– మా శక్తి ఏంటో అమెరికాకు బాగా తెలుసు..ఇరాన్
– హార్ముజ్ జలసంధి జోలికివస్తే తడాఖా చూపుతాం : ఐఆర్‌జీసీ
– చర్చలకు ఇరాన్ రాకపోయినా పట్టించుకోను : ట్రంప్
– నేను అమెరికా సర్కారుకు భయపడను : పోప్ లియో
టెహ్రాన్ : ఇరాన్ ఓడరేవులకు ముప్పు కలిగిస్తే ప్రాంతీయ పరిణామాలు తీవ్రమవుతాయని టెహ్రాన్‌లోని ఖటమ్ అల్-అన్బియా కేంద్ర కార్యాలయ ప్రతినిధి హెచ్చరించారు. ఇరాన్ ఓడరేవుల భద్రతకు ముప్పు ఏర్పడిన పక్షంలో పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లలోని ఏ ఓడరేవూ సురక్షితంగా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిలో నౌకల ప్రయాణాన్ని అడ్డుకుంటానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనకు ప్రతిగా ఇరాన్ ఈ హెచ్చరికలు జారీ చేసింది. కాగా అన్ని పక్షాలు సంయమనం పాటించాలని చైనా హితవు పలికింది. సముద్ర రవాణా స్వేచ్ఛగా, సుస్థిరంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగినప్పుడే అంతర్జాతీయ సమాజం యొక్క ప్రయోజనాలు నెరవేరతాయని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జైకన్ చెప్పారు. ఇంధన భద్రతను పరిరక్షించి, సరఫరాలు సజావుగా జరిగేలా చూడడంలో అన్ని పక్షాలతో క లిసి పని చేసేందుకు చైనా సిద్ధంగా ఉన్నదని తెలిపారు.
ఇరాన్ బేషరతుగా హార్ముజ్ జలసంధిని తెరవని పక్షంలో దానిని మూసివేస్తామని, చమురు నౌకల ప్రయాణాన్ని అడ్డుకుంటానని ట్రంప్ బెదిరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన అమెరికా నౌకాదళానికి ఆదేశాలు కూడా జారీ చేశారు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో మధ్యప్రాచ్య ముడి చమురుపై ఆధారపడిన కొన్ని దేశాలు ఆర్థికంగా నష్టపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. బాధిత దేశాలలో అమెరికా కూడా ఉంది. హార్ముజ్‌ను తెరవాలని నిన్నటి వరకూ డిమాండ్ చేసిన ట్రంప్ ఇప్పుడు తాజాగా ఆ జలసంధిని మూసేస్తానని ఎందుకు బెదిరించారు?
ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకే…
వాస్తవానికి జరిగిందేమిటంటే హార్ముజ్ జలసంధి సాంకేతికంగా మూతపడలేదు. ఒక్కో నౌక నుంచి రెండు మిలియన్ డాలర్ల టోల్ ఫీజును వసూలు చేసిన ఇరాన్…జలసంధిని దాటేందుకు చమురు ట్యాంకర్లను అనుమతిస్తోంది. అదీకాక యుద్ధ సమయంలో ఇరాన్ నౌకలు స్వేచ్ఛగా హార్ముజ్‌లో రాకపోకలు సాగించాయి. గత నెలలో ఇరాన్ సగటున రోజుకు 1.85 మిలియన్ బ్యారల్స్ చమురును ఎగుమతి చేయగలిగింది. గడచిన మూడు నెలల కాలంలో ఎగుమతి అయిన చమురుతో పోలిస్తే అదనంగా రోజుకు లక్ష బ్యారల్స్ చమురు హార్ముజ్‌ను దాటింది. హార్ముజ్‌ను పూర్తిగా మూసివేస్తే ఇరాన్ ప్రభుత్వానికి, సైనిక కార్యకలాపాలకు కీలకమైన ఆర్థిక వనరు అందకుండా పోతుందని ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్ చమురును కూడా అడ్డుకుంటే ప్రపంచ దేశాలలో దాని ధరలు భగ్గుమంటాయి కాబట్టే అమెరికా నౌకాదళం ఇప్పటి వరకూ టెహ్రాన్ నౌకలను ఆ ప్రాంతం నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతిస్తూ వచ్చింది. నిజానికి అమెరికా ప్రభుత్వం గత నెలలో ఇరాన్‌కు తాత్కాలిక లైసెన్స్ కూడా జారీ చేసింది. ఫలితంగా ఇరాన్ వివిధ దేశాలకు చమురును విక్రయించింది. ఇరాన్ చమురుపై అనేక దశాబ్దాలుగా ఆంక్షలు విధిస్తూ వచ్చిన అమెరికా…గత నెలలోనే వాటిని సడలించింది. దీంతో అక్కడి నుంచి చమురు సరఫరాలు బాగా పెరిగాయి. 140 బ్యారల్స్ చమురు వివిధ ప్రాంతాలకు చేరుకుంది. ప్రపంచ చమురు డిమాం డులో కొంతమేర తీరింది. హార్ముజ్‌లో చమురు నౌకల రవాణాను పూర్తిగా అడ్డుకుంటానని ట్రంప్ తాజాగా చేసిన హెచ్చరికల నేపథ్యంలో చమురు, గ్యాస్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
సముద్ర పోరు తప్పదా? వ్యూహ-ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్న అమెరికా, ఇరాన్
టెహ్రాన్/వాషింగ్టన్ : హార్ముజ్ జలసంధిని ఇరాన్ తిరిగి తెరిచేలా చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే దానిని మూసేస్తానంటూ రంకెలు వేస్తున్నారు. ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమైన తర్వాత వ్యూహాత్మకంగానే ఆయన ఈ కొత్త పల్లవిని అందుకున్నారు. ‘ఒక నౌకనో లేదా అన్ని నౌకలనో అడ్డుకుంటాం. వాటిని హార్ముజ్‌లో ప్రవేశించనీయం. నిష్క్రమించనీయం’ అని హెచ్చరించారు. వాస్తవానికి ఇది ఓ పురాతన సముద్రయాన వ్యూహం. ట్రంప్ తాజా హెచ్చరికతో ఇరాన్-అమెరికా యుద్ధం కొత్త మలుపు తిరిగింది. అది సముద్ర పోరుకు దారితీస్తుందేమోనన్న ఆందో ళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ఓడరేవులలో ప్రవేశించే లేదా నిష్క్రమించే నౌకలను మాత్రమే అడ్డుకుంటామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) సోమవారం వివరణ ఇచ్చింది.
‘మూసివేత’ ఎత్తుగడ
టోల్ ఫీజు ద్వారా ఇరాన్‌కు ఆదాయం లభించడం ఇష్టం లేని అమెరికా ప్రభుత్వం తాజాగా ‘హార్ముజ్ మూసివేత’ ఎత్తుగడ వేసింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో 20 శాతానికి పైగా హార్ముజ్ ద్వారానే సాగుతోంది. ఈ జలసంధి ద్వారా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియాలకు ఎక్కువగా ఇంధన రవాణా జరుగుతోంది. అమెరికా, యూరప్‌లు దీనిపై పెద్దగా ఆధారపడడం లేదు. కానీ గల్ఫ్ సహకార మండలి (జీసీసీ)లోని ఆరు సభ్య దేశాలలో కనీసం ఐదు దేశాలు తమ మనుగడ కోసం హార్ముజ్ పైనే ఆధారపడుతున్నాయి. ట్రంప్ తాజా హెచ్చరిక నేపథ్యంలో అమెరికా నౌకాదళం రెండు పనులు చేయాల్సి ఉంటుంది. హార్ముజ్‌లోని అంతర్జాతీయ సముద్రయాన మార్గంలో ఇరాన్ అమర్చిన మందుపాతరలను ధ్వంసం చేయడంతో పాటు ఇరాన్ ఓడరేవులలో ప్రవేశించే లేదా నిష్క్రమించే నౌకలను అడ్డుకోవాలి. అటు ఇరాన్ కూడా ప్రతి వ్యూహాలకు పదును పెడుతోంది. ఇరాన్ వద్ద 20 ఘదిర్ శ్రేణి మిడ్‌జెట్ జలాంతర్గాములు ఉన్నాయి. ఒక్కో జలాంతర్గామి బరువు 125 టన్నులకు పైగా ఉంటుంది. వీటితో పాటు ఇరాన్ వద్ద నౌకలను ద్వంసం చేసే అనేక బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ఉన్నాయి.
హార్ముజ్‌ను తెరిచింది కానీ…
చర్చల కోసం తాము ముందస్తుగా విధించిన కీలక షరతు (హార్ముజ్‌ను తెరవడం)ను ఇరాన్ ఉల్లంఘించిందని ట్రంప్ ఆరోపించారు. అయితే హార్ముజ్‌ను ఇరాన్ తెరిచినప్పటికీ ఓ మెలిక పెట్టింది. తమ ప్రాదేశిక జలాలలోని ఖెషమ్, లారక్ దీవుల మీదుగా నౌకాయానం సాగించాలని ఇరాన్ అధికారులు సలహా ఇచ్చారు. ప్రామాణిక అంతర్జాతీయ జల మార్గాలలో అమర్చిన మందుపాతరల కారణంగా ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నదని, అందుకే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ దాడులు మొదలు పెట్టిన తర్వాత జల మార్గాలలో ఇరాన్ మందుపాతరలు అమర్చిన విషయం తెలిసిందే. ఇరాన్ సూచించిన కొత్త జల మార్గాన్ని షిప్పింగ్ అధికారులు ‘టెహ్రాన్ టోల్ బూత్’గా పిలుస్తున్నారు. ఈ మార్గం ద్వారా రాకపోకలు సాగించే నౌకల నుంచి ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తోంది. కాల్పుల విరమణ మొదలైనప్పటి నుంచి ఈ మార్గంలో పదికి పైగా నౌకలు ప్రయాణించాయి. అయితే అవి ఇరాన్‌కు టోల్ చెల్లించాయా లేదా అన్నది తెలియరాలేదు.
ఇరాన్ అణ్వాయుధాలను కోరుకుంటుంది : ట్రంప్
తమతో చర్చలకు ఇరాన్ మరోసారి రాకపోయినా పట్టించుకోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ‘వారు వచ్చినా, రాక పోయినా డోంట్ కేర్. వారు చర్చ లకు తిరిగి రాకపోయినా నాకేమీ కాదు. ఐ యామ్ ఫైన్’ అని అన్నారు. ఫ్లోరిడా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మేరీలాండ్‌లోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఆయన సోమవారం పాత్రికేయులతో మాట్లాడుతూ అణ్వాయుధాలను కోరుకుంటు న్నానని ఇస్లామాబాద్‌లో జరిగిన సమావేశంలో ఇరాన్ చెప్పిందని తెలిపారు. ‘వారు ఇప్పటికీ అణ్వాయుధాలను కోరుకుంటు న్నారు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు’ అని ట్రంప్ అన్నారు.
అమెరికా విదేశాంగ విధానాన్ని చూసి పోప్ భయపడుతున్నాడు : ట్రంప్
అమెరికా ప్రభుత్వమంటే భయం లేదు: పోప్ లియో
ఇరాన్ యుద్ధంపై తాను వ్యక్తం చేసిన అభిప్రాయాలను తప్పుపడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై పోప్ లియో సోమవారం స్పందించారు. అమెరికా ప్రభుత్వమంటే తనకు భయమేమీ లేదని వ్యాఖ్యానించారు. ఆఫ్రికా ఖండంలో పది రోజుల పర్యటన నిమిత్తం బయలుదేరిన పోప్ లియో విమానంలో విలేకరులతో మాట్లాడుతూ ‘ట్రంప్ ప్రభుత్వమంటే నాకు భయం లేదు. సువార్త సందేశాన్ని బిగ్గరగా వినిపించేందుకు కూడా భయపడను. విశ్వసించిన దానిని గురించి చెప్పేందుకే ఇక్కడ ఉన్నాను. మేము రాజకీయ నాయకులం కాము. విదేశాంగ విధానాన్ని ఆయన ఏ కోణంలో చూస్తున్నారో నేను కూడా అదే విధంగా చూడను. అయితే సువార్త సందేశాన్ని ఓ శాంతి ప్రదాతగా చూస్తాను’ అని అన్నారు. జీసస్ శాంతికి రాజని, ఆయన యుద్ధాన్ని తిరస్కరించారని చెప్పారు. యుద్ధోన్మాదుల ప్రార్థనలను ఆయన వినడని, వాటిని తోసిపుచ్చుతాడని తెలిపారు. ట్రంప్ ఆదివారం పోప్ లియోపై విమర్శలు కురిపించారు. ఇరాన్ యుద్ధంపై ఆయన వైఖరిని తప్పుపట్టారు. అమెరికా విదేశాంగ విధానాన్ని చూసి ఆయన భయపడుతున్నారని చెప్పారు. ‘అణ్వాయుధం ఉండడాన్ని సమర్ధించే పోప్‌ను మేము ఇష్టపడం. ప్రపంచాన్ని సర్వనాశనం చేయగల అణ్వాయుధాన్ని కలిగిన దేశంతో మేము ఆటలాడాల్సి ఉంటుందని ఆయన అనుకోవడం లేదు. నేను పోప్ లియో అభిమానిని కాదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
అమెరికాతో మరోసారి చర్చలకు సిద్ధం
ఇరాన్-అమెరికా మధ్య ఘర్షణలపై భారత్‌లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ ఫత్‌హలీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అగ్రరాజ్యంతో జరిగిన చర్చలు విఫలమైనప్పటికీ.. తమ డిమాండ్లను అంగీకరిస్తే అమెరికాతో మరోసారి చర్చలకు సిద్ధమేనన్నారు. హార్ముజ్ జలసంధి ని దిగ్బంధిస్తామని అమెరికా చేసిన ప్రకటనపై స్పందిస్తూ.. జలసంధి ఇరాన్ ప్రాదేశిక జలాల్లోనే ఉందని..ఆ జలాలపై తమ హక్కులను కాపాడుకుంటామన్నారు. ఇరాన్ ఏ విధంగా శాంతి చర్చలకు కట్టుబడి ఉందో.. అదే విధంగాసైనిక చర్యలకు కూడా సిద్ధంగా ఉందన్నారు. టెహ్రాన్ శక్తి ఏమిటో అమెరికాకు తెలుసని వ్యాఖ్యానించారు. తమ దేశంపై అమెరికా-ఇజ్రాయిల్‌లు సంయుక్తంగా చేసిన దాడుల్లో 3375 మంది పౌరులు మృతి చెందినట్టు తెలిపారు. ప్రాణ నష్టంతో పాటు గణనీయమైన ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు .



