Tuesday, September 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం‌ప్రతిష్టాత్మకంగా ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌

‌ప్రతిష్టాత్మకంగా ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌

- Advertisement -

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
అధికారులు సమన్వయంతో పనిచేయాలి : 
ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‎‌డిసెంబర్‌‌ 7 నుంచి జరిగే ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026ను ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. సమ్మిట్‌‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలనీ, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో ప్రతి అంశాన్ని పర్యవేక్షించాలని దిశానిర్దేశం చేశారు. సోమవారం హైదరాబాద్‌‌లోని ప్రజాభవన్‌లో డిసెంబర్ 7 నుంచి 9 వరకు ప్రజా ప్రభుత్వం నిర్వహించే ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026 ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్క సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప కమిటీ సభ్యులు, ఐటీ–పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు తదితరులు హాజరయ్యారు.
‎సమ్మిట్‌కు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించి, అవసరమైన నిర్ణయాలు వేగంగా తీసుకునేలా ప్రజాభవన్‌లో ప్రత్యేకంగా వార్‌రూమ్‌ ఏర్పాటు చేయాలని భట్టి సూచించారు. రోజువారీగా ఏర్పాట్ల పురోగతిని పర్యవేక్షిస్తూ, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని ఈ వార్‌రూమ్‌ ద్వారా మరింత బలోపేతం చేయాలని అన్నారు. ‎
సమ్మిట్‌ నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్ల కమిటీలను ఏర్పాటు చేసి, ప్రతి కమిటీకి సీనియర్‌ అధికారులను బాధ్యులుగా నియమించాలని ఆదేశించారు. సలహా కమిటీ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, ఆహ్వాన కమిటీ, హాస్పిటాలిటీ కమిటీ, ప్రోగ్రామ్‌ డిజైనింగ్‌ కమిటీ, మీడియా–కాంటాక్ట్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ కమిటీ, ఎంఓయూ కమిటీ తదితర కమిటీలను ఏర్పాటు చేసి, సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలను అప్పగించాలని సూచించారు.

లోగోను రూపొందించాలి
​‎ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026కు ప్రత్యేకమైన లోగోను రూపొందించాలని అధికారులను భట్టి ఆదేశించారు. సలహా, ఎగ్జిక్యూటివ్‌ కమిటీలను త్వరితగతిన ఏర్పాటు చేసి, వారితో సమావేశాలను నిర్వహించి సమ్మిట్‌ కార్యాచరణపై చర్చించాలని సూచించారు.
సమ్మిట్‌లో పాల్గొనే ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సమర్థవంతంగా వివరించేలా కార్యక్రమ రూపకల్పన ఉండాలని సూచించారు.

‎అక్టోబర్‌‌లో ఢిల్లీలో కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం‎
‎సమ్మిట్‌కు విస్తృత అంతర్జాతీయ, జాతీయ ప్రచారం కల్పించడంలో భాగంగా అక్టోబర్‌ మొదటి లేదా రెండో వారంలో దేశ రాజధాని ఢిల్లీలో కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని భట్టి సూచించారు. విదేశీ దౌత్యవేత్తలు, కేంద్ర మంత్రులు, దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న తెలంగాణ అధికారులు, ఇతర ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. ‎ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌–2026పై ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లు, కీలక ప్రాంతాల్లో హోర్డింగులు ఏర్పాటు చేసి సమ్మిట్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, వివిధ రంగాల్లో అభివృద్ధి అవకాశాలను ప్రచారంలో ప్రధానంగా ప్రదర్శించాలని కోరారు. సమ్మిట్‌ ఏర్పాట్లకు సంబంధించి అన్ని శాఖల అధికారులను సమన్వయం చేస్తూ రోజువారీ పురోగతి నివేదికను రూపొందించి తనకు అందజేయాలని ప్రణాళిక శాఖ కార్యదర్శి గౌరవ్‌ ఉప్పల్‌ను భట్టి ఆదేశించారు. ‎ఈ కార్యక్రమంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఫ్యూచర్ సిటి సీఎండీ శశాంక, ట్రాన్స్‌‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి పాటిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -