‘‘హిందువులు నిద్రలేస్తే ప్రపంచం మేల్కొన్నట్లే” ఇదీ అమెరికా, కెనడా, బ్రిటన్ పర్యటనలో భాగంగా కెనడాలోని టొరంటో నగరంలో జరిగిన సభలో ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ చెప్పిన సుభాషితం. ఎంతో చక్కగా చెప్పారు, ఇంతకూ హిందువులు ఎప్పుడు నిద్రలేస్తారో చెప్పకుండా అది జరిగితే, ఇదైతే అని చెప్పటం వల్ల ఉపయోగమేమిటి? నిద్ర లేవకుండా ఎవరు అడ్డుకున్నారు? భగవత్ మూడు దేశాల పర్యటన అన్ని చోట్లా తీవ్ర వివాదాన్ని రేపింది. అవి నోరున్న దేశాలు గనుక వార్తలు ప్రపంచవ్యాపితంగా వెళ్లాయి. మనదేశ మీడియాలో కూడా చోటుచేసుకున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నది బీజేపీ, తెరవెనుక ఉండి దాన్ని ఆడిస్తున్నది మాతృసంస్థ ఆరెస్సెస్ అన్నది జగమెరిగిన సత్యం. అలాంటి సంస్థ అధినేత పర్యటన అంటే ఒక రాజ్యాంగేతర శక్తి చేస్తున్నట్లే భావించాలి. తనను ఒక సాంస్కృతిక సంస్థగా కాషాయదళం చెప్పుకుంటుంది. కానీ, ప్రపంచానికి అది మేకతోలు కప్పుకున్న పులి, ఒక మతోన్మాద సంస్థగా అనేక మంది భావిస్తున్నారు. ఆ మచ్చను తుడిచివేసుకొనేందుకు వంద సంవత్సరాల క్రితం అది పుట్టినప్పటి నుంచీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు.
భారత్ విశ్వగురువుగా మారింది తప్ప విశ్వశక్తి కాదని టొరొంటో సభలో ఆరెస్సెస్ అధినేత చెప్పారు. ప్రపంచ మిలిటరీ, జీడీపీలో అగ్రభాగాన ఉన్నందున అమెరికా ప్రపంచశక్తి అని భావిస్తే అదొకతీరు. మనం ఏ రంగంలో ముందున్నట్లు, గురువుగా ప్రపంచానికి నేర్పిందేమిటి? “హిందూ విశ్వ బంధు-స్నేహ బంధంతో ప్రపంచ ఆలింగనం” అనే ఇతివృత్తంతో కెనడియన్ హిందూస్ ఫర్ అవుట్‌రీచ్, రిలేషన్స్ అండ్ డైలాగ్(కోర్డ్) సంస్థ ఏర్పాటు చేసిన సభలో భగవత్ మాట్లాడుతూ భారత్ సూపర్ పవర్ కాదని, తన స్వంత వ్యక్తిత్వంతో ప్రపంచానికి సేవలు అందించిందని, భారత్ ఎదుగుదలను ఆధిపత్యంతో కాక సేవతో కొలవాలని అన్నారు. సేవ భారత జన్యుమూలాల్లోనే ఉందని, హిందువులు మేలుకొంటే ప్రపంచమే నిద్రలేచినట్లని చెప్పారు. ముస్లింలు, పార్సీలు, యూదులు, క్రైస్తవులు ఎక్కడైనా వేధింపు లకు గురైతే భారత్‌లో ఆశ్రయం దొరికిందని, భారత పూర్వీకులు దేశాలను ఆక్రమించేందుకు కాక జ్ఞానాన్ని పంచేందుకు విదేశాలకు వెళ్లారని పేర్కొన్నారు.ఇక్కడ సమస్య యావత్ ప్రపంచానికి మన పూర్వీకులు జ్ఞానం ప్రసాదిస్తే, అది మన వేదాలు, పురాణాల్లో నిక్షిప్తమై ఉంటే దాన్ని మనం వినియోగించుకోకుండా “మ్లేచ్చులకు” అందించి వారు విమానాలు, క్షిపణులను తయారు చేసేందుకు ఎందుకు సహకరించినట్లు? పారిశ్రా మిక విప్లవాన్ని, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉండి, సమాజాన్ని నిచ్చెనమెట్ల వివక్షా పూరితంగా ఎందుకు తయారు చేసుకున్నాం. సముద్రాలు దాటి ప్రయాణించిన వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఎందుకు నిబంధనలు విధించినట్లు?
