తవాలను వెలికితీసిన ప్రతిభావంతురాలు.

వైవిధ్య సేవలు..
వీరందరి వివరాలు ఇక్కడ ప్రస్తావించడం సెంటిమెంటు కోసమో లేక విచారించడం కోసమో కాదు. దేశమంతటా వివిధ రంగాల్లో, వివిధ స్థాయిల్లో ఉద్యమకారులు, ప్రజాపక్ష మేధావులు ఎంత వైవిధ్య భరితమైన కృషి చేస్తున్నారో ఎర్రజెండాను సమున్నతంగా ఎగరేస్తున్నారో స్మరించు కోవడానికి, నివాళులర్పించడానికి మాత్రమే.ఈ కాలంలో తెలుగు నాట, దేశంలో కూడా మరికొంతమంది నేతలు కార్యకర్తలు కూడా ప్రాణాలొది లారు. అందరి పేర్లు ఇక్కడ పేర్కొనడం సాధ్యం కాకపోవచ్చు గానీ వారంతా అంతే అంకితభావం గలవారన్నది ఇక్కడ కీలకం. గతవారం ఇదే శీర్షికలో జెన్‌ ‌జెడ్‌ ‌పోరాటం తీసుకొచ్చిన సంచలనం గురించి చెప్పు కున్నాం. ఇది దానికి మరో పార్శ్యం. యావజ్జీవితం విప్లవాశ యాలకు, ప్రగతిశీల భావజాలానికి సమర్పించిన సార్థక జీవుల సంస్మ రణ. విశేషమేమంటే వీరందరూ దంపతులు పిల్లలూ పెద్దలూ కుటుంబాలతో సహా తరాల పర్యంతం ఉద్యమ పథంలో వున్నవారే కావడం.

మళ్లీ మల్లారెడ్డినే తీసుకుంటే ఆయన స్వతహాగా పటేల్‌ ‌పనిచేసిన వారు. అయితే ప్రభుత్వ అన్యాయాలపై ఎలుగెత్తి నిలబడి ఐచ్చికంగా ఉద్యోగం వదులుకున్నారు. ప్రజాఉద్యమాలకు పేరెన్నిక గన్న వరంగల్‌‌లో దశాబ్దాల తరబడి కృషిచేశారు.1971లో సీపీఐ(ఎం)కు ఏకైక ఎమ్మెల్యేగా ఓంకార్‌‌ను గెలిపించిన నర్సంపేట ప్రాంతంలో అనేక ఆటు పోట్లను తట్టుకున్నారు, నిర్మాణాత్మక కృషి చేశారు. తర్వాత కాలంలో హైదరాబాద్ వచ్చి రాష్ర్ట నాయకత్వంలో కీలక పాత్ర పోషించారు. ఆయన పెద్ద పట్టాలు తీసుకోలేదు. కానీ, ఉద్యమావసరాల కోసం విస్తారంగా అధ్యయనం చేశారు. ఆయన భార్య భాగ్యలక్ష్మమ్మ రైతు సంఘంలో, మహిళా సంఘంలో పనిచేశారు. కుమారులు‌ వాసుదేవ్‌, మధుసూదన్‌ కూడా ఉద్య మంతోనే నిలిచారు. ఇద్దరూ కోవిడ్‌‌లో కరోనా బారిన పడి కూడా తట్టుకున్నారు.

కుమార్తె కాన్సర్‌తో పోరాడుతూ ‌మృతి చెందితే అకాలమరణాన్ని కూడా తట్టుకుని నిలబడ్డారు. ఇన్ని సవాళ్ల మధ్యనా మల్లారెడ్డి అకడమిక్‌ ‌రంగంలో వారితో పోటీ పడేలా ఎప్పుడూ సాధికారిక సమాచారం సేకరిస్తూ లెక్కలు, పత్రాలతో సిద్ధంగా వుండేవారు. రాజకీయ, మీడియా మిత్రు లందరికీ ఆయన ఒక సమాచార వనరు, నెనరు. వ్యవసాయం నీటిపారుదల అంశాలపై ఆ తరంలో కొరటాల సత్య నారాయణగారి తర్వాత మల్లారెడ్డినే చెప్పుకోవలసి వుంటుంది. వ్యక్తిగతంగానూ నాకూ చాలా సన్నిహితులు. తనతో రైతు సంఘంలో పనిచేసిన మా నాన్న నరసింహయ్య మొదటి రోజుల్లో చెప్పిన అర్థశాస్ర్తం క్లాసులు ఎంతగా ఉపయోగపడ్డాయో ఎప్పుడూ గుర్తు చేసుకునేవారు. నాన్న మరణానంతరం ఒకసారి స్మారక ప్రసంగం చేసేందుకు వచ్చిన మల్లారెడ్డి ఉదయాన్నే బయలుదేరనున్న వాహనం కోసం చూడకుండా అదే రాత్రి బస్సెక్కి సెమినార్‌‌ కోసం తిరిగి వెళ్లిపోవడం బాగాగుర్తు.

సుమతి, అరుణ్‌‌జీ
సుమతి పుట్టింది కూడా కమ్యూనిస్టు ఉద్యమ కేంద్రంగా పేరొంది, ఘోర నిర్భందం చూసిన కాటూరులో. ఆమె తండ్రి వల్లపల్లి నాగభూషణం, తల్లి తులసమ్మ. కుటుంబం కూడా ఉద్యమాభిమానులు. పెండ్లి సమయానికి మధు ఎస్‌ఎఫ్‌ఐ తొలి రాష్ట్ర కార్యదర్శి. నిజానికి నన్ను ప్రజాశక్తిలో చేరాలని ఆహ్వానిస్తూ తొలుత లేఖరాసి పిలిపించింది మధునే. చాలాకాలం వారి ఇంటిపక్కన గదిలోనే నేనూ వుండేవాణ్ని, ఆమె ఉన్నతాధికారిగా ప్రభుత్వోద్యోగం చేస్తూనే ఆశయ నిబద్దత ప్రదర్శించారు. కుటుంబ బాధ్యతలు ఉద్యోగంతో పాటు స్వయంకృషితో అధ్యయనం చేశారు. ప్రజాశక్తికి ఆదివారం సంచికకు చాలాసార్లు రచనలు ఇస్తుండేవారు. పదవీ విరమణ తర్వాత బుక్‌‌హౌస్‌‌కోసం కొంతకాలం పని చేసినప్పుడే మతం మార్కెట్‌ ‌గుప్పిట్లో మహిళ, అందరికీ ఆరోగ్యం వంటి ముఖ్యమైన రచనలు, అనువాదం చేశారు. ఇందులో మతం మార్కెట్‌ ‌గుప్పిట్లో అనేది చాలా కీలకమైన అధ్యయన పత్రాల సంకలనం. మార్కెట్‌ ‌యుగంలో మహిళల మనుగడ సవాళ్లు ఏమిటో చెబుతుంది..మానవి పత్రికలోనూ ఆమె కృషిచేశారు. ఉద్యమానికి ఆర్థికంగా చేతనైన సహాయం అందిస్తూ వచ్చారు. ఆమె కూతురు డాక్టర్‌ ‌ప్రతిభ, అల్లుడు మదుసూదన్‌ ‌కూడా ఉద్యమాభిమానులుగా నిలిచారు. అరుణ్‌‌జీ కుటుంబం కూడా ఈ కోవలోనే ఆయనతో నిలబడింది. ఆయన అనారోగ్యం పాలయ్యాక గొంతు దెబ్బతిన్నాక కూడా వారు జాగ్రత్తగా చూసుకోవడమే గాక సభలకు తీసుకొస్తుండేవారు. కమ్యూనిస్టులే కుటుంబాలను ఉద్యమాలలోకి తీసుకురారనే అపప్రధకు సమాధానం ఇలాటి ఉదాహరణలు.

శిఖరాగ్ర చరిత్రకారుడు..
ఇక చరిత్రకారుడూ, బోధకుడూ సుమిత్ సర్కార్‌ ‌కృషి శిఖరాగ్రమైనది. తన తండ్రిగారైన సుశోధన్‌ ‌చంద్ర సర్కార్‌‌ కూడా కోలకతా ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్‌. తొలితరంలో మార్క్సిస్టు పరిశోధనా పద్ధతిని అధ్యయనాన్ని ప్రోత్స హించ డమే గాక కమ్యూనిస్టు ఉద్యమానికి సన్నిహితంగా మెలిగినవారు. సుమిత్‌ ‌సర్కార్‌ ‌కూడా అదే కోవలో పెరిగి పరిజ్ఞానం పెంచుకున్నారు. ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యయనం చేశాక 1974లో ఢిల్లీ యూనివర్సిటీలో చేరారు. అధ్యయనం బోధనతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌(‌డియుటిఎ)లో చురుగ్గా పనిచేశారు. గతితార్కిక దృష్టితో ఆధునిక భారత దేశ చరిత్రలో వివిధ తరగతులు వర్గాల ప్రాత, మరీ ముఖ్యంగా బెంగాల్‌‌లో ఉద్యమాలు వంటివాటిని విస్తరంగా అధ్య యనం చేశారు. స్వదేశీ ఉద్యమం, ఆధునిక భారత దేశం అన్న ఆయన రచనలు ప్రామాణికమైనవి. ఈ చివరి పుస్తకాన్ని పున:పరిశీలనతో మరోసారి మెరుగుదిద్దారు. మత రాజకీయాల ముప్పు పెరిగాక తొలుత వెలువడిన ఖాకీ షార్ట్స్‌ సాఫ్రాన్ ప్లాగ్స్‌ ‌తీసుకొచ్చారు. ఇవన్నీ చదువరులకు సుపరిచితాలే. కేవలం రచనలే గాక బోధనలోనూ సుమిత్‌ ‌తనదైన విలక్షణ శైలితో ఒక ముద్రవేశారు. బెంగాలీ భాషలో తరచూ చెప్పుకునే భద్రలోక్‌ అనే మధ్యతరగతి ధోరణలను అధిగమించి ఉద్యమాలతో మమేకమయ్యారు.

సోన్యా గిల్‌
పాలగుమ్మి సాయినాథ్‌‌ తాత వివి గిరి మాజీ రాష్ర్టపతి. తొలిదశలో గిరి కాంగ్రెస్‌ ‌కార్మికోద్యమంలో పనిచేశారు. సాయినాథ్‌‌తో పెండ్లికి ముందే సోన్యాగిల్‌ జెఎన్‌‌యులో విద్యార్థి ఉద్యమాలతో ఉన్న వ్యక్తి. తర్వాత కాలంలో మహిళల హక్కుల కోసం రైతాంగ సమస్యల కోసం గట్టిగా కృషి చేశారు. ఐద్వా మహారాష్ర్ట కార్యదర్శిగానూ పనిచేశారు. ఎప్పటికప్పుడు కరపత్రాలు,పుస్తకాలు, పత్రికల వంటివి తీసుకురావడమే గాక క్షేత్రస్థాయిలోనూ విశేష కృషి చేశారు. సామాన్య ప్రజల జీవితాలను ఉద్యమాలు పోరాటాలను నిక్షిప్తం చేయాలనే తపనతో నెలకొల్పిన పీపుల్స్‌ ఆర్కివ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఆమె డైరెక్టర్‌‌గా వున్నారు. సోన్యా గిల్‌ ‌సేవలను కొనియాడుతూ పెద్దలు చెప్పిన నివాళులు చూస్తే ఆమె ఉద్యమంతో ఎంతగా పెనవేసుకుపోయారో తెలుస్తుంది. మరణానికి వారం ముందే ఆమె హైదరాబాద్‌‌లో వదిన(సాయినాథ్‌ ‌పెద్దక్క) 75వ పుట్టిన రోజుకు వచ్చి వెళ్లాడం విశేషం. ‘పని మొత్తం సోన్యా చేస్తుంది రచనకు పేరు మాత్రం సాయినాథ్‌‌కు దక్కుతుంది’ అని ఆమె అత్తగారు అంటుండేవారని తీస్తా సెతల్వాద్‌ ‌రాశారు.

సావ్రితి.. జానకి నుంచి..
ఇంత ప్రత్యక్షంగా కాకున్నా ఈ వారమే కన్నుమూసిన షాహుకారు జానకి తొలుత అక్కినేని పక్కన ప్రముఖ కథానాయికగా చేసింది. కమ్యూనిస్టులు తీసిన ‘రోజులు మారాయి’ చిత్రంతోనే, జానకి, చెల్లెలు కృష్ణకుమారి రాజమండ్రిలో కమ్యూనిస్టు కార్యాలయం దగ్గర మెస్‌‌నడుపుతున్న అమ్మగారితో కలసివుంటూ ప్రజానాట్యమండలికి చేరువయ్యారు. మహా నటి సావిత్రి తొలిసారి పూర్తికథానాయికగా చేసింది కూడా పీపుల్స్‌ ఆర్ట్‌ ‌థియేటర్‌ ‌పేరిట తీసిన పల్లెటూరులో ఎన్టీఆర్ పక్కనే. ఇక జమున అచ్చంగా డాక్టర్‌ ‌రాజారావు ‘పుట్టిల్లు’తోనే పరిచయమ య్యారు. సావ్రితి కన్నా ముందు అగ్ర నాయికగా వున్న జి.వరలక్ష్మి చాలాకాలం కమ్యూనిస్టుపార్టీకి గట్టి అభిమాని. ఈ వివరాలు, జాబితా ఇలా చాలా రా యొచ్చు. వీరందరి నేపథ్యాలు సేవలూ ఒకే తరహాకు చెందినవి కూడా కాదు. ఉద్యమాలు, సాహిత్యం, చరిత్ర, కళలూ అన్నీ వున్నాయి. ఆశయ నిబద్దమైన కుటుంబాలు వ్యక్తుల కృషి ఎలా ఆఖరి వరకూ కొనసాగిందో, సపరివారంగా వారు ఉద్యమాల బాటలో ఎలా నిలిచి వున్నారో గమనించకుండా వ్యాఖ్యలు చేసేవారికి ఈ ఉదాహరణలే సమాధానాలు. నేరుగా కనిపించకపోయినా ఆ ప్రభావాలు చాలా వున్నాయని కూడా చెబుతాయి. ఈ వరవడి కొనసాగుతూనే వుందనడానికి జెన్‌ ‌జీ నేహాబోరా, ఐషీ ఘోష్‌ ‌వంటివారు తాజాగా పర్యటించి వెళ్లిన సమావేశాలు ఇచ్చిన ఉత్సాహమే నిదర్శనం. ఎదురుదెబ్బలు ఆటుపోట్లు ఎన్నయినా ఈ కృషి ఆగేది కాదు. ఒక కవితలో రాసినట్టు ఆశయం చిరంజీవి, అలా నడిపిస్తూనే వుంటుంది…

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -