త్వరలో 5జీ ధరల మోత..!

త్వరలో 5జీ ధరల మోత..!– 10 శాతం మేర అదనపు చార్జీ
–  టెలికం కంపెనీల యోచన
న్యూఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత సెల్‌ఫోన్‌ వినియోగదారులకు ధరల మోత మోగనుంది. 5జి వాడేవారిపై 10 శాతం మేర అదనపు బాదుడు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లు 5జీ సేవలను అందిస్తున్నాయి. ఇవి ప్రస్తుతం అందిస్తున్న తమ అపరిమిత 5జీ డేటా ప్లాన్‌లను ఉపసంహరించుకునే అవకాశం ఉందని ఎకనామిక్‌ టైమ్స్‌ ఓ కథనంలో తెలిపింది. ఆదాయ వృద్థిని పెంచుకోవడానికి 2024 ద్వితీయార్థం నుంచి 4జీతో పోలిస్తే 5జీ సేవలకు కనీసం 5-10 శాతం ఎక్కువ చార్జీ విధించే అవకాశం ఉందని ఈ రంగం నిపుణులు పేర్కొంటున్నారు. 2024 సెప్టెంబర్‌ త్రైమాసికంలో రెండు టెలికం కంపెనీలు కూడా మొబైల్‌ టారీప్‌లను 20 శాతం పెంచిన ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదని అంచనా వేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌లో దేశంలోని తొలిసారి 5జీ సేవలను జియో, ఎయిర్‌టెల్‌లు ప్రారంభించాయి. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ”టెలికం కంపెనీలు ప్రస్తుత 5జి ప్లాన్లను ఉపసంహరించుకోనున్నాయి. ఆదాయాలను పెంచుకోవడానికి, వినియోగదారుల నుంచి సగటు రాబడిని పెంచుకోవడానికి ఈ ఏడాది ద్వితీయార్థంలో కొత్త ప్లాన్లను ప్రకటించ నున్నాయి. 4జీ ప్లాన్లను ఉపసంహరించుకుని ప్రత్యేకంగా 5జి ధరలను ప్రకటించే అవకాశం ఉంది.” అని గ్లోబల్‌ బ్రోకరేజీస్‌ సంస్థ జెఫరీస్‌ ఓ పరిశోధన నోట్‌లో తెలిపింది. ప్రస్తుతమున్న రూ.200 సగటు వినియోగ దారుడి రెవెన్యూను రూ.250కి చేర్చుకోవాలని నిర్దేశించుకున్నామని భారతీ ఎయిర్‌టెల్‌ ఎండీ గోపాల్‌ విట్టల్‌ గతేడాది నవంబర్‌లో పేర్కొన్నారు. దేశంలో జియో, ఎయిర్‌టెల్‌లకు దాదాపు 12.5 కోట్ల 5జీ వినియోగదారులున్నారు. ఈ సంస్థ 2024 ముగింపు నాటికి 20 కోట్లకు చేరనుందని అంచనా. 2025 మార్చి ముగింపు నాటికి దేశ వ్యాప్తంగా 5జీ సేవల ఆధునీకరణ జరగనుందని బీఓఎఫ్‌ఏ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. 4జీ సైట్లను 5జీకి అప్‌గ్రేడ్‌ చేయనున్నాయని పేర్కొంది. రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా చివరి సారిగా 2023 నవంబర్‌లో 19-25 శాతం మేర టారీఫ్‌లను పెంచాయి. ”ఎయిర్‌టెల్‌ తొలుత టారిఫ్‌ పెంచొచ్చు. అదే బాటను విఐ, జియో అనుసరించే అవకాశం ఉంది. భారత మొబైల్‌ రంగ ఆదాయం, టారిఫ్‌ పెంపుదల, పెరుగుతున్న డేటా వినియోగం ద్వారా 2024లో టెలికం రంగం మరింత వృద్థి చేయనుంది.” అని సీఎల్‌ఎస్‌ఏ ఓ నోట్‌లో పేర్కొంది. సీఎల్‌ఎస్‌ఏ అంచనా ప్రకారం.. 2023-24లోని రూ. 2.46 లక్షల కోట్ల మొబైల్‌ రంగ రెవెన్యూ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 2.77 లక్షల కోట్లకు, 2025-26లో రూ.3.07 లక్షల కోట్లకు పెరగొచ్చు.

Spread the love