Tuesday, April 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకూల్చివేతలు ఆపండి

కూల్చివేతలు ఆపండి

- Advertisement -

హైడ్రాకు హైకోర్టు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని నిర్మాణాల కూల్చివేతలకు అమలు చేసే విధివిధానాలు ఏమిటో చెప్పే వరకు కూల్చివేత చర్యలు ఆపాలని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. సోమవారం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ఏ చట్ట ప్రకారం కూల్చివేస్తున్నారో, కూల్చివేతలకు అమలు చేసే విధివిధానాలు ఏమిటో, అనుసరించే మార్గదర్శకాలు ఏమిటో తెలియజేసే వరకు కూల్చివేతలు ఆపాలని కోరింది. ప్రజావసరాలైన చెరువులు, కుంటలు, ఇతర నీటివనరులు, నాలాలు, పార్కులు, రోడ్లు వంటివి ఆక్రమణలకు గురైతే వాటి విషయంలో ముందుకు వెళ్లవచ్చని స్పష్టం చేసింది. నోటీసు ఇవ్వకుండా అమీన్‌పూర్‌ మండలం ఐలాపూర్‌ గ్రామానికి చెందిన రైతు ఎంఎ షరీఫ్‌ దాఖలు చేసిన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బి విజరుసేన్‌రెడ్డి సోమవారం విచారించి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. పది దశాబ్ధాలనాటి ఆస్తిలో నిర్మాణమైన నీటి ట్యాంక్‌, కాంపౌండ్‌ వాల్‌ వంటివి హైడ్రా స్టాఫ్‌ తెల్లవారు జామున కూల్చేశారని లాయర్‌ చెప్పారు. సర్వే నెంబర్‌ 165 నుంచి 175, 212, 213లోని 36.37 ఎకరాల విషయంలో హైకోర్టు ఆర్డర్‌ను అడ్డంపెట్టుకుని మిగిలిన వెయ్యి ఎకరాలను కబ్జా చేసిన వాళ్లు కూడా అక్రమ నిర్మాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదులు చెప్పారు.

దీనిపై హైకోర్టు పిటిషనర్లు సమర్పించిన వీడియోను పరిశీలించి హైడ్రా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీల చట్టం లేదంటే ఏ ఇతర చట్టాల కింద హైడ్రా విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాలు లేదా మార్గదర్శకాలను కోర్టుకు నివేదించే వరకు కూల్చివేతలు చేయరాదని హైడ్రాను ఆదేశించింది. అంతర్గత రహదారులు, ప్రహరీ గోడల తొలగింపు వంటివి బలవంతపు చర్యలు చేపట్టరాదని కూడా ఆదేశించింది. సుప్రీం కోర్టుతో సహా ఇదే హైకోర్టు ఇచ్చిన పలు తీర్పుల్లో అక్రమ నిర్మాణాల తొలగింపుపై మార్గదర్శకాలను అమలు చేయాలన్న ఉత్తర్వులను అమలు చేయలేదని తప్పుపట్టింది. జీహెచ్‌ఎంసీ చట్టంలోని సెక్షన్‌ 374బి కింద హైడ్రాకు అధికారం దఖలైందనీ, అయితే హైడ్రా చేపట్టే చర్యలకు సరైన ప్రామాణిక విధానం ఏమిటో వందకుపైగా ఉన్న కేసుల్లో హైడ్రా హైకోర్టుకు చెప్పలేదని తేల్చింది. అందుకే ఆ విధానాలు చెప్పే వరకు కూల్చివేతలకు పాల్పడరాదని ఆదేశించింది. ఐలాపూర్‌ భూములకు సంబంధించి యథాతథస్థితి కొనసాగించాలని ముధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది.

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం
సూరారం గ్రామం సిద్దివినాయక నగర్‌లోని సర్వే నెంబర్‌ 105 పరిధిలో ఉన్న భూమి వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు నోటీసులు జారీ చేయకుండా పిటిషనర్ల భూమిలోకి ప్రవేశించి పబ్లిక్‌ నోటీస్‌ బోర్డు ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. భూమి చుట్టూ ఫెన్సింగ్‌ వేయడం వంటి చర్యలు తీసుకోవడాన్ని ఆక్షేపించింది. ఈ విషయాలను సీరియస్‌గా పరిగణిస్తున్నట్టు ప్రకటించింది. హైడ్రా అధికారులు ఈనెల ఆరున ముందుగా నోటీసు ఇవ్వకపోగా కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా స్థలాల వద్దకు వచ్చి ఫెన్సింగ్‌, బోర్డులను ఏర్పాటు చేశారనీ, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి చట్టపరమైన ప్రక్రియలను ఉల్లంఘించారని పిటిషనర్‌ న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై హైడ్రా న్యాయవాది స్పందిస్తూ ఈ లేఅవుట్‌ 1978లో ఏర్పాటైందనీ, మొత్తం 102 ప్లాట్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. రెండు స్థలాలు పార్కు, ప్రజావసరాలకు చెందినవి ఉన్నాయని అన్నారు. పిటిషనర్లు రెగ్యులరైజేషన్‌కు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఆ భూమి పార్కు కోసం నిర్ధేశించినది కాబట్టి దరఖాస్తును పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. రక్షణ చర్యగా ఫెన్సింగ్‌ చేసినట్టు వివరణ ఇచ్చారు.

ఈ వాదనలపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి శ్రవణ్‌ కుమార్‌ ఈ భూమిపై ఇప్పటికే కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించారు. గతేడాది ఫిబ్రవరి ఏడున హైకోర్టు యథాతథ స్థితి ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కోర్టు అనుమతి లేకుండా హైడ్రా బోర్డు ఏర్పాటు చేసి భూమి పార్కుదని ఎలా ప్రకటిస్తుందని ప్రశ్నించారు. హైడ్రా చర్య కచ్చితంగా కోర్టు ఉత్తర్వులకు విరుద్ధమన్నారు. అందువల్ల వివాదాస్పద స్థలంలో ఏర్పాటు చేసిన నోటీస్‌ బోర్డును 48 గంటల్లో తొలగించాలని ఆదేశించారు. ఇప్పటికే వేసిన ఫెన్సింగ్‌ కొనసాగించొచ్చని చెప్పారు. ఇరుపక్షాలు ప్రస్తుత పరిస్థితిని యథాతథంగా కొనసాగించాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్‌ 10కి వాయిదా వేశారు. అప్పటిలోగా ప్రతివాదులైన హైడ్రా ఇతరులు తమ వాదనలతో కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేశారు.

కోర్టు అంటే లెక్కలేదా?
కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాల్లో ఇది ప్రభుత్వ స్థలమంటూ హైడ్రా కంచె వేసిందంటూ దాఖలైన మరో పిటిషన్‌ను జస్టిస్‌ ఎన్‌వి శ్రవణ్‌ కుమార్‌ సోమవారం విచారించారు. ఇదే హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి హైడ్రా బోర్డు పెట్టి, ఫెన్సింగ్‌ వేయడాన్ని తప్పుపట్టారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి చర్యలు తీసుకోవడమంటే హైడ్రా కోర్టు కంటే ఎక్కవని భావిస్తోందా లేక ప్రభుత్వానికి సమాంతర పాలన సాగిస్తున్నట్టు భావించాలా అని ప్రశ్నించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని సూరారం గ్రామంలో తమ ఆస్తిని హైడ్రా స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ జితేంద్ర అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించారు. సర్వే నెంబర్‌ 105లోని రెండు ప్లాట్లను స్వాధీనం చేసుకుని కంచె వేశారని పిటిషనర్‌ వాదన. దీనిపై న్యాయమూర్తి రాగల 48 గంటల్లో బోర్డును తొలగించాలని హైడ్రాను ఆదేశించారు. కంచెను కొనసాగించొచ్చని స్పష్టం చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు యధాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటర్లు దాఖలు చేయాలని హైడ్రాను ఆదేశించారు. విచారణను జూన్‌ 10కి వాయిదా వేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -