ప్రత్యేక అధికారికి షోకేజీ నోటీసు జారీ
నవతెలంగాణ-మిడ్జిల్
మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలను, జూనియర్ కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణ, పరిసరాల్లోని పారిశుధ్య పరిస్థితులను ఆయన పరిశీలించారు. పాఠశాల పరిసరాల్లో పిచ్చి మొక్కలు, తుమ్మ చెట్లు, కంప చెట్లు, పొదలు, గడ్డి పెరిగి అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన అదనపు కలెక్టర్ అధికారులపై తీరుపై మండిపడ్డారు.
పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం వహించినందుకు ప్రత్యేక అధికారికి (ఎస్ఓ) షోకాజ్ నోటీసు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాల పరిసరాల్లోని పిచ్చి మొక్కలు, పొదలు, కంప చెట్లు తదితరాలను తొలగించి పూర్తిగా శుభ్రం చేయాలని సూచించారు. పాఠశాల పరిసరాలలో 100 మీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని శుభ్రం చేసి, అవసరమైన చోట మొరం మట్టి పోసి చదును చేసి పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీలో జి.సి.డి.ఓ ఆశ్ర ఖాద్రి, మిడ్జిల్ ఎంపీడీవో లక్ష్మణ్ రాథోడ్, మిడ్జిల్ సర్పంచ్ ఎడ్ల శంకర్ ముదిరాజ్, ప్రత్యేక అధికారి కవిత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



