జమిలీగా ఆర్థిక, సామాజిక పోరాటాలు
ఈ నెలంతా కులరహిత, సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు : కేవీపీఎస్ సెమినార్‌లో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌కు దండాలు పెట్టి..రాజ్యాంగానికి పాతరేస్తున్నారని వక్తలు విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు అధ్యక్షతన ‘ మనువాదం -రాజ్యాంగం’ అంశంపై సెమినార్ నిర్వహించారు. అంతకుముందు జ్యోతిబా ఫూలే, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలేసి నివాళులర్పించారు. అనంతరం ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం ఇండియాలోని మనువాదం రెండూ కవలలేనని చెప్పారు. అందుకే మన ప్రధాని మోడీ ఇజ్రాయిల్‌ను ఫాదర్ ల్యాండ్ అన్నారని గుర్తు చేశారు. మనువాదం మనుషులను వేల సంవత్సరాలుగా ముక్కలు చేస్తూనే ఉందని అన్నారు. అన్ని రకాల అసమానతలు సృష్టించడానికి, మానవ సంపదను దోచుకోవడానికి మనుధర్మం ఒక అస్త్రంగా ఉందని వివరించారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన పాలకులు మనువాద విధానాలను అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మతవిద్వేషాలు రెచ్చగొట్టడం, సాటి మనిషిని ద్వేషంతో చూడడం మనువాద డీఎన్‌ఏలో అంతర్బాగమని తెలిపారు.
మనుస్మృతి భావజాలంతో సంఘటితం కాని కార్మికవర్గం
మనుస్మృతి భావజాలం కార్మిక వర్గం సంఘటితం కాకుండా అడ్డుకుంటుందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ అన్నారు. అందుకే సామాజిక, ఆర్థిక పోరాటాలు జమిలీగా జరగాలని తెలిపారు. ఈ విషయంపై సీఐటీయూ సామాజిక న్యాయ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తు న్నదని అన్నారు. కార్మికవర్గ యోధుడు బిటి రణదీవే ‘కులం- వర్గం-ఆస్తి సంబంధాలు’ అనే పత్రాన్ని అందించారని తెలిపారు. దాని వెలుగులో వర్గ పోరాటాల బలోపేతానికి కృషి జరగాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మత వైషమ్యాలు సృష్టించి రాజకీయ లబ్ది పొందుతున్నదని విమర్శిం చారు. కార్మికవర్గాన్ని ఐక్యం కాకుండా చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను, చట్టాలను కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఎస్సీ హౌదా రద్దుపై సుప్రీం తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం
ఏప్రిల్ నెలను మహనీయుల మాసంగా పాటిస్తున్నామని స్కైలాబ్ బాబు అన్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా రద్దు చేస్తూ వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని చెప్పారు. మతం మారినంత మాత్రాన పుట్టుకతో వచ్చిన కులం ఎలా మారుతుందని ప్రశ్నించారు. కుల సమస్య కేవలం దళితుల సమస్య మాత్రమే కాదనీ, దేశం సమస్యగా గుర్తించాలని అన్నారు. కుల రహిత సమానత్వ, సాంస్కృతిక ఉత్సవాలు జిల్లా స్థాయితో పాటు ఈ నెల 26న రాష్ట్రస్థాయి సాంస్కృతిక ఉత్సవాలు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో టీజీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ శ్రీరాం నాయక్, కుల నిర్మూలన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి వహీద్, విజ్ఞాన దర్శిని రాష్ట్ర అధ్యక్షులు బొల్లి ఆదమరాజు, జీఎంపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, డీవైవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, జై భీమ్ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యాంగ అంజన్న, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు సృజన సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, ఆడజన సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి, కేవీపీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం కృపా సాగర్, ఎన్ బాలపీరు, హైదరాబాద్ నగర కార్యదర్శి బి సుబ్బారావు నగర నాయకులు ఎం మహేందర్,రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం ప్రకాష్, హైదరాబాద్ సౌత్ జిల్లా కార్యదర్శి మద్దిమడుగు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


