న్యూఢిల్లీ : పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ హెచ్చరించింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం భారత్‌కు పెను సవాలుగా మారనుందని ఈ నివేదికలో విశ్లేషించింది. ఒకవేళ 2026లో ముడిచమురు సగటు ధర బ్యారెల్‌కు 130 డాలర్ల మార్కును తాకితే.. భారత ఆర్థిక వృద్ధి రేటు ఏకంగా 80 బేసిస్ పాయింట్లు లేదా 0.80 శాతం మేర పడిపోయే ప్రమాదం ఉందని సంస్థ అంచనా వేసింది. పశ్చిమాసియా సెగ కేవలం ఇంధన ధరలకే పరిమితం కాకుండా సరఫరా గొలుసులో అంతరాయాల ద్వారా గహాలు, కార్పొరేట్ సంస్థలు, బ్యాంకింగ్ రంగంపై కూడా ఒత్తిడి పెంచుతుందని ఎస్‌అండ్‌పీ హెచ్చరించింది.
ఈ చమురు షాక్ ప్రభావంతో 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత కార్పొరేట్ రంగం భారీ నష్టాలను చవిచూడాల్సి రావచ్చు. ప్రధానంగా కంపెనీల నిర్వహణ లాభాలు 15 నుంచి 25 శాతం వరకు క్షీణించే అవకాశం ఉందని.. దీంతో సంస్థల రుణ భారం పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని ఎస్‌అండ్‌పీ విశ్లేషించింది. బ్యాంకింగ్ రంగం విషయానికి వస్తే ఆస్తుల నాణ్యత తగ్గి మొండి బకాయిలు 3.5 శాతానికి చేరవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా రసాయన, రిఫైనింగ్, ఏవియేషన్ రంగాలు ఈ ధరల పెరుగుదల వల్ల నేరుగా దెబ్బతినే అవకాశం ఉంది. పెరిగిన దిగుమతి ఖర్చుల వల్ల కరెంట్ అకౌంట్ లోటు పెరగడమే కాకుండా రూపాయి విలువపై కూడా క్షీణత ఒత్తిడి పెరుగుతుందని నివేదిక పేర్కొంది. యుద్ధ తీవ్రత తగ్గి హార్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో రవాణా సాధారణ స్థితికి చేరుకుంటే 2027 నాటికి ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని పేర్కొంది.
ఆర్థిక వ్యవస్థకు చమురు సెగ
- Advertisement -
- Advertisement -



