తీవ్రంగా ఖండించిన సీపీఐ(ఎం)
న్యూఢిల్లీ : కనీస వేతనాల కోసం ఢిల్లీలోని ఎన్‌సీఆర్ పారిశ్రామిక బెల్ట్‌లో ఆందోళన జరుపుతున్న ఫ్యాక్టరీ కార్మికులపై హ ర్యానా, ఉత్తరప్రదేశ్‌ల్లోని బీజేపీ పాలిత ప్రభుత్వాలు చేపట్టిన దారుణమైన అణచివేత చర్యలను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిం చింది. ‘వేతనాలను పెంచాలని, చట్టబద్ధమైన ప్రయోజనాలను అమలు చేయాలని కార్మికులు దీర్ఘకాలంగా పోరాడుతున్నారు. ఆ డిమాండ్లను పరిష్కరించడానికి బదులుగా హర్యానా, యుపి ప్రభుత్వాలు కార్మికులపైకి పోలీసులను ప్రయోగించాయి. కార్మిక నేతలపై తప్పుడు కేసులు బనాయించాయి. నిజాయితీగా చేస్తున్న ఆందోళనలను విదేశీ శక్తుల ప్రోద్బలంతో జరుగుతున్నాయంటూ నిస్సిగ్గుగా అభాండాలు మోపారు. కార్మిక నేతలను కుట్రదారులుగా ముద్రవేశారు’ అని పేర్కొంది. పోలీసులు గ్రామాలపై దాడులు చేస్తున్నారని, విచక్షణారహితంగా కార్మికులను కొడుతున్నారని, వందలాదిమందిని అరెస్టు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయని తెలిపింది. అరెస్టయిన కార్మికుల ఆచూకీని వారి కుటుంబాలకు తెలియచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. గత కొద్ది రోజులుగా సీపీఐ(ఎం) ఢిల్లీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ గంగేశ్వర్ దత్ శర్మ, సీఐటీయూ నోయిడా జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రామ్ సరస్వత్‌లు గత కొద్ది రోజులుగా గృహ నిర్బంధంలో వున్నారని పేర్కొంది. గత రెండున్నర మాసాలుగా, దేశంలోని పలు ప్రాంతాల్లో ముఖ్యంగా ఉత్తర భారతంలో కార్మికులు అమానుషంగా వున్న తమ జీవన, పని పరిస్థితులకు వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. తమ వేతనాల్లో ఎలాంటి పెరుగుదల లేకుండా స్తంభించిపోయాయని, మౌలికమైన కార్మిక హక్కులను కూడా నిరాకరించబడుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక శాఖల నిర్లక్ష్యపూరితమైన, యాజమాన్య అనుకూల వైఖరిని వారు విమర్శిస్తున్నారు. నేషనల్ కేపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లో కార్మికుల తిరుగుబాటు వారిలో పెరుగుతున్న అసమ్మతికి తాజా ఉదాహరణగా వుంది. కార్మికుల పోరాటాలకు సీపీఐ(ఎం) పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తోంది. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. కార్మికులపై చేపడుతున్న అన్ని అణచివేత, ప్రతీకార చర్యలకు తక్షణమే స్వస్తి చెప్పాలని పోలీసులను, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ను కోరింది. కార్మిక ప్రతినిధులతో చర్చలు జరపడం ద్వారా కార్మికుల చట్టబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని పొలిట్‌బ్యూరో కోరింది.
కార్మికులపై అణచివేత చర్యలు తగవు
- Advertisement -
- Advertisement -



