మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోతు కవిత
నవతెలంగాణ-నెల్లికుదురు
కాంగ్రెస్ వెయ్యి రోజుల ప్రజాపాలన పూర్తిగా విఫలమైందని మహబూబాబాద్ బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోతు కవిత అన్నారు. మండల కేంద్రంలోని శనివారం వెయ్యి రోజుల విఫలమైన పాలనపై సమరభేరి మోగించే కార్యక్రమాన్ని ఆ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో బీఆర్ఎస్ సమభేరిలో భాగంగా ఫీజురీయింబర్స్మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. వంద కాదు వెయ్యి రోజులైంది.. ఏ ఒక్క హామీకి అతీలేదు.. గతి లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతోందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మెడలు వంచి గ్యారెంటీలు అమలు చేయించడమే మా లక్ష్యమన్నారు.
ఎన్నికల ముందు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి బాండ్ పేపర్లు రాసిచ్చారని గుర్తుచేశారు. విద్యార్థులకు భరోసా కార్డులు, ఆడపిల్లలకు స్కూటీలు, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదనీ, నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు తన మనుగడ సాగించలేదని గుర్తు చేశారు. తొలి ఏడాది 2 లక్షల ఉద్యోగాల హామీకి వెయ్యిరోజులైనా దిక్కులేదనీ, అడిగితే నిరుద్యోగులను ఎండ్రిన్ తాగమంటాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అడిగితే విద్యార్థుల వీపులు పగలగొడుతున్నాడనీ, ఆశా, అంగన్వాడీ వర్కర్లపై లాఠీచార్జ్ చేయిస్తున్నాడనీ ప్రజా పాలనంటే ఇదేనా అని ప్రశ్నించారు. భారీగా ఫీజులు పెంచి దారుణ మోసం చేసిన దగాకోరు ప్రభుత్వమని మండిపడ్డారు. 12 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు ఎగనామం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
గురుకుల వ్యవస్థ మొత్తం నిర్వీర్యం, వెయ్యిరోజుల పాలనలో వెయ్యి గురుకులాల విధ్వంసం, 30 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించే కుట్ర చేస్తోందని అన్నారు.137 గురుకుల విద్యార్థుల చావుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు పరిపాటి వెంకట్ రెడ్డి ,మండల ప్రధాన కార్యదర్శి వెన్నకుల శ్రీను వాస్ ,మాజీ జడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి ,మాజీ ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి నవీన్ రావు , పట్టణ అధ్యక్షుడు ఆదిరెడ్డి , యూత్ మండల అధక్షుడు అశ్విన్, బానోత్ భీముడు, బత్తిని అనిల్ గౌడ్ ,బిక్కు నాయక్ ,ఆకుల జగ్గయ్య , ఎండి నజీర్ అహ్మద్ ,యాకుబ్ రెడ్డి ,ఎండి షరీఫ్ , రెహమాన్, బానోతు బొజ్జ ,నవీన్ రావు ,మంద అశోక్ , వారి పల్లి వెంకటేష్ , ఆ పార్టీ వివిధ గ్రామాల సర్పంచులు జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.



