నవతెలంగాణ ఆర్మూర్
ఏరియా ఆసుపత్రిని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) శుక్రవారం సందర్శించి మాతా శిశు ఆరోగ్య ప్రసవ సేవలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మార్పు సెల్ సిబ్బంది డ్యూటీ రోస్టర్, వారి పనితీరును డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. అలాగే వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా ప్రసవ తేదీల అంచనా జాబితా , ప్రసవాలకు సంబంధించి చేపడుతున్న ముందస్తు సన్నద్ధతను సమీక్షించారు.జిజిహెచ్ లాంటి వైద్య కేంద్రాలకు రిఫర్ చేసిన ప్రసవ కేసుల వివరాలను నిరంతరం పర్యవేక్షించాలని, సంబంధిత కేసులు రిఫరల్ కేంద్రంలో ప్రసవించాయా లేదా అనే విషయాన్ని తప్పనిసరిగా నిర్ధారించి, తదనుగుణంగా ఫాలోఅప్ చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఏ పి.హెచ్.సి కి చెందిన ఏఎంసీ గర్భిణీలు ఏ రోజున ఏరియా ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం రానున్నారో ముందుగానే సంబంధిత పీహెచ్సీలకు సమాచారం అందించాలని సూచించారు.ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ల్యాబొరేటరీ సేవలు, గర్భిణీలకు అవసరమైన వివిధ వైద్య పరీక్షల లభ్యతను కూడా డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. అనంతరం గర్భిణీలకు అందించే ఎం సి పి కార్డులను తనిఖీ చేసి, అందులోని ప్రతి కాలమ్‌ను తప్పనిసరిగా పూర్తిగా, సక్రమంగా నమోదు చేయాలని ఆదేశించారు. ఏరియా ఆసుపత్రిలో సంస్థాగత ప్రసవాలను మరింత పెంచడంతో పాటు, మాతా శిశు ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. గర్భిణీలకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, మార్పు సెల్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా ఆసుపత్రి ఆర్ ఎం ఓ అమృత్ రాంరెడ్డి గైనకాలజిస్ట్ డాక్టర్. స్రవంతి పిల్లల వైద్యులు అజయ్ ,ఇతర వైద్యులు, స్టాఫ్ నర్సులు మార్పు సెల్ సిబ్బంది,సబ్ యూనిట్ అధికారి సాయి తదితరులు పాల్గొన్నారు.
ఏరియా ఆసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య సేవలపై డీఎంహెచ్‌ఓ ఆరా…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



