మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోతు కవిత
నవతెలంగాణ-నెల్లికుదురు
కాంగ్రెస్ పాలనలో ప్రజలు కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోతు కవిత అన్నారు. శనివారం కార్యకర్తలతో కలిసి వారు అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీగా వెళ్ళి స్తానిక సబ్ స్టేషన్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కరెంటు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో పంటలు వేయాలన్నా జంకుతున్నారని, మరోవైపు వేసిన పంటలకు కరెంటు కష్టాలతో నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు కనీసం మూడు గంటల కరెంటు కూడా రైతులకు ఇవ్వలేని దుర్భర స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. మేమేదైనా సమావేశాన్ని నిర్వహించుకున్నా.. కరెంటు కట్ చేస్తున్నారనీ, ఎదెక్కడి న్యాయమని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్ హయాంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇచ్చారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో వందశాతం బీఆర్‌ఎస్ పార్టే అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు భారీ జనసంద్రంతో పాటు కార్యకర్తలతో సబ్ స్టేషన్ ముందు చేపట్టిన నిరసన, దీక్ష కార్యక్రమాన్ని సీఐ సత్యనారాయణ, ఎస్ఐ కర్ణాకర్ తన సిబ్బంది కలిసి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, నాయకులు, పులి రామచంద్రు ఆకల జగ్గయ్య, వారి పల్లి వెంకటేష్, తీరగానే మల్లేశం గౌడ్, బొల్లు మురళి వివిధ గ్రామాల టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.



