కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
దాదాపు గంట పాటు జరిగిన సమావేశం
మంత్రుల పనితీరు, పార్టీ అంతర్గత అంశాలపై రిపోర్ట్
నవతెలంగాణ-న్యూఢిల్లీ
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. మంగళవారం నాడిక్కడ లోథి రోడ్ లోని కేసీ వేణు గోపాల్ నివాసానికి వెళ్లి ఆయనను కలిశారు. దాదాపు గంటసేపు పార్టీ, పాలనా అంశాలపై చర్చలు జరిపారు. మంత్రి వర్గ విస్తరణ, శాఖల మార్పు, మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం చైర్మెన్ జీ చిన్నారెడ్డిల తీరుపై క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ నేపథ్యంలో ఈ భేటికి ప్రాధాన్యత సంతరించుకుంది. వెయ్యి రోజుల పాలనపై ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై ఏం చేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డితో పాటు మరికొందరు నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న తీరు, దానివల్ల ప్రభుత్వానికి జరుగుతున్న రాజకీయ నష్టం వంటి అంశాలపై చర్చించారు. ఇలాంటి విషయాలపై పార్టీ అధిష్టానం ఫోకస్ చేయాలనీ సీఎం కోరినట్టు తెలిసింది. రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ దీనిపై లోతైన విచారణ జరిపిన తర్వాతే… నివేదికను అధిష్టా నంకు అందజేసినట్లు వివరించారు. మంత్రుల పనితీరు, పార్టీ అంతర్గత అంశాలపై కేసీకి సీఎం రేవంత్ రెడ్డి రిపోర్ట్ అందజేశారు. ఆయా శాఖల వారీగా పనితీరు వివరా లు, మంత్రుల వ్యవహారం, పార్టీలో మంత్రి పదవులు ఆసిస్తున్న నేతల పేర్లను ప్రస్తా వించినట్లు తెలిసింది. వీటితో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా చర్చ జరిగింది. సుదీర్ఘ కాలంగా పార్టీ వెన్నంటే ఉన్న సీనియర్లు, యువ నేతలకు అవకాశం కల్పిం చాలని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇదే సందర్భంలో వెయ్యి రోజుల పాలన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న కార్య క్రమాలను తెలియజేశారు.
నేడు కేసీతో మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ భేటి
పార్టీ లైన్ దాటుతున్న నేతలకు చెక్ పెట్టేలా నేడు అధిష్టానం కీలక సమావేశం నిర్వహించనుంది. పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో ఏఐసీసీ హెడ్ ఆఫీసులో బుధవారం ఈ భేటి జరగనుంది. ఇందులో పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ లు హాజరుకానున్నారు. ఈ భేటిలో కీలకంగా మంత్రి కొండా సురేఖ, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డిల అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నట్లు ఏఐసీసీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన తీరుపై రాష్ట్ర వ్యాప్త సంబురాలు, క్షేత్రస్థా యిలో పార్టీని మరింత బలోపేతం వ్యవ హారాలపై చర్చించనున్నారు. పార్టీ చీఫ్ ఖర్గేతోనూ పీసీసీ చీఫ్ భేటి కానున్నారు.



