ముసాయిదాలపై పూర్తి సమాచారమేది?
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్
బిల్లులపై 262 మంది మాజీ సివిల్ సర్వెంట్లు, సామాజిక కార్యకర్తల విమర్శలు
న్యూఢిల్లీ : కేంద్రం లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు దిశగా పార్లమెంటు సమావేశానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మాజీ సివిల్ సర్వెంట్లు, ప్రొఫెసర్లు, కార్యకర్తలు, న్యాయవాదులు, విద్యావేత్తలు కలిసి ఈ బిల్లుల రూపకల్పనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ప్రక్రియ అస్పష్టంగా, సంప్రదింపుల్లేకుండా జరుగుతోందని తీవ్రంగా విమర్శించారు. ఇందులో పారదర్శకత లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు 262 మంది తమ సంతకాలతో కూడిన ఒక ప్రకటన విడుదల చేశారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశానికి పొడిగింపుగా నిర్వహించనున్న మూడు రోజుల ప్రత్యేక సమావేశంలో తీసుకురాబోయే చట్టాల ముసాయిదాలపై పూర్తి సమాచారం లేకపోవడం పట్ల వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లులను ప్రజలకు అందుబాటులో ఉంచి, ప్రజా చర్చకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 16 నుంచి 18 వరకు జరిగే ప్రత్యేక సమావేశంలో మూడు బిల్లులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లుల లక్ష్యం 2029 నాటికి లోక్‌సభ, అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయడం.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన నారీ శక్తి వందన్ అధినియం అనే ఈ చట్టం 2023లో పార్లమెంటులో ఆమోదం పొందింది. ఈ చట్టం ప్రకారం.. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మూడింటా ఒక వంతు సీట్లు మహిళలకు కేటాయించాలి. అయితే ఈ రిజర్వేషన్ అమలు కావాలంటే 2027 జనగణన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తవ్వాలి. దాంతో మహిళా రిజర్వేషన్ అమలు 2034కి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్రం ఈ వారంలో జరిగే ప్రత్యేక సమావేశంలో చట్టంలో సవరణలు చేయాలని భావిస్తోంది. ఈ సవరణలు 2027 జనగణనకు ముందు ఆమోదం పొందితే.. 2011 జనగణన ఆధారంగా అమలు చేయొచ్చు. ఈ సవరణలతో పాటు లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 నుంచి 816కు పెంచే అవకాశం ఉంది. అందులో 273 సీట్లు మహిళలకు కేటాయించబడతాయి. అయితే ఈ ప్రతిపాదిత చట్టాల ప్రభావం భారత ప్రజాస్వామ్యంపై చాలా పెద్దగా ఉంటుందని మాజీ సివిల్ సర్వెంట్లు, సామాజిక కార్యకర్తలు, మేధావులు ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే ఈ బిల్లుల పూర్తి పాఠ్యాన్ని వివిధ భాషల్లో ప్రజలకు అందుబాటులో ఉంచి, విస్తృత ప్రజా సంప్రదింపులు జరపాలని వారు కోరారు. ”మేము మహిళా రిజర్వేషన్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. ఇందులో చాలా మంది ఈ డిమాండ్ కోసం గతంలో ఉద్యమాలు కూడా చేశారు. అయితే, ఈ చట్టాలను రహస్యంగా, ప్రజాస్వామ్య విధానలకు విరుద్ధంగా తీసుకురావడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం” అని వారు ఆ ప్రకటనలో వివరించారు. మహిళా సాధికారత కోసం తీసుకురాబోయే చట్టాల్లో మహిళలకే చర్చలో చోటు లేకపోవడం ఒక విరుద్ధ పరిస్థితి అని వ్యాఖ్యానించారు. ”ఇలాంటి చారిత్రాత్మక సంస్కరణకు పారదర్శక చర్చ, ప్రజా పరిశీలన, వివిధ వర్గాల అభిప్రాయాలు అవసరం. లేకపోతే.. ఇది ప్రజల సాధికారతకు కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం త్వరితగతిన తీసుకురాబడిన చర్యగా మారే ప్రమాదం ఉంది” అని వారు హెచ్చరించారు.
ఈ ప్రకటనపై సంతకం చేసినవారిలో ట్రాన్స్పరెన్సీ యాక్టివిస్ట్ అంజలి భరద్వాజ్, పొలిటికల్ సైంటిస్ట్ నివేదితా మేనన్, ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నాయకురాలు అన్నీ రాజా, మాజీ రాయబారి మీరా శంకర్, మాజీ ఐఏఎస్ అధికారి, రచయిత హర్ష్ మందర్, ఆర్టీఐ కార్యకర్త అమృత జోహ్రీ తదితరులు ఉన్నారు.
పారదర్శకత లోపం
- Advertisement -
- Advertisement -