మనపూర్వీకులు ప్రపంచాన్ని చుట్టి జ్ఞానాన్ని అందిం చారని చెబుతున్న వారు ప్రయాణాలను నిషేధించిన బౌధాయన ధర్మశాస్త్రం, మనుస్మృతి గురించి ఏం చెబుతారు. సముద్రాలు దాటితే కుల భ్రష్టులౌతారు, ఆచారాలు మంటకలుస్తాయని చెప్పిన ఆంక్షల నేపథ్యంలో భగవత్ చెప్పిన పూర్వీకులు విదేశాలకు వెళ్లారంటే వారు తిరుగుబాటుదారులై ఉండాలి. అలాంటి వారిని పొగుడుతున్న కాషాయ దళాలు మరోవైపు మనుస్మృతిని విమర్శించే వారిని హిందూ వ్యతిరేకులు అని ఎందుకు నిందిస్తున్నట్లు? సనాతనాన్ని కాపాడాలి లేదా పునరుద్ధరిం చాలని చెబుతున్నవారు సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నట్లా, వెనక్కు నడపాలని చూస్తున్నారా? జనాలు ఊరూపేరులేని వాట్సాప్‌లకు మాత్రమే పరిమితం కాకుండా స్వంత మెదళ్లకు పని పెట్టాలి. హిందూ అంటే మతం కాదు, జీవన విధానం అని చెబుతారు. “నేను హిందూ అని చెప్పినపుడు ఆ పదాన్ని ఒక నిర్దిష్ట భాష, ప్రత్యేక ఆరాధన రూపం, లేదా ఏ జీవన శైలితోనూ నిర్వచించకూడదు. హిందువులు అందరినీ గౌరవించాలి, అందరినీ ఆమోదించాలి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడాలి,” అని భగవత్ చెప్పారు. ఆచరణలో కాషాయ దళాలు అలాగే ఉన్నాయా? ఒకవైపు వసుధైక కుటుంబం అని చెబుతారు. మరోవైపు దేశంలో జనాభాను పెంచుతూ ముస్లింలు మెజారిటీగా మారేందుకు చూస్తున్నారని ఆరోపిస్తూ, హిందువులు పిల్లలను ఎక్కువగా కనాలని ప్రబోధించటం తెలీదా? దక్షిణ భారత్‌లో ఉన్న హిందువులు కుటుంబ నియంత్రణ ఎందుకు పాటిస్తున్నారు, ఉత్తర భారతంలోని వారు ఎందుకు ముందుకు రావటం లేదు? జనాభా నియంత్రణ అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
ప్రపంచ సగటు జననాల రేటు 2.23 కాగా, అంతకంటే తక్కువగా ఉన్న ముస్లిం దేశ సమాజాలు కూడా ఉన్నాయి. యావత్ ప్రపంచాన్ని మతపరంగా ముస్లింలతో నింపాలనే కుట్ర ఉంటే మాల్దీవులు, మలేషియా, బహరెయిన్, ఇరాన్, టర్కీ వంటి చోట్ల మనకంటే తక్కువగా జననాల రేటు ఎందుకు ఉన్నట్లు? ఏ దేశానికైనా జనాభా వృద్ధి రేటు 2.1గా ఉండాలన్నది ఆ రంగ నిపుణుల సిఫార్సు. మనదేశంలో సగటు రెండుగా ఉంది. ఇక మతాల వారీ చూస్తే ముస్లింలు 2.36, హిందువులు 1.94 ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 1992లో ముస్లింలలో 4.41గా ఉన్న పిల్లలు 2019-21 నాటికి 2.36కు తగ్గారు. ఇదే కాలంలో రెండు మతాల వారి మధ్య ఉన్న తేడా 1.11 నుంచి 0.42కు తగ్గింది. కుట్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేసేవారు, నమ్మేవారు దీనికి ఏ సమాధానం చెబుతారు? యావత్ ప్రపంచం ఒకే కుటుంబం అని మోహన్ భగవత్ సెలవిస్తారు. వారి రాజకీయ ప్రతినిధి బీజేపీ ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ అని చెబుతుంది. చట్టసభల ఎన్నికల్లో మాత్రం దేశంలో 15శాతంగా ఉన్న ముస్లిం సామాజిక తరగతిలో ఒక్కరంటే ఒక్కరిని కూడా తమ అభ్యర్ధులుగా నిలపదు. సోషల్ ఇంజనీరింగ్ పేరుతో అన్ని కులాలవారికీ ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని చెప్పే పార్టీ మత వివక్షతో అసలు అవకాశం కల్పించకపోవటాన్ని మతోన్మాదం లేదా మతవిభజనగాక ఏ పేరుతో పిలవాలి? మోహన్ భగవత్ పర్యటనకు మూడు దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇక్కడ సమస్య వ్యక్తిగతం కాదు. భావజాలం, విద్వేష పూరిత వ్యాఖ్యలు, ఆచరణకు సంబంధించిన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి.
ఆరెస్సెస్ సభతో కెనడాలో సామాజిక అశాంతి తలెత్తుతుందని, మైనారిటీలుగా ఉన్న ముస్లింలు, సిక్కులు, దళితులకు ముప్పు తలెత్తుతుందని ఎన్‌డిపి పక్ష ఎంపీలు ప్రభుత్వానికి బహిరంగలేఖ రాశారు. అక్కడి పౌర సమాజంలోని 267 సంస్థలు, బృందాలు కూడా భగవత్ ప్రవేశానికి అనుమతి ఇవ్వకూడదని, ఆరెస్సెస్‌ను నిషేధించాలని కోరాయి. దీనికి పోటీగా వందకుపైగా ఇండో-కెనడియన్ హిందూ సంస్థలు రాసిన లేఖలో ఆధారం లేకుండా నిషేధం విధించటం అన్యాయమైన రాజకీయ వత్తిడి అని, భగవత్ పర్యటనను అడ్డుకోవటమంటే కెనడా హిందూ సమాజం పట్ల వివక్ష చూపటమేనని పేర్కొన్నాయి. కెనడా మాజీ రక్షణ మంత్రితో సహా మరికొందరు ఆరెస్సెస్‌కు మద్దతు పలికారు. బ్రిటన్‌లో దక్షిణాసియా సంతతికి చెందినవారు, మానవహక్కుల బృందాలు పర్యటనను వ్యతిరేకించాయి. వసుధైక కుటుంబ ఉత్సవాల ముసుగులో అమెరికాలో ఏర్పాటు చేసిన మోహన్ భగవత్ పర్యటనపట్ల కూడా వ్యతిరేకత వెల్లడైంది. సభ జరిగిన మాడిసన్ స్క్వేర్ న్యూయార్క్ నగరంలో ఉంది. ఆ నగర మేయర్ జోహ్రాన్ మందానీ ఆరెస్సెస్ నేత పర్యటనకు తాను వ్యతిరేకమని, అయితే ఒక మేయర్‌గా భగవత్ కార్యక్రమాలను అడ్డుకొనే అధికారం తనకు లేదని చెప్పారు. జోహ్రాన్ తండ్రి గుజరాతీ మూలాలున్న అమెరికా పౌరుడు మహమ్మద్ మందానీ, తల్లి ప్రముఖ భారతీయ సినిమా దర్శకురాలు మీరా నాయర్. మూడు పదులు దాటిన జోహ్రాన్ న్యూయార్క్ నగరానికి తొలి ఇండియన్-అమెరికన్ మేయర్‌గా చరిత్రకెక్కారు.
అమెరికా పార్లమెంట్‌కు సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మతస్వేచ్చ అమెరికా కమిషన్ (యుఎస్‌సిఐఆర్‌ఎఫ్) అమెరికా ప్రభుత్వ అధికారులు భగవత్‌ను కలవరాదని కోరింది. ఆరెస్సెస్ ఉపసంఘాలు మతపరమైన మైనారిటీల మీద హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు ఆ సంస్థ నివేదికలో పేర్కొన్నది. ఈ సంస్థ పక్షపాతంతో కూడినదని, దానికి విశ్వసనీయత లేదని మన విదేశాంగ శాఖ ఆరెస్సెస్‌ను వెనుకేసుకు వచ్చింది. తీవ్ర వ్యతిరేకత తలెత్తిన నేపథ్యంలో సభా నిర్వహకుల ఎక్స్ ఖాతాను ఆ సంస్థ యాజమాన్యం నిలిపివేసి వత్తిడి తరువాత పునరుద్ధరించింది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ తగిన రక్షణ జాగ్రత్తలు తీసుకోవాలని సభకు హాజరయ్యేవారికి సూచించింది. ఇలాంటి సంస్థలు ఎంతగా రెచ్చగొట్టినా ఎలాంటి అవాంఛనీయ ఉదంతాలు లేకుండా కార్యక్రమం ముగిసింది. ఆరెస్సెస్ వ్యాపింపచేస్తున్న పచ్చి అవాస్తవాలు ఎన్నో. జాతిపిత మహాత్మా గాంధీని హత్యచేసిన గాడ్సే అంతకు ముందే తమ సంస్థనుంచి వెళ్లిపోయి హిందూమహాసభలో చేరాడన్నది వాటిలో ఒకటి. అయితే గాడ్సే ఎప్పుడు ఆరెస్సెస్‌లో చేరిందీ, ఎప్పుడు వెళ్లిపోయిందీ ఎలాంటి ఆధారాలు లేవు. అసలు ఆ సంస్థ సభ్యత్వం రహస్యం. నాధూరామ్ గాడ్సే, అతని సోదరుడు గోపాల్ గాడ్సే ఆరెస్సెస్‌లో చురుకైన కార్యకర్తలని, వారెప్పుడూ సంస్థ నుంచి బయటకు పోలేదని కుటుంబ సభ్యులు పదే పదే స్పష్టం చేశారు.గోపాల్ గాడ్సే మనుమడు సాత్యకీ సావర్కర్ ఒక పరువు నష్టం కేసులో 2026 ఆగస్టు నెలలో పూనా కోర్టులో సాక్ష్యమిస్తూ అదే చెప్పాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సావర్కర్, గాడ్సే కుటుంబాలకు ఆరెస్సెస్‌తో ఉన్న సంబంధాల గురించి సాత్యకి చెప్పిన అంశాలను ప్రచురించింది. గాడ్సే కోర్టులో చేసిన వాదనలను పుస్తకరూపంలో అచ్చువేసి ప్రచారంలో పెడుతున్నది కాషాయ దళం తప్ప మరొక “దేశభక్తుడు” ఎవరూ కాదు. అయినా సరే గాడ్సేతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆరెస్సెస్ పదే పదే గోబెల్స్ ప్రచారం చేస్తున్నది. మోహన్ భగవత్ మూడు దేశాల పర్యటన సందర్భంగా ఆర్గనైజర్ పత్రికలో దాన్నే పునరుద్ఘాటించారు.
ఎం కోటేశ్వరరావు
8331013288



