Sunday, September 6, 2026
E-PAPER
Homeప్రత్యేకంమీ పిల్లలు బ్రెయిన్ బఫరింగ్ ఎదుర్కొంటున్నారా?

మీ పిల్లలు బ్రెయిన్ బఫరింగ్ ఎదుర్కొంటున్నారా?

- Advertisement -

ప్రత్యేక వ్యాసం

“Our fatigue is often caused not by work, but by worry, frustration and resentment.”
Dale Carnegie
“Your mind will answer most questions if you learn to relax and wait for the answer.”
William S. Burroughs

‘బ్రెయిన్ బఫరింగ్’ అనేది ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, పరిశోధకులు, ముఖ్యంగా సృజనాత్మక రచనా రంగంలో ఉన్నవారు ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన మేధో సమస్య. అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా, డ్యూక్ విశ్వవిద్యాలయాలతో పాటు స్వీడన్‌లోని లుండ్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ బ్రెయిన్ బఫరింగ్ దుష్ప్రభావాల మీద విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు.

బ్రెయిన్ బఫరింగ్ వల్ల విద్యా, వైజ్ఞానిక, సృజనాత్మక రంగాలు కుంటుపడి పోతున్నాయని, కొత్త ఆలోచనలు, వినూత్న ప్రయోగాలు పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు బ్రెయిన్ బఫరింగ్‌ను నిర్లక్ష్యం చేసేవాళ్లు భవిష్యత్తులో శారీరక, మానసిక, వృత్తిపరంగా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. బ్రెయిన్ బఫరింగ్ అంటే మెదడు మందగించిన ఒక మానసిక స్థితి. ఇంటర్నెట్ నెమ్మదిగా ఉన్నప్పుడు వీడియో ఎలాగైతే లోడ్ అవ్వకుండా ‘బఫరింగ్’ అవుతుందో, అలాగే మన మెదడు కూడా సమాచారాన్ని త్వరగా ప్రాసెస్ చేయలేక, ఆలోచించడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. దీనిని న్యూరోసైకాలజీలో కాగ్నిటివ్ డిస్‌ఫంక్షన్ లేదా మెదడు పొగమంచు అని కూడా అంటారు. సడన్‌గా ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు చెప్పాల్సిన విషయం గుర్తుకురాక ఆగిపోవడం, ఒకే పనిపై ఎక్కువసేపు ఏకాగ్రత పెట్టలేకపోవడం, చదివిన విషయాన్నే మళ్లీ మళ్లీ చదవాల్సి రావడం, నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం చేయడం ఈ బ్రెయిన్ బఫరింగ్ ప్రధాన లక్షణాలు.

ఓహియోలోని ప్రసిద్ధ క్లీవ్‌లాండ్ క్లినిక్ బ్రెయిన్ స్టడీ నిపుణుల ప్రకారం.. గుండెతోపాటు మనిషిలో ఎప్పుడూ నిరంతరం యాక్టివ్‌గా పనిచేయాల్సిన మెదడు ఎందుకు మొరాయిస్తుందంటే, నిద్ర సరిగ్గా పోకపోవడం, తీవ్రమైన శారీరక అలసట, మానసిక ఒత్తిడి లేదా ఆందోళనకి గురికావడం, ఒకేసారి అనేక పనులు చేయడం, విటమిన్ బి12 లోపం వంటి పోషకాహార లోపాలు, డీహైడ్రేషన్, అధిక స్క్రీన్ టైమ్ వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఈ బ్రెయిన్ బఫరింగ్ మూలంగా విద్యార్థులు ప్రధానంగా ఏకాగ్రత లోపం, జ్ఞాపకశక్తి తరుగుదల, వాయిదా వేసే స్వభావం, నిర్ణయాత్మక శక్తి క్షీణించడం, ఆత్మవిశ్వాసం దెబ్బతినడం వంటి కాగ్నిటివ్ అండ్ బిహేవియరల్ బారియర్స్‌తో సతమతమవుతుంటారు. దీన్నుంచి బయటపడటానికి రోజుకు 7-8 గంటల నిద్ర, తగినంత నీరు తాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు 25 నిమిషాల చదువు తర్వాత 5 నిమిషాల విరామం ఇచ్చే ‘పొమోడోరో టెక్నిక్’, రోజువారీ వ్యాయామం, డిజిటల్ డిటాక్స్ వంటి అలవాట్లను జీవనశైలిలో భాగం చేసుకోవాలి. ఒకవేళ ఈ సమస్య కొన్ని వారాల పాటు నిరంతరాయంగా కొనసాగితే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. లేదంటే ఇది విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు వారి కెరీర్, వ్యక్తిగత జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
బ్రెయిన్ బఫరింగ్ బారిన పడిన విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టకపోగా, క్లాస్‌రూమ్‌లో భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. వారి శారీరక ప్రవర్తనను గమనిస్తే.. టీచర్ వైపు చూస్తున్నట్లే ఉన్నా మనసంతా ఎక్కడో పెట్టి శూన్యంలోకి చూడటం, కొన్నిసార్లు కళ్ళు ఆర్పకుండా బోర్డు వైపు లేదా గోడల వైపు అలాగే ఉండిపోవడం వంటివి చేస్తుంటారు. తరచూ ఆవలిస్తూ నిద్రమత్తులో మునిగిపోతూ, క్లాస్‌లోనే నిద్రపోవడానికి ప్రయత్నిస్తుంటారు. విషయాలు సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల తల భారంగా అనిపించి చేతులతో తలను లేదా నుదిటిని నొక్కుకుంటూ ఉంటారు. హఠాత్తుగా టీచర్ ఏదైనా క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలో అర్థం కాక బిత్తరచూపులు చూస్తారు. అలాగే చేతి వేళ్లలో పెన్నును తిప్పడం, పుస్తకాలను మలవడం, పేజీలను ఊరికే తిరగేయడం, బెంచీలపై గీతలు గీయడం వంటి అనాలోచిత చేష్టలకు పాల్పడుతుంటారు. క్లాసులో ఏదైనా నోట్ చేసుకోమన్నా లేదా బుక్ ఓపెన్ చేసి చూడమన్నా చాలా నిదానంగా, నిరుత్సాహంగా చేస్తుంటారు. ఒకవేళ టీచర్‌కు పట్టుబడితే చిరాకు, అసహనం ప్రదర్శిస్తారు. లెర్నింగ్ యాక్టివిటీలో మిగతా పిల్లలతో పాలుపంచుకోవడం పట్ల విముఖత చూపుతారు. పలకరించినప్పటికీ పక్కన ఉన్నవారితో మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు. టాపిక్ పూర్తి చేసి టీచర్ పునఃశ్చరణ ప్రారంభించే కొద్ది నిమిషాలకే విషయాన్ని పూర్తిగా మర్చిపోతుంటారు. కాలేజీ పిల్లలైతే లెక్చరర్ బోర్డు వైపు మళ్లినప్పుడు వెనుక ద్వారం గుండా బయటకు వెళ్తారు. కారిడార్‌లో మరొక టీచర్ ఎదురై బయటికి ఎందుకు వచ్చావు అని అడిగితే నేచర్ కాల్ అంటూ సాకులు చెబుతారు.

బ్రెయిన్ బఫరింగ్ సమస్యను ఎదుర్కొంటున్న విద్యార్థులను గుర్తించి, అవసరమైన సహాయ సహకారాలను ఇటు తల్లిదండ్రులు, అటు ఉపాధ్యాయులు ఎంతగానో అందించాల్సి ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించాల్సిన సహాయం విషయానికి వస్తే.. ఒకేసారి ఎక్కువ హోంవర్క్ చేయించకుండా, ఒక సబ్జెక్ట్ పూర్తయిన తర్వాతే మరొకటి చేయించాలి. మెదడు చురుగ్గా పనిచేయడానికి రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోయేలా చూడాలి. మొబైల్, టీవీ చూసే సమయాన్ని తగ్గించాలి. ముఖ్యంగా పిల్లల మనోభావాలను అర్థం చేసుకుంటూ వారికి అండగా నిలవాలి. ‘నాకు మెదడు పనిచేయడం లేదు’ అని పిల్లలు అన్నప్పుడు, వారిపై కోప్పడకుండా కాసేపు ఆడుకోవడానికి లేదా వారికి నచ్చిన పనులు చేసుకోవడానికి ఒప్పుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గితే మెదడు మళ్లీ వేగంగా పనిచేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల మానసిక అలసటను గమనించి, దానికి పరిష్కారం చూపుతూ వారికి మంచి జీవనశైలిని అలవాటు చేయాలి.
ఇక ఉపాధ్యాయుల విషయానికి వస్తే.. నిరంతరంగా 45 నిమిషాల పాటు పాఠాలు చెప్పకుండా, ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చిన్న ‘బ్రెయిన్ బ్రేక్’ (నిలబడటం, స్ట్రెచింగ్ చేయడం లేదా ఒక చిన్న జోక్ చెప్పడం వంటివి) ఇవ్వాలి. కేవలం పుస్తకాల్లోని సమాచారాన్నే కాకుండా, మైండ్ మ్యాప్స్, డయాగ్రామ్స్ లేదా బొమ్మల ద్వారా వివరించడం వల్ల మెదడు త్వరగా ఆ సమాచారాన్ని ఎలాంటి బఫరింగ్ లేకుండా ప్రాసెస్ చేస్తుంది. అలాగే తరగతి గదిలో అడిగిన ప్రశ్నకు విద్యార్థి జవాబు చెప్పడానికి సమయం తీసుకుంటుంటే (బఫర్ అవుతుంటే), తొందర పెట్టకుండా రిలాక్సింగ్‌గా మాట్లాడుతూ వారికి ఆలోచించుకునే సమయం ఇవ్వాలి. పిల్లల్లో మానసిక సామర్థ్యాలను పెంపొందించడానికి నిపుణులు రాసిన పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. పెగ్ డాసన్ & రిచర్డ్ గువార్ రాసిన ‘Smart but Scattered’ పుస్తకం పిల్లల్లో ఏకాగ్రతను పెంచి, పనులను ప్లాన్ చేసుకోవడానికి, మతిమరుపును పోగొట్టడానికి ప్రాక్టికల్ చిట్కాలను అందిస్తుంది. నేటి డిజిటల్ యుగంలో పిల్లలు ఒత్తిడిని జయించి, స్వతంత్రంగా ఎలా చదువుకోవాలో మైఖేల్ డెల్మన్ తన ‘Your Kid’s Gonna Be Okay’ పుస్తకంలో వివరించారు. అలాగే, షారన్ గ్రాండ్ రాసిన ‘Executive Functioning Workbook for Kids’ అనే పుస్తకం పిల్లల సెల్ఫ్-కంట్రోల్‌ను పెంచడానికి 40 కంటే ఎక్కువ సరదా ఆటలను పరిచయం చేయగా, ప్రముఖ న్యూరోసైంటిస్ట్ డా. సబీనా బ్రెన్నన్ రాసిన ‘Beating Brain Fog’ పుస్తకం కేవలం 30 రోజుల్లో మెదడు అలసటను తగ్గించి, దానిని షార్ప్‌గా మార్చే శాస్త్రీయ చిట్కాలను అందిస్తుంది. చివరగా, ట్రేసీ పాకియామ్ అలోవే రాసిన ‘Improving Working Memory’ అనే పుస్తకం క్లాస్‌రూమ్‌లో విద్యార్థుల జ్ఞాపకశక్తిని, ఆలోచనా వేగాన్ని పెంచడానికి ఉపాధ్యాయులకు రీసెర్చ్ ఆధారిత వ్యూహాలను సమకూరుస్తుంది.

ప్రొ|| బెల్లి యాదయ్య
9848392690

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -