మార్చిలో 3.4 శాతానికి ద్రవ్యోల్బణం
యుద్ధ సెగతో బడ్జెట్ అస్తవ్యస్తమే..!
న్యూఢిల్లీ : అమెరికా యుద్ధోన్మాదంతో అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల వాతావరణం భారత సామాన్యుడి కష్టార్జితాన్ని అమాంతం హరించివేస్తోంది. ధరలు భగ్గుమనడంతో ప్రజల జేబుకు చెల్లు పడుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 3.21 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ.. మార్చి నాటికి 3.4 శాతానికి ఎగిసింది. ఇది పేద, మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది మరింత పెరగొచ్చని స్పష్టమైన సంకేతాలు వెలుపడుతున్నాయి. అమెరికా సామ్రాజ్యవాదంతో పశ్చిమాసియాలో రేపిన యుద్ధ చిచ్చుతో హార్ముజ్ జలసంధి దిగ్బంధనం వంటి పరిణామాలతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల మార్కు ను దాటడం నిత్యావసరాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది.ప్రజల కడుపు కొట్టేలా మార్చిలో ఆహార ద్రవ్యోల్బణం 3.87 శాతానికి ఎగబాకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇది మరింత ఎక్కువగా 3.63 శాతంగా నమోదు కావడంతో పల్లెవాసుల ఆదాయాలు సన్నగిల్లుతు న్నాయి. ఫిబ్రవరిలో 3.47 శాతంగా ఉన్న ఆహార ధరలు మరింత పెరగడం వల్ల నిత్యం వాడే వస్తువుల ఖరీదు పెరిగి, సంపాదనలో అత్యధిక భాగం కేవలం తిండికే ఖర్చవుతోంది. ఆదాయం స్థిరంగా ఉండి ఖర్చులు ఇలా పెరగడం వల్ల ప్రజల పొదుపు హరించుకుపోవడమే కాకుండా జీవన ప్రమాణాలను దిగజార్చనున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వెండి ధరలు 150 శాతం ప్రియం..
ఆభరణాల మార్కెట్‌లో ధరల పెరుగుదల ఊహకందని స్థాయికి చేరింది. వెండి ఆభరణాల ధరలు ఏకంగా 148.61 శాతం పెరగడం, బంగా రం, ప్లాటినం ధరలు 45.92 శాతం ఎగబాకడం సామాన్యుడికి ఆభరణాలను అందని ద్రాక్షగా మార్చాయి. ఆపద కాలంలో ఆదుకుంటాయని నమ్ముకునే బంగారాన్ని కొనుగోలు చేసే శక్తిని సామాన్యుడు కోల్పోవడం వారి భవిష్యత్తు ఆర్థిక భద్రతను దెబ్బతీసే అంశం. రూపాయి విలువ 95 చేరువలో బలహీన పడటంతో దిగుమతి చేసుకునే ప్రతి వస్తువు భారం ప్రజల పైనే పడుతోంది.
ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ద్రవ్యోల్బణం సగటున 4.6 శాతం ఉండవచ్చని ఆర్బీఐ అంచనా వేయడం భవిష్యత్తుపై భయాన్ని కలిగిస్తోంది. హార్ముజ్ జలసంధి గుండా వచ్చే 40 శాతం చమురు దిగుమతు లకు ఆటంకం కలిగితే ధరల భారం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు అంచనా వేస్తోన్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడంతో ప్రజల ఆదాయాలను ఈ ధరల పెరుగుదల నిశ్శబ్దం గా మింగేయడం దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా సామాన్యుడి జీవనంపై కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చని విశ్లేషిస్తున్నారు. ఆదాయాలు పెరగని స్థితిలో ఇలా నిత్యావసరాల ధరలు పెరగడం అనేది ప్రజల నికర ఆదాయాన్ని హరించివేసే పరిణామాలు అత్యంత ఆందోళకరమని హెచ్చరిస్తున్నారు.
సామాన్యుడి జేబుకు ధరల చిల్లు
- Advertisement -
- Advertisement -



