ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్..
నవతెలంగాణ – ముధోల్
కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ శనివారం నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు, అధ్యాపకులు ,భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. గీర్వాణి కళాశాల నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.12 వేల కోట్లకు పైగా పేరుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలల యాజమాన్యాలు, సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు.
ప్రభుత్వం విద్యారంగంపై చిన్నచూపు చూడటం తగదన్నారు. జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందని వారు ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను భారీగా తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించినా ఉద్యోగ నియామకాల్లో పురోగతి కనిపించడం లేదని వారు విమర్శించారు. నిరుద్యోగ భృతి రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చి నయవంచనకు పాల్పడ్డారని ఆరోపించారు.
విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, యువతకు యూత్ కమిషన్ ద్వారా రూ.10 లక్షల వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులను మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమ సమస్యలపై గళమెత్తితే పరిష్కారం చూపకుండా అక్రమ కేసులు పెట్టి అణచివేస్తున్నారని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని, విద్యార్థులు–నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, పడకంటి రమాదేవి,డా.కిరణ్ కొమిరేవార్,లోలం శ్యాంసుందర్,విలాస్ గాదేవార్ నాయకులు గంగాధర్, చిన్నాన్న,శ్రీకాంత్, గంగారెడ్డి, గీర్వాణి, శ్రద్ధ డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.



