Sunday, September 6, 2026
E-PAPER
Homeచౌరస్తాఒక్కటి కాదు!

ఒక్కటి కాదు!

- Advertisement -

రౌడీ ముదిరి రాజకీయ నాయకుడైనట్టు పొద్దున చురచర మంటూ వచ్చిన సూర్యుడు కరకరమని కోస్తే కత్తిలాగయ్యాడు. మండిపోతున్న ఎండలో ఉల్లాసంగా ఉత్సాహంగా తిరగలేని జనం, చెమటలు తుడుచుకోలేక ఆగమవుతామని రోడ్ల మీద తిరగడం లేదు. రోడ్డు మీద వాహనాల రొద కూడా పెద్దగా లేదు. ఏదో ఓ పని మీద ఏదో ఓ చోటికి వెళ్లి ఏదో ఓ పని కాక ఉసూరుమంటూ వచ్చిన ఏదో ఓ మనిషి ఎండకు ఎర్రబడ్డ ముఖంతో ఏదో ఓ చెట్టు కింద బండరాయి మీద కూచున్నాడు. కాసేపు రెస్టు దొరుకుతుందని.
ఆ చెట్టు అదేం చెట్టోగాని కుంభకర్ణుడి బాడీలా భారీగా వుంది. దాని పొట్టలో ఓ తొర్ర వుంది. అందులో ఉన్న జీవం ఒకటి మనిషి అలికిడి విని నాలుక చప్పరిస్తూ బయటకు తల చూపింది. మనిషి ఉలిక్కిపడ్డాడు. వాడి గుండె అంతకుముందే ‘లబ్‌‌డబ్‌’ మానేద్దామా అనుకుంది. లేచి పరుగెత్తితే పంచప్రాణాలకు ‘సేఫ్టీ’ వుంటుందా లేదా అని వాడి మెదడులో వున్న ‌గజిబిజి న్యూరాన్లు గందరగోళంలో పడ్డవి. చెట్టునీడన వున్నా వాడి ముఖం మీద కారిపోతున్న చెమట చూసి చిరునవ్వు నవ్వింది తొర్రలోనుంచి సగం బయటకు వచ్చిన ఆకారం. ‘డోంట్‌ ‌ఫియర్‌! నేను నిన్ను ఇప్పుడేమీ చెయ్యను. దారితప్పి అడవిలోనుంచి బయటకు వచ్చాను. ఇంతమంది జనం ఉన్నచోటు చూసి ఆకలి చచ్చిపోయింది. కడుపు నిండిపోయింది. కానీ ఒక డౌటు. అడగనా? అంది పసుపు పచ్చని కోటు మీద నల్లటి గీతలున్న ఆకారం. కాళ్లు భయంతో దిక్కుతోచక ఒకదాన్కొటి ఢీ కొడుతుంటే ఎండిపోయిన నోటిలో నీటిచుక్క కోసం వెతుక్కుంటున్న నాలుక బయటకు పెట్టి ‘పులి.. పెద్దపులి’ అన్నాడు మనిషి.
‘పులా? పులంటే? ఎక్కడ?’ అనడిగింది పులి తనను మనుషులు పులి అంటారని తెలీని పెద్దపులి.
‘పులంటే నువ్వే! నిన్నే మేం పులి అని తెలుగులో, టైగర్‌ అని ఇంగ్లీషులో పిలుచుకుంటాం’ అన్నాడు మనిషి, తెలుగులో మాట్లాడుతున్న పులి, మన తెలుగుపులే కదా అని భయం తగ్గి.
‘భలే పేరు పెట్టారే నాకు వారెవ్వా! పులి! నేను పులిని’ అంది పులి నోరు తెరిచి పళ్లు బయటపెట్టి.
దీని డౌటు సంగతి తేల్చి అక్కడ్నించి వీలు చూసుకుని చెట్టెక్కడమో, కాలి చెప్పులు వదిలేసి పరుగెత్తడమో చెయ్యాలనుకున్న మనిషి ‘తమరేదో డవుటు అన్నారు’ అని నసిగాడు.
‘అక్కడికే వస్తున్నా! అడవిలో అయితే ఏ జంతువు ఎదురుపడితే దాన్ని లంచ్‌ ‌చేసేదాన్ని. కాని ఇక్కడ ఛాయిస్‌ ‌వుంది కదా. ఎండ తగ్గాక ఎలాగూ రోడ్డుమీదకి వస్తారు కదా! ఎవర్ని తింటే టేస్టీగా వుంటుందో సలహా ఇవ్వరాదూ!’ అంది పులి ముందు కాలితో ముఖం తుడుచుకుంటూ.
‘ఈ ఊళ్లో రకరకాల మనుషులున్నారు. నీకు ఏ మతం వాడు కావాలో చెప్పు!’ అన్నాడు మనిషి చెమటను కర్చీపు లేకపోవడాన చేత్తో తుడిచేసుకుంటూ.
‘ఏ మతమా? అదేంటది? వేరే వేరే మతాల వాళ్లుంటారా? అందరూ మనుషులేగా. రక్తంలో తేడా వుంటుందా? రుచిలో మార్పు వుంటుందా? నా కంటికి అందరూ ఒక్కలాగే కనపడుతున్నారే!’ అంది పులి.

‘పైకి ఒక్కలా కనపడ్డా అందరూ ఒక్కటి కాదు. రంగూ రక్తమూ ఒకటే అయినా ఒకళ్లంటే ఒకళ్లకి పడదు’ అంటూ పులి పక్కకు తిరిగి చెవి నోటితో లాక్కుంటుంటే ఇదే అదనని చెట్టు వెనక నుంచి పారిపోయాడు ఏదో ఓ మనిషి.
‘హమ్మో ఈ మనుషులు మహా టక్కరోళ్లే. మా అడవిలో కనిపించే నక్క పేగులోళ్లే. చెవి కొరుక్కునే లోపు మాయమైపోయాడు’ అనుకుంటుంటే ఎండనపడి వచ్చిన మరో మనిషి అరుగుమీద అప్పియరయ్యాడు. వాడు పోతేనేం వీడు లేడా? అని వీడినీ అడిగేద్దాం అని ‘ఉరేయ్‌! నువ్వు ఏ మతం మనిషివి? మతాన్ని బట్టి రుచిలో తేడా వుంటుందో లేదో చెప్పకుండానే పారిపోయాడు నీకంటే ముందు వచ్చిన వాడు’ అంది పులి.
పులిని చూసి మొదట జడుసుకోవడం, ఆ తర్వాత సర్దుకోవడం చేసిన మనిషి ‘వాడలా చెప్పాడా! వాడితో నేనీకభవించను. మనుషుల్లో మతమే కాదు, కులం కూడా ముఖ్యం. ఏ కులం వాడైతే నీ ఆకలి తీరుతుందా అని ఆలోచిస్తున్నా’ అన్నాడు మరో మనిషి.
‘కులమా? అదేందటి? వేరే వేరే కులాల వాళ్లుంటారా? అందరూ మనుషులేగా? రక్తంలో తేడా వుంటుందా? రుచిలో మార్పుంటుందా? ఈ ఫిట్టింగేమిటి’ అంది పులి చెట్టు తొర్రకి వీపు రాసుకుంటూ.
‘పైకి ఒక్కలా కనపడ్డా అందరూ ఒక్కటి కాదు, రంగూ రక్తమూ ఒక్కటే అయినా ఒకరు ఎక్కువా ఒకరు తక్కువా అని కొట్టుకుంటారు’ అంటూ పులి దృష్టి మళ్లింది చూసి చెట్టు వెనకనుంచి పారిపోయాడు మరో మనిషి.

వామ్మో ఈ మనుషులు మహా టక్కరోళ్లే. మా అడవిలో కనిపించే నక్క పేగులోళ్లే. వీపు గోక్కునేలోపు మాయమైపోయాడు అని పులి అనుకుంటుంటే ఎండనపడి వచ్చిన ఇంకో మనిషి అరుగు మీద ప్రత్యక్షమయ్యాడు. ‘ఉరేయ్‌! నువ్వే కులం మనిషివి? కులాన్ని బట్టి రుచిలో తేడా ఏం వుంటుందో చెప్పకుండానే పారిపోయాడు నీకంటే ముందు వచ్చినవాడు’ అంది పులి.
పులిని చూసి మొదట జడుసుకోవడం, తర్వాత సర్దుకోవడం చేసిన మనిషి మతమూ కులమూ అంటే నువ్వెవడివి, నీదే మతం, నీదే కులం అని పంజా కొడితే కిలో మటన్‌ ఊడి వస్తుంది అనుకుని ‘పులిగారూ! మిమ్మల్ని తప్పుదారి పట్టించారు వాళ్లిద్దరూ. అసలు మతమూ కులమూ కాదు పార్టీ. మనుషులకు అనేక పార్టీలూ, జండాలూ వుంటాయి. ఏ మనిషి ఏ పార్టీకి చెందినవాడో, ఏ జండా పట్టుకుంటాడో అది ముఖ్యం’ అన్నాడు ఇంకో మనిషి.
‘పార్టీనా? అదేంటది? వేరే వేరే పార్టీల వారంటే ఎవరు? రక్తంలో తేడా వుంటుందా? రుచిలో మార్పుంటుందా? అసలు నువ్వెవడివి? నీదే మతం? నీదే కులం? నీదే పార్టీ? చప్పున చెప్పు!’ అంది పులి పంజా విప్పుతూ.
అయ్యబాబోయ్‌! చచ్చాన్రోయ్‌! టైగర్‌ ‌జీ.. నన్ను వదిలేయండి. నాది ఏ మతమూ కాదు, కులమూ కాదు. పార్టీ కూడా కాదు. నేను ప్రజల క్షేమం కోరే నాయకుడిని. ఎన్నుకోవడానికి ఇవేవీ పట్టించుకోకుండా ఓటు వేసే ఓటర్ని’ అంటూ చెట్టెక్కేశాడు మనిషి.
వామ్మోవ్‌! ఈ మనుషులు మహా టక్కరోళ్లు. మా అడవిలో కనిపించే నక్క పేగులోళ్లే! అంటూ అడవి దారి పట్టింది పులి! పసుపు పచ్చని కోటు మీద నల్లటి గీతలు వున్న పెద్ద పులి!!

చింతపట్ల సుదర్శన్‌, 9299809212

- Advertisement -
Previous article
Next article
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -