ప్రపంచ పరిస్థితి ఇప్పుడే సద్దుమణిగేలా లేదు
అమెరికాకు అప్పుల ముప్పు
మోడీ సర్కారును భయపెట్టిన యువత ఆందోళనలు : బీవీ రాఘవులు
ఈనెల 10 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు : పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
7న సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ .. 13న ఏచూరి వర్థంతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం ఫలితంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతల మైందని సీపీఐ (ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధ వాతావరణం కొద్ది రోజులు ఆగినా, దాని పర్యవసానాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయని, ఆ పరిస్థితి ఇప్పుడే సద్దుమణిగేలా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. సీపీఐ (ఎం) రాష్ట్ర విస్తృత సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు… తాజా జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులను సోదహరణంగా వివరించారు. డీలిమిటేషన్, మహిళా బిల్లు, హైబ్రిడ్ రోడ్లు, ఈ-20 (ఇథనాల్) తదితరాంశాలపై పార్టీ వైఖరిని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ… చేపట్టాల్సిన కర్తవ్యాలను వివరించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ….సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కీయే మధ్క జరిగిన ఒప్పందాన్ని ప్రస్తావించారు. తాజాగా ఈ కూటమిలోకి బంగ్లాదేశ్‌ను కూడా ఆహ్వానించారని గుర్తు చేశారు. అయితే ఇది అమెరికాకు వ్యతిరేకంగా ఉంటుందా? దాని ప్రయోజనాలను కాపాడుతుందా? అనేది వేచి చూడాలన్నారు.
భారత్, చైనా, ఇజ్రాయిల్, ఇరాన్ పట్ల కూడా ఈ కూటమి ఎలా వ్యవహరిస్తుందనే దాన్ని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతోందని గుర్తు చేశారు. ఇదే సమయంలో అమెరికా అప్పు భరించలేని స్థాయికి చేరిందని తెలిపారు. ఆ దేశానికి ఇప్పుడు అసలు కంటే వడ్డీయే భారంగా మారిందన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే డాలర్ మీద నమ్మకం పోయే పరిస్థితి తలెత్తుందని హెచ్చరించారు. మనదేశంలో పార్లమెంటు సమావేశాల సమయంలో సీజేపీ, యువత నిర్వహించిన ఆందోళన మోడీ సర్కారును భయాందోళనలకు గురి చేసిందని చెప్పారు. బీజేపీ హయాంలో అయోధ్యలో హుండీ చోరీ లాంటి అపవిత్రమైన చర్యలు కొనసాగాయంటూ దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయని తెలిపారు. దీంతో కేంద్రంలోని బీజేపీ సర్కారుకు, దాని విధానాలకు, తీవ్రమైన విఘాతం కలిగిందని వివరించారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీపై వెల్లువెత్తిన ఆందోళనలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించే దాకా వెళ్లాయని పేర్కొన్నారు. దీంతో తీవ్రమైన అసహనానికి గురైన ప్రధాని మోడీ… గతంలో అర్బన్ నక్సల్స్ అనే పదం వాడిన మాదిరిగానే ఇప్పుడు దిమాగీ నక్సల్స్ అనే కొత్త పల్లవిని ఎత్తుకున్నారని ఎద్దేవా చేశారు.
మరోవైపు దేశంలోని యువతను ప్రసన్నం చేసుకునేందుకు, వారిని బుజ్జగించి తమదారిలోకి తెచ్చుకునేందుకు ఆయన పడరాని పాట్లు పడుతున్నారని దుయ్యబట్టారు. ఇవన్నీ బీజేపీకి మింగుడుపడని విషయాలని తెలిపారు. దేశంలోని యువతలో వస్తున్న స్పష్టమైన మార్పులకు ఇవన్నీ సంకేతాలని రాఘవులు చెప్పారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, యువతతో మమేకం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కూడగట్టాలని దిశా నిర్దేశం చేశారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ… ఈనెల 21 నుంచి అక్టోబరు ఐదు వరకు పార్టీ పత్రికల సర్య్కులేషన్ క్యాంపెయిన్‌ను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లో సమావేశాలను నిర్వహించాలని, బాధ్యులందరూ హాజరయ్యేలా చూడాలని సూచించారు. తద్వారా క్యాంపెయిన్‌ను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, నవతెలంగాణ సీజీఎమ్ పి.ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. రైతు నేత సారంపల్లి మల్లారెడ్డితోపాటు ఇటీవల మరణించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు సమావేశం తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆ తీర్మానాన్ని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు టి.జ్యోతి ప్రవేశపెట్టారు.
కర్తవ్యాలివే…
1) 21 నుంచి అక్టోబరు 5 వరకు పార్టీ పత్రికల సర్క్యులేషన్ క్యాంపెయిన్
2) ఈనెల 10న వీరనారి చాకలి ఐలమ్మ వర్థంతి నుంచి 17 వరకు తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మోటార్ సైకిల్ యాత్రలు నిర్వహించాలి
3) సర్ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 17న ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. పార్టీ బాధ్యులు ఎక్కడికక్కడ దాన్ని పరిశీలించి, పునాది వర్గాల ఓట్లను తొలగించకుండా చూడాలి. అవసరమైన చోట్ల కొత్త ఓట్లను నమోదు చేయాలి
4) 7న హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో పార్టీ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ, 13న బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీతారాం ఏచూరి వర్థంతి సభ నిర్వహణ. ఈ రెండు కార్యక్రమాలను జయప్రదం చేయాలి.



