Wednesday, September 2, 2026
E-PAPER
Homeజాతీయంఓటు హక్కుకు సర్‌ కత్తెర

ఓటు హక్కుకు సర్‌ కత్తెర

- Advertisement -

దేశవ్యాప్తంగా 13.37 కోట్ల ఓట్లు గల్లంతు
డ్రాఫ్ట్‌ జాబితాలతో ప్రజాస్వామ్యానికి కొత్త చిక్కులు
ఢిల్లీలోనే 33 శాతం ఓటర్ల పేర్లు తొలగింపు
తెలంగాణలోనూ 21.7 శాతం కోత
ఓట్లులేని వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి
సాధారణ పౌరుడి పైనే అదనపు భారం
ప్రభుత్వ యంత్రాంగం చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు

ఓటు అనేది ప్రజాస్వామ్యంలో పౌరుడి అత్యంత కీలకమైన హక్కు. కానీ ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) పేరుతో కోట్లాది మంది పేర్లు డ్రాఫ్ట్‌ జాబితాల నుంచి మాయమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13.37 కోట్ల మంది పేర్లు తొలగించగా.. ఢిల్లీలో ఏకంగా 32.8 శాతం, తెలంగాణలో 21.7 శాతం ఓటర్ల పేర్లకు కోత పడటం ఆందోళన కలిగిస్తోంది. తొలగించబడిన ఓటర్లు తిరిగి తమ పేర్లను చేర్చుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలపై ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) ప్రక్రియ భారీ స్థాయిలో పేర్ల తొలగింపునకు దారితీసింది. మూడు దశల్లో ఇప్పటివరకు 13.37 కోట్ల మంది ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్‌ రోల్స్‌ నుంచి తొలగించబడ్డాయి. ఇది సర్‌కు ముందు ఉన్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే 14.1 శాతం. తాజాగా మూడో దశలో ఢిల్లీ, మహారాష్ట్ర డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాలు విడుదల కావడంతో పరిస్థితి మరింత తీవ్రమైంది. ఢిల్లీలో 1.45 కోట్ల మంది ఓటర్లలో 47.7 లక్షల పేర్లు డ్రాఫ్ట్‌ జాబితాలో కనిపించలేదు. మహారాష్ట్రలో 9.78 కోట్ల నుంచి 7.71 కోట్లకు ఓటర్ల సంఖ్య తగ్గింది.

​కోట్ల సంఖ్యలో ఓట్లకు కోత
ఎన్నికల సంఘం చేపట్టిన సర్‌లో ఓటర్లను కొత్తగా ధృవీకరించే ప్రక్రియను అమలు చేస్తున్నారు. ప్రతి నమోదైన ఓటరు నిర్దేశిత కాలంలో ఎన్యూమరేషన్‌ ఫారం సమర్పించాలి. అంతేకాకుండా గతంలో జరిగిన చివరి సర్‌ సమయంలోని ఓటర్ల జాబితాలో తమ పేరు లేదా తల్లిదండ్రుల పేర్లతో తమను తాము ‘మ్యాప్‌’ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతను నిరూపించేందుకు అవసరమైన పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది. ఓటు హక్కు పొందేందుకు ఇప్పటికే నమోదై ఉన్న పౌరుడే.. మళ్లీ తన అర్హతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? పేరు తొలగించడం సులభంగా జరిగి, తిరిగి చేర్చుకోవాల్సిన బాధ్యత మాత్రం పౌరుడిపైనే పడితే.. పేదలు, వలస కార్మికులు, వృద్ధులు, నిరక్షరాస్యులు, పత్రాలు సరిగా లేని కుటుంబాల పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

​ఢిల్లీలో ప్రతి ముగ్గురిలో ఒకరి పేరు లేదు
దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి అత్యంత తీవ్రంగా కనిపిస్తోంది. సర్‌కు ముందు 1.45 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. డ్రాఫ్ట్‌ రోల్‌లో వారి సంఖ్య 97.53 లక్షలకు పడిపోయింది. అంటే దాదాపు 47.7 లక్షల మంది పేర్లు ఓటరు జాబితాలో లేవు. తొలగింపుల్లో 29.86 శాతం మంది గైర్హాజరు, వలస వెళ్లినవారు, ఇతర కారణాల కింద ఉన్నారు. మొత్తంగా 32.8 శాతం ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్‌ జాబితా నుంచి తొలగించబడ్డాయి. దేశ రాజధానిలోనే ఇంత భారీ స్థాయిలో ఓటర్ల జాబితా మారడం సహజంగానే తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

​తెలంగాణలో 21.7 శాతం కోత
సర్‌ ప్రభావం తెలంగాణపైనా గణనీయంగానే పడింది. ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం తెలంగాణలో 21.7 శాతం ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. అంటే ప్రతి ఐదుగురు ఓటర్లలో ఒకరి పేరు డ్రాఫ్ట్‌ జాబితాలో లేదన్నమాట.

​మహారాష్ట్రలోనూ కోట్లల్లో పేర్లు తొలగింపు
మహారాష్ట్రలో సర్‌కు ముందు 9.78 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. డ్రాఫ్ట్‌ జాబితాలో ఆ సంఖ్య 7.71 కోట్లకు పడిపోయింది. అంటే సుమారు 2.07 కోట్ల మంది ఓటర్ల పేర్లు డ్రాఫ్ట్‌ జాబితాలో లేవు. మహారాష్ట్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం 3.56 శాతం మంది మరణించినవారిగా, 15.78 శాతం మంది శాశ్వతంగా వలస వెళ్లిన, గైర్హాజరు లేదా ఇతర కేటగిరీలుగా, 1.81 శాతం మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైనవారిగా గుర్తించబడ్డారు. మొత్తంగా 21.1 శాతం మేర ఓటర్ల సంఖ్య తగ్గింది.

​తొలగింపు సులువే.. తిరిగి పొందడమే పెద్ద సవాల్‌
ఎన్నికల సంఘం ప్రకారం డ్రాఫ్ట్‌ జాబితాలో తప్పుగా పేరు తొలగించబడినవారు తుది జాబితాలో పేరు చేర్చుకోవడానికి ఒక నెలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న.. ఈ సమాచారం ప్రతి ఓటరుకూ చేరుతుందా? గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వృద్ధులు, వలస కార్మికులు, పేదలు, డిజిటల్‌ సౌకర్యాలు లేని కుటుంబాలు, సరైన పత్రాలు లేని వారు ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయగలరా? పేరు తొలగించబడిన విషయం తెలియకపోతే? అప్లికేషన్‌ గడువు ముగిసిపోతే? అలాంటప్పుడు ఎన్నికల రోజున తమ ఓటు హక్కు కోల్పోయిన పౌరుడికి పరిహారం ఏమిటి? ఇవే ఇప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణపై కీలక ప్రశ్నలుగా మారుతున్నాయి.

​జమిలీ కోసమేనా..?
ఇక్కడే రాజకీయ ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంస్కరణలు, పారదర్శకత, ‘ఒక దేశం-ఒక ఎన్నిక’ వంటి అంశాలను పదేపదే ప్రస్తావిస్తోంది. అయితే అదే సమయంలో కోట్లాది మంది ఓటర్ల పేర్లు ఒకేసారి డ్రాఫ్ట్‌ జాబితాల నుంచి తొలగించబడటం ‘సర్‌’ ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. ఎన్నికల్లో గెలవడం ఎంత ముఖ్యమో.. ఓటర్ల హక్కును కాపాడటం అంతకంటే ముఖ్యమని కేంద్రంలోని మోడీ సర్కారు గుర్తించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఒక నకిలీ ఓటును తొలగించడం ప్రజాస్వామ్య పరిరక్షణ అయితే.. ఒక నిజమైన ఓటును తొలగించడం ప్రజాస్వామ్య హక్కుపై దెబ్బగా వారు అభివర్ణిస్తున్నారు.

​13.37 కోట్ల పేర్లు ఔట్‌!
దేశవ్యాప్తంగా మూడు దశల్లో ఇప్పటివరకు 13.37 కోట్ల పేర్లు డ్రాఫ్ట్‌ రోల్స్‌ నుంచి తొలగించబడ్డాయి. అత్యధిక తొలగింపు శాతం ఈ కింది విధంగా ఉంది.

ఢిల్లీ – 32.8 శాతం
​దాద్రా-నగర్‌ హవేలీ,
డామన్‌-డయ్యూ – 29.6 శాతం
​తెలంగాణ – 21.7 శాతం
​మహారాష్ట్ర – 21.1 శాతం
​అండమాన్‌ అండ్‌ నికోబార్‌ – 20.6 శాతం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -