Tuesday, April 14, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరాజ్యాంగ పరిరక్షకులు సామాన్యులే

రాజ్యాంగ పరిరక్షకులు సామాన్యులే

- Advertisement -

– దానిపై విస్త్రుత చర్చ జరగాలి ొ ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని సాధించుకోవాలి
– రాజ్యాంగ పరిషత్‌లో కమ్యూనిస్టులు, సోషలిస్టులు లేనిలోటు కనిపిస్తుంది
– ‘భారత రాజ్యాంగం-సామాజిక న్యాయం’ సదస్సులో జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

సామాన్య ప్రజానీకమే భారత రాజ్యాంగాన్ని పరరక్షిస్తున్నదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి అన్నారు. దేశంలో ఓటుహక్కును నిమ్నవర్గాలే వినియోగించుకుంటు న్నాయనీ, వారే ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఉంటున్నారని విశ్లేషించారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా సోమవారంనాడిక్కడి హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్‌ కమ్యూనిటీస్‌ అండ్‌ ఉమెన్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ సొసైటీ, జనవిజ్ఞాన వేదిక తెలంగాణ సంయుక్తాధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం- సామాజిక న్యాయం’ అంశంపై సదస్సు జరిగింది. అంతకుముందు ‘భారత రాజ్యాంగం-ముఖ్యాంశాలు, రాజ్యాంగ నిర్మాణం-రాజ్యాంగ పీఠిక’ అనే తెలుగులో ప్రచురితమైన రెండు పుస్తకాలను విశిష్ట అతిధిగా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని పూర్తిగా రాసిన తర్వాతే పీఠిక రాసారని గుర్తుచేశారు. దానిలో సౌభ్రాతృత్వం, సమానత్వం పదాలను డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చేర్చారని చెప్పారు. ప్రస్తుతం ఆ రెండూ ప్రమాదంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగ పరిషత్‌లో లేని వారు, దీనికి సంబంధం లేకుండా బయట ఉండి మాట్లాడినవారు ఇప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజల్ని సమీకృతం చేస్తున్నారని చెప్పారు. ప్రజాక్షేత్రంలో విస్త్రుత చర్చల ద్వారా దీన్ని అడ్డుకోవచ్చని సూచించారు. సామాన్యులకోసం ఉద్దేశించిన రాజ్యాంగ హక్కులను వారికి గుర్తుచేస్తే, దానిపై సుదీర్ఘ చర్చ జరిగి, తమకేం కావాలో ప్రజలే నిర్ణయించుకుంటారని వివరించారు. భారత రాజ్యాంగ రచన సందర్భంలో రకరకాల భావనలు, వింతపోకడలు, ఆలోచనలు అన్నింటినీ సమీకరించి, క్రోడీకరించి, సుదీర్ఘ చర్చ జరిపి, భారతీయులకు ఏం కావాలో నిర్థారించి దాన్ని రాజ్యాంగంలో పొందుపర్చారని తెలిపారు. ఆనాటి రాజ్యాంగ పరిషత్‌లో కమ్యూనిస్టులు, సోషలిస్టులు లేనిలోటు స్పష్టంగా కనిపిస్తున్నదని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని భావప్రకటన స్వేచ్ఛను ప్రజానీకం విస్త్రుతంగా వినియోగించుకోవాలనీ, తొలుత రాజ్యాంగ పీఠికపై నిత్యం చర్చ జరగాలనీ, ఆ తర్వాత ఆదేశిక సూత్రాలను అమలు చేయాలనే డిమాండ్లు పెరగాలని చెప్పారు. ప్రజల సంపదను ప్రజల వద్దకే చేరాలన్నారు. దేశంలో 18 బహుళజాతి కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో 36 శాతం జాతీయ సంపద పోగై ఉందనీ, దీన్ని సరిదిద్దాల్సిన అవసరంపై ప్రజలు చర్చించుకోవాలని చెప్పారు. తద్వారా సామాజిక చైతన్యం పెరుగుతుందన్నారు. ప్రస్తుతం సంస్కరణల పేరుతో ప్రజా విభజన జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నమాట వాస్తవమనీ, దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని స్పష్టంచేశారు.

గ్రామీణంలో చర్చ జరగాలి ఎంపీ మల్లు రవి
కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ రాజ్యాంగ హక్కుల్ని ప్రజలకు తెలిపేందుకే ప్రధానాంశాలను క్లుప్తంగా పుస్తకాల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నామన్నారు. ప్రస్తుతం రాజ్యాంగంపై దాడి తీవ్రమైందనీ, రాజ్యాంగ రచనతో సంబంధంలేని వ్యక్తులు వారి సొంత ఆలోచనల్నే రాజ్యాంగంగా ప్రచారం చేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దీన్ని వ్యతిరేకిస్తూ, ప్రజాక్షేత్రంలో చర్చలు జరిపేందుకు ఈ పుస్తకాలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా జీవించడమే తొలి హక్కు అనీ, కానీ ఇప్పుడు దానికి భిన్నంగా భయంతో బ్రతకాల్సివస్తుందన్నారు. ఏం మాట్లాడితే ఏం కేసులు పెడతారో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాజ్యాంగం ద్వారానే దేశ ప్రజలకు ప్రజాస్వామ్య ఫలాలు చేరాలనీ, ఆ క్రమంలో అడ్డంకులు వస్తే వాటిపై పోరాడే హక్కును కూడా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాజ్యాంగంలో ఇచ్చారని గుర్తుచేశారు. ఓటుహక్కు ద్వారా ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని సాధించుకోవాల్సిన బాధ్యత అణగారిన వర్గాలపైనే ఉందన్నారు. ప్రభుత్వంలోని వ్యక్తులు రాజ్యాంగానికి భిన్నంగా వ్యవహరిస్తే, దాన్ని రక్షించుకొనే బాధ్యతను ప్రజలే తీసుకుంటారన్నారు. కేంద్రంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తుందనీ, దాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకించామని గుర్తుచేశారు. కేంద్రం జనగణనతోపాటు కులగణన చేస్తామని చెప్పి, ఇప్పుడు సాధారణ జనగణన చేస్తామంటున్నారనీ, దీన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కేంద్ర మంత్రులు అంబేద్కర్‌ను చులకన చేసి మాట్లాడుతున్నారనీ, అలాంటి వారికి క్షేత్రస్థాయిలో చర్చల ద్వారా ప్రజలే సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు.

రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి సీనియర్‌ జర్నలిస్ట్‌ కే శ్రీనివాస్‌

సీనియర్‌ జర్నలిస్ట్‌ కే శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటున్నారనీ, ఫలితంగా సామాజిక ప్రజాస్వామ్యాని కోల్పోతున్నామన్నారు. దీన్ని ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం చేకూర్చలేవనీ, కేవలం సమాజంలో నిత్యం నిరంతర చర్చ ద్వారానే సాధించుకోగలుగుతామన్నారు. మానవహక్కుల్ని హరించడానికి కూడా అదే రాజ్యాంగాన్ని తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ వాస్తవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనీ, ఆదేశిక సూత్రాల్లోని ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రయత్నం జరగాలని చెప్పారు. దాని అమలును పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయ అవసరాల కోసం ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తెస్తున్నదని వివరించారు. కుల మతాంతర సమాజం కోసం కులాంతర, మతాంతర వివాహాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలనీ, కానీ దేశంలోని 20 రాష్ట్రాల్లో మతాంతర వివాహాలు నేరపూరితమైన చర్యలుగా ప్రకటిస్తూ చట్టాలు తెచ్చారని గుర్తుచేశారు. అదే సమయంలో కులదురహంకార హత్యలను నిరోధించేందుకు ఒక్క చట్టం కూడా తేలేదని ఆక్షేపించారు. ఇలాంటి చర్యల వల్లే రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందన్నారు. ప్రజలకు సమాన అవకాశాలతో పాటు సమాన ఫలితాలు కూడా రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు చెలిమెల రాజేశ్వర్‌ అధ్యక్షత వహించారు. రచయిత్రి జూపాక సుభద్ర, దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జేబీ రాజు, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మెన్‌ డాక్టర్‌ విశారదన్‌ మహారాజ్‌, తెలంగాణ రాష్ట్ర లైబ్రరీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ డాక్టర్‌ రియాజ్‌ అహ్మద్‌, జనవిజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి రాజా రాజా, పుస్తకాల రచయిత లక్ష్మణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -