Sunday, September 6, 2026
E-PAPER
Homeమానవిసేఫ్టీ ముఖ్యం

సేఫ్టీ ముఖ్యం

- Advertisement -

ప్రియమైన వేణు గీతికకు
నాన్నా! ఎలా ఉన్నావు? నాకు మొన్న రాత్రి నుండి జ్వరం. అసలు లేవ లేక పోయాను. ఎప్పుడు లేనిది 103 ఉంది టెంపరేచర్. విశాఖపట్నం ప్రయాణం. మందులు వేసుకుంటే సాయంత్రానికి నార్మల్ అయింది కానీ, మళ్ళీ రైల్లో జ్వరం వచ్చింది. ఎలాగో విశాఖపట్నం చేరాను. సరే ఇక అసలు విషయంలోకి వస్తా.. నేను చెప్పాలని ఎప్పటి నుండో అనుకుంటున్న ఓ విషయం మనసులోంచి వెళ్ళిపోయింది. మొన్న పేపర్‌లో ఒక వార్త చదివిన తర్వాత మర్చిపోకుండా చెప్పాలని పించింది. పాపం అభం శుభం తెలియని ఒక నర్సు ప్రాణం తీసాడు ఒక దుర్మార్గుడు. సేఫ్టీ లేకపోవడం వల్ల జరిగిన సంఘటన ఇది. ఎక్కడైనా సరే మనం ఇల్లు అద్దెకు తీసుకుంటున్నా, హాస్టల్‌‌లో ఉంటున్నా సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్దులు ఇంట్లో ఉన్నప్పుడు వారు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. అపరిచితులు వచ్చినప్పుడు వెంటనే తలుపులు తీయకుండా గ్రిల్స్ లేదా వ్యూ మిర్రర్ లేదా మెష్ ఉండేలా చూసుకోవాలి. ఇవి ఉన్నందువల్ల కొంతైనా సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది. ఏదైనా అనుమానం వస్తే తెలిసిన వారికి ఫోన్ చేసి పిలిచే సమయం ఉంటుంది. సేఫ్టీ గురించి ఆలోచించే మన ఇంట్లో గ్రిల్స్ పెట్టించాం. ఒక సారి మేము ఇంట్లో లేనప్పుడు గ్యాస్ సిలెండర్ తీసుకొచ్చారు.

అప్పడు నువ్వు చిన్న పిల్లవి, తలుపు తీయ కుండా ఇంటర్ కమ్స్ ఉండటం వల్ల కింది ఫ్లాట్ వాళ్లకు ఫోన్ చేసి చెప్పావు. ఇలాంటి జాగ్రత్తలు పిల్లలకు తరచూ చెప్తూ ఉండాలి. కిటికీలకు తప్పనిసరిగా గ్రిల్స్ ఉండాలి. ఈ మధ్య కాలంలో గ్రిల్స్ లేకుండా ఒక్క గ్లాస్ డోర్స్ పెడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ ఉంటుంది. అయినా కూడా జాగ్రత్తలు అవసరం. ఎప్పుడైనా సరే ఒక అలవాటుగా చేసుకోవాలి, తలుపులు సరిగా వేసామా లేదా అని చెక్ చేసుకోవాలి, ముఖ్యంగా ఇండిపెండెంట్ ఇళ్లకు. సేఫ్టీ ఉన్నందున ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే తలుపులు తీసుకుని బయటకు వెళ్ల కుండా ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో భార్యా భర్తలు ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో పిల్లల గురించి ఎక్కువ టెన్షన్ ఉంటుంది. వాళ్ళు స్కూల్ నుండి త్వరగా వచ్చేస్తారు. ఇంట్లో పెద్ద వాళ్ళు ఉంటే కొంచం నిశ్చింత. ఇంకో ముఖ్య విషయం ఈ సదుపాయాలు లేనప్పుడు ఎవరైనా తెలియని వారు వస్తే కొంచం తలుపు తీసి చూడకుండా, పూర్తిగా బయటకు వచ్చేయాలి. ఎందుకంటే బైట కొద్దో గొప్పో జన సంచారం ఉంటుంది, గట్టిగా కేకలు పెట్టే అవకాశం ఉంటుంది. ప్రమాదాలు, ఆపదలు మనకు చెప్పి రావు నాన్నా! మన జాగ్రత్తల్లో మనం ఉంటూ, పరిసరాలు గమనిస్తూ ఉండాలి. నీకు కూడా చాలా సార్లు చెప్పాను, ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే నువ్వు తలుపు తీసుకుని బయటకు వెళ్ళు. సరే నాన్నా ఉంటాను. ఇంకా నీరసంగా ఉంది. అతి కష్టం మీద ఈ ఉత్తరం రాసాను. ఉంటాను బంగారు తల్లి. ఆరోగ్యం జాగ్రత్త.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -