Tuesday, April 14, 2026
E-PAPER
Homeజాతీయంశ్రామిక మహిళా ఉద్యమనేత రోజారమణి అకాల మరణం

శ్రామిక మహిళా ఉద్యమనేత రోజారమణి అకాల మరణం

- Advertisement -

విశాఖపట్నంలో రోడ్డు ప్రమాదం
ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌ ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌
సీఐటీయూలో అనేక పోరాటాలకు నాయకత్వం
సంతాపం తెలిపిన సీపీఐ(ఎం) తెలంగాణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శులు సీఐటీయూ నేతల నివాళి

విశాఖపట్నం: శ్రామిక మహిళా ఉద్యమనేత, హైదరాబాద్‌ ప్రభుత్వ నర్సింగ్‌కళాశాల ప్రిన్సిపల్‌ చక్రవర్తుల రోజారమణి అకాల మరణం చెందారు. విశాఖపట్నంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అశువులు బాసారు. విద్యార్థి దశలో ఆమె ఎస్‌ఎఫ్‌ఐలో క్రియాశీలకంగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా, సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. ఆమె సీపీఐ(ఎం), సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర నాయకులు జె.వెంకటేష్‌ భార్య. విశాఖపట్నంలోని తన సోదరుడు అనారోగ్యంతో ఉండటంతో ఆయన్ని పరామర్శించేందుకు ఆమె హైదరాబాద్‌ నుంచి వచ్చారు. సోమవారం ఆమె తన సోదరుడికి మందులు తీసుకోవడం కోసం బాబాయితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, రామాటాకీస్‌ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె రోడ్డుపై పడిపోగా, బస్సు ముందు చక్రాలు ఆమె శరీరంపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన మూడో పట్టణ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. విషయం తెలియగానే భర్త వెంకటేష్‌తో పాటు కుటుంబసభ్యులు హుటాహుటిన విశాఖపట్నం వెళ్లారు. రోజారమణి అంత్యక్రియలు విశాఖపట్నంలోనే మంగళవారం మధ్యాహ్నం నిర్వహిస్తారని సీఐటీయూ నాయకులు తెలిపారు.

ఇదీ ఉద్యమ ప్రస్థానం
రోజారమణి విశాఖలోని కైలాసపురం ప్రాంతానికి చెందినవారు. ఎమ్మెస్సీ నర్సింగ్‌ విద్యను పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే ఎస్‌ఎఫ్‌ఐ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం జె.వెంకటేష్‌ను వివాహం చేసుకుని హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో యునైటెడ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా, సీఐటీయూ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ బాధ్యతల్లో చేరి అక్కడా ఉత్తమ అధికారిగా పేరొందారు. ఆమెకు వైద్య విద్యను అభ్యసిస్తున్న కుమార్తె ఉన్నారు.

సీపీఎం సంతాపం
రోజారమణి అకాల మరణం పట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సీపీఐ(ఎం) కార్యదర్శులు జాన్‌వెస్లీ, వీ శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయడు, అనకాపల్లి జిల్లా కార్యదర్శి జీ కోటేశ్వరరావు తదితరులు సంతాపం ప్రకటించారు. రోజారమణి ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతల్లోకి రాకముందు ట్రేడ్‌ యూనియన్‌ రంగంలో క్రియాశీలకంగా పని చేశారని తెలిపారు. ట్రేడ్‌ యూనియన్‌ పత్రిక బాధ్యతలు నిర్వహించారనీ, మెడికల్‌ అండ్‌ హెల్త్‌, వర్కింగ్‌ ఉమెన్‌ యూనియన్‌ కార్యదర్శిగా, అధ్యక్షులుగా పని చేశారని తెలిపారు. రోజా మరణం శ్రామిక మహిళా ఉద్యమాలకు తీరని లోటు అని సీపీఐ (ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ సంతాప ప్రకటనలో పేర్కొన్నారు.

సీఐటీయూ నివాళి
రోజారమణి మరణం శ్రామిక ఉద్యమాలకు తీరని లోటని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌, ఉపాధ్యక్షులు ఎస్‌. వీరయ్య తెలిపారు. ఆమె మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రోజా భర్త జె.వెంకటేశ్‌ కు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.రోజారమణి మరణం పట్ల తెలంగాణ నర్సెస్‌ అసోసియేషన్‌ ఒక ప్రకటనలో సంతాపాన్ని ప్రకటించింది. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

నవతెలంగాణ సంతాపం
శ్రామిక మహిళా ఉద్యమనాయకురాలు రోజారమణి అకాల మరణం పట్ల నవతెలంగాణ దినపత్రిక సీజీఎం పీ ప్రభాకర్‌, సంపాదకులు రాంపల్లి రమేష్‌ తీవ్ర సంతాపం తెలిపారు. విద్యార్థి దశ నుంచే ఆమె పోరాటాల్లో విస్త్రుతంగా పాల్గొన్నారనీ, ప్రభుత్వ ఉద్యోగం వచ్చాక నిబద్ధతతో విధులు నిర్వర్తించి, మంచిపేరు తెచుకున్నారని కొనియాడారు. ఆమె భర్త జే వెంకటేశ్‌తో పాటు కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -