ఆఫీస్‌కు రాకుంటే ఇంటికే..!

– ఉద్యోగులకు మెటా హెచ్చరిక
న్యూఢిల్లీ : ఉద్యోగులు తప్పకుండా కార్యాలయాలకు రావాల్సిందేనని మెటా తమ సిబ్బందికి స్పష్టం చేసింది. వారానికి కనీసం మూడు రోజులు అయినా ఆఫీసుల కు రావాలని.. లేకపోతే ఉద్యోగం వదిలి ఇంటికి వెళ్లిపోవచ్చని హెచ్చరించింది. సెప్టెంబర్‌ 5 నుంచి ఈ నిబంధనను కఠినంగా అమలు చేయనున్నట్లు ఉద్యోగులకు జారీ చేసిన నోటిసులో స్పష్టం చేసిందని రిపోర్ట్‌లు వస్తోన్నాయి. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సంస్థల మాతృసంస్థ అయినా మెటా తమ ఉద్యోగులు ఆఫీసుకు వచ్చే హాజరు శాతాన్ని పరిశీలించాలని మేనేజర్లకు సూచించింది. ఆఫీసులకు రావడం ద్వారానే ఉద్యోగుల మధ్య బంధాలు బలోపేతం కావడంతో పాటుగా.. టీమ్‌ వర్క్‌కు ఈ నిర్ణయం దోహదపడుతుందని మెటా నోటీసు లో పేర్కొంది. కాగా.. ఈ నిర్ణయం నుంచి కొద్ది మంది రిమోట్‌ ఉద్యోగు లకు మినహాయింపునిచ్చినట్లు సమాచారం. కరోనా కాలంలో అనేక ఐటి కంపెనీలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే సౌలభ్యాన్ని కల్పించిన విషయం తెలిసిందే. కరోనా ముగిసినప్పటికీ ఇప్పటికీ అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచే పనికి ఆసక్తి చూపుతున్నారు. ఆఫీసులకు రావడానికి అనాసక్తి చూపుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే పలు ఐటి కంపెనీలు ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆఫీసులకు తప్పనిసరిగా రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేశాయి. మరికొన్ని కంపెనీలు వారంలో కొన్ని రోజులు ఇళ్లు, కొన్ని రోజులు ఆఫీసుకు రావాలని హైబ్రిడ్‌ విధానాన్ని అనుసరిస్తున్నాయి. కాగా.. ఇంటి వద్ద నుంచి పెద్ద ఫలితాలు రావడం లేదని ఐటి కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో కంపెనీ వరుసగా కార్యాలయాలకు రావాల్సిందేనని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. లేనిచో ఉద్యోగాలు ఊడుతాయని బెదిరిస్తున్నాయి.

Spread the love