Sunday, August 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కౌన్సిల్ సమావేశంలో పరస్పర విమర్శలు సిగ్గుచేటు

కౌన్సిల్ సమావేశంలో పరస్పర విమర్శలు సిగ్గుచేటు

- Advertisement -

– ప్రజలకు కౌన్సిల్ సభ్యులు క్షమాపణ చెప్పాలి: విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు వినయ్‌కుమార్
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ప్రజా సమస్యల పరిష్కారం, పట్టణ అభివృద్ధిపై చర్చించాల్సిన వేదికగా ఉండాల్సి ఉండగా, శనివారం జరిగిన సమావేశంలో ప్రజలకు ఉపయోగపడే అంశాలపై సమగ్ర చర్చ జరగకుండా కౌన్సిలర్లు పరస్పర విమర్శలు, ఆరోపణలకే ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటని విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కొత్మిర్కార్ వినయ్‌కుమార్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో విద్యార్థి సేన ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కామారెడ్డి పట్టణ ప్రజలు రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, మౌలిక వసతులకు సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆయా సమస్యల పరిష్కారానికి కౌన్సిల్ సమావేశంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉండగా, వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ఆరోపణలకు సమయం కేటాయించడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందన్నారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన నిధులు, ప్రణాళికలు, మౌలిక వసతులపై చర్చించి ప్రతి సమస్య పరిష్కారానికి గడువుతో కూడిన కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేశారు. కౌన్సిల్ సమావేశాలను రాజకీయ విమర్శలకు వేదికగా కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా మార్చాలని సూచించారు.

ప్రజా సమస్యలను పక్కనపెట్టి పరస్పర విమర్శలకు ప్రాధాన్యత ఇచ్చినందుకు కౌన్సిల్ సభ్యులు కామారెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని వినయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఇకనైనా వ్యక్తిగత విమర్శలు, రాజకీయ ఆరోపణలకు స్వస్తి పలికి ప్రజా సమస్యలు, పట్టణ అభివృద్ధి, పరిష్కార చర్యలపై దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో విద్యార్థి సేన నాయకులు పాషా, రవికాంత్, చందు, రాజు, ఈశ్వర్, నోమన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -