Wednesday, September 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంగడీలు బద్దలు కొట్టాం

గడీలు బద్దలు కొట్టాం

- Advertisement -

ఇనుప కంచెలు పెకిలించేశాం
స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్న తెలంగాణ :ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

గడీలను బద్దలు కొట్టి, ఇనుప కంచెలను పెకిలించి తెలంగాణకు స్వేచ్ఛా వాయువులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని సీఎల్పీ మీడియా సెంటర్ లో ఆయన మాట్లాడారు. ప్ర‌జ‌లు నిరంకుశ‌, నియంత విధానాల నుంచి విముక్తి పొందారని తెలిపారు. బీఆర్ఎస్ రూ.8.11 లక్షల కోట్ల అప్పులను చేసి అధికారం తమకప్పగించినా సరే… అభివృద్ధి, సంక్షేమంతో ముందుకెళ్తున్నామని తెలిపారు. సీఎంగా విఫలమైన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా కూడా విఫలమయ్యారనీ, ప్రజల గురించి మాట్లాడకుండా ఆయన ప్రజా ధనం వృధా చేస్తున్నారని విమర్శించారు.
ఆయన జీతానికి, భద్రతకు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా ప్రతిపక్ష నేతగా ఆయన పని చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పనుల కోసం తప్ప బయటికి రాని కేసీఆర్ ను కవర్ చేసేందుకు కేటీఆర్, హరీశ్ రావు కవర్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఆయనను ప్రజలు తిరిగి స్వీకరించేది లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అవినీతిని కల్వకుంట్ల ఇంటి ఆడబిడ్డనే బయటపెడుతుందనీ, ముందుగా ఆమెకు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వారికి సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే నైతిక అర్హత లేదని కొట్టిపారేశారు. అధికారం లేకుంటే ప్రజల గురించి మాట్లాడనని చెప్పే కేసీఆర్ ది బూర్జువా మనస్థత్వమని విమర్శించారు. ఇ్పపటికైనా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారని ఆయన ఆశిస్తున్నట్టు తెలిపారు.

​కూకట్ పల్లి ఎమ్మెల్వేవి దొంగ ఏడుపులు : సత్యం శ్రీరంగం
కూకట్ పల్లి ఎమ్మెల్యే దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఆ ఎమ్మెల్యే ఒక్క అభివృద్ధి పని చేయలేదనీ, కేవలం ఆస్తుల మాత్రమే సంపాదించుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ పాలనపై ఛార్జ్ షీట్ వేసే నైతిక అర్హత లేదని కొట్టిపారేశారు. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు, రైతులు ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సువర్ణ అక్షరాలతో లిఖించబడిందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క వర్గం బాగుపడలేదని చెప్పారు.

​బీఆర్ఎస్‌ పదేళ్ల పాలన.. ‘దగా’ల చిట్టా గాంధీ భవన్‌లో ఫొటో ఎగ్జిబిషన్‌
బీఆర్ఎస్ పదేండ్ల పాలన అంతా మోసమేనని తెలంగాణ మత్స్య సహకార సంస్థ చైర్మెన్ మెట్టు సాయికుమార్‌ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ లో సాయికుమార్ అబద్ధాలు–వాస్తవాలు’ పేరుతో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేశారు.
‘దశాబ్దపు దగా’ వర్సెస్‌ ‘ప్రజా పాలన’ అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని బీఆర్ఎస్‌ పాలనలో ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ఒకవైపు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను మరోవైపు ప్రదర్శించారు. ఫొటోలు, పోస్టర్ల ద్వారా రెండు ప్రభుత్వాల పాలనను వివరించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, కేజీ టు పీజీ హామీ తదితర అమలు కాని బీఆర్ఎస్ హామీలను ఎండగడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అమలవుతున్న యంగ్ ఇండియా స్కూళ్లు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ తదితర పథకాలను ప్రదర్శించారు.
​సర్వేల యజమానులు బీఆర్ఎస్ దళారులుగా మారొద్దు : చనగాని దయాకర్
బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయి సర్వేల యజమానులు దళారులుగా మారొద్దని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ కోరారు. మంగళవారం ఆయన గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. చాణక్య సర్వేలు, చిల్లర సర్వేలు ప్రజలను ప్రభావితం చేయలేవని కొట్టిపారేశారు. వరుస ఎన్నికల్లో గెలుస్తున్న కాంగ్రెస్ కు ప్రజాభిమానం మెండుగా ఉందని తెలిపారు.

​భయపడొద్దు..మహిళా కాంగ్రెస్ పోరాడుతుంది : ఎర్రబెల్లి స్వర్ణ
బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు ఎవరూ భయపడొద్దని మహిళా కాంగ్రెస్ అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తుందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ భరోసానిచ్చారు. మంగళవారం హైదరాబాద్ లోని గాంధీభవన్ ముందుమహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో డరో మత్ (భయపడొద్దు – మహిళా కాంగ్రెస్ పోరాడుతుంది.) అంటూ శాంతియుత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణ మాట్లాడుతూ శుద్ధీకరణ పేరుతో దళితులను అమానించిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కూర్చున్న చోటును శుద్ధీకరించాలని అవమానించిందన్నారు. కులగణన, మహిళల రిజర్వేషన్లతో పాటు ప్రజల గురించి రాహుల్ గాంధీ ఏం మాట్లాడిన కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రామంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మరియు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

​తొలగించిన ఓటర్ల ఇండ్ల వద్దే రీవెరిఫికేషన్ చేయాలి : సీఈవోకు కాంగ్రెస్ వినతి
రాష్ట్రంలో తొలగించిన 73 లక్షల మంది ఓటర్ల ఇండ్ల వద్దే రీవెరిఫికేషన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ చైర్మెన్ పులిపాటి రాజేష్ కుమార్, సభ్యులు వాజిద్ హుస్సేన్ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. సర్ ప్రక్రియ రెండో దశలో భాగంగా నోటీస్ విచారణ సమయంలో చాలా మంది ఓటర్లు ఎన్యుమరేషన్ ఫాం సమర్పించినప్పటికీ వారిని ఏఎస్డీడీ లిస్టులో పెట్టి తొలగించారని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆ లిస్టును అడుగుతున్నప్పటికీ ఇవ్వడం లేదనీ, అందుకే బీఎల్ఏలతో కలిసి రీవెరిఫికేషన్ చేయించాలని కోరారు. అభ్యంతరాల గడువును అక్టోబర్ 16 వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -