రామజన్మభూమి నిధుల దుర్వినియోగం సంఘ్‌పరివార్ హేయమైన చర్య
‘దిమాగీ నక్సల్స్’ ప్రమాదకర రాజకీయ ఆయుధం
జీడీపీపై అంకెలా గారడీ
హిందుత్వ ఎజెండా కోసం జన, కులగణన దుర్వినియోగం
చాతుర్వర్ణ పోస్టర్లు సిగ్గుచేటు
అంతర్జాతీయ పరిణామాలు ఆందోళనకరం
న్యూఢిల్లీ : కార్పొరేట్ల దురాశ వల్లే పర్యావరణ విధ్వంసం జరుగుతున్నదని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో ఆందోళన వ్యక్తం చేసింది. వాతావరణ మార్పుల కారణంగా ఇటీవల సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతున్నదని తెలిపింది. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సమావేశాలు ఢిల్లీలోని ఏకే గోపాలన్ భవన్‌లో రెండ్రోజులపాటు జరిగాయి. వీటిలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. నేపాల్, చైనా దేశాలను ప్రభావితం చేసిన పెను విపత్తు హిమానీనదాలు కరిగిపోవడాన్ని, సరిగా పనిచేయని ముందస్తు హెచ్చరికల వ్యవస్థల పరిణామాలను ఎత్తిచూపుతున్నదని పొలిట్‌బ్యూరో అభిప్రాయపడింది. ఎల్‌నినో ప్రభావం కూడా తీవ్రంగా పనిచేస్తోందనీ, అస్సాం వంటి రాష్ట్రాల్లో వినాశకరమైన అకాల వరదలను చూశామని తెలిపారు. అదే సమయంలో అనేక ఇతర రాష్ట్రాల్లో వర్షపాత లోటు, కరువు పరిస్థితులు కన్పిస్తున్నాయనీ, వీటన్నింటికీ కార్పొరేట్ దురాశే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.
రామజన్మభూమి ట్రస్ట్ అవినీతిపై…
అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాలను సంఘ్ పరివార్ నాయకులు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో ఓ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సంఘ్ పరివార్ నేతృత్వంలో జరిగిన రామమందిర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన అనేక మంది వ్యక్తులు ఇప్పుడు ఆలయ విరాళాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇది లక్షలాది మంది భక్తుల విశ్వాసాలను ఉద్దేశపూర్వకంగా అపవిత్రం చేయడమే అవుతుంది. రాజకీయ అండతో దోషులను కావాలని కాపాడడం, పవిత్రమైన కానుకలను దోపిడీ సొత్తుగా భావించి భక్తుల విశ్వాసాలతోనిర్భయంగా ఆటలాడుతున్నారని పొలిట్‌బ్యూరో ఆక్షేపించింది. ఈ చర్యలు సంఘ్ పరివార్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నాయనీ, వీటిపై సమగ్ర విచారణ జరిపి, ఈ హేయమైన నేరంలో పాలుపంచుకున్న దోషులందరినీ శిక్షించడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొంది.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై….
గత నెల 10వ తేదీన కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన నిరసన ప్రదర్శనల్లో భారీ సంఖ్యలో భాగస్వాములైన వారందరికీ అభినందనలు. అలాగే పరీక్షా పత్రాల లీకేజీలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాలుపంచుకున్న విద్యార్థులు, యువతకు కూడా అభినందనలు. జంతర్‌మంతర్ నిరసనల స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు ఆందోళనలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేతను నిరసిస్తూ గళం విప్పారు. కేంద్ర ప్రభుత్వ అణచివేత చర్యల పట్ల ప్రజలు…ముఖ్యంగా యువత విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఈ విషయాన్ని నిరసనలు, ప్రదర్శనలు రుజువు చేస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల వంటి మతపరమైన సమస్యలను, పోరాటాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజల దృష్టిని ఈ ఆందోళనల నుంచి మళ్లించి వారిలో ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
ప్రజలు ఐక్యం కావాలి
ఢిల్లీలో సీపీఐ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో పాల్గొనకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, ఇతర రాష్ట్రాల వైఖరిని ఖండిస్తున్నాం. ఈ ఘటనలన్నీ ప్రజాస్వామ్య సంస్థలు, రాజ్యాంగ నిర్మాణంపై పెరుగుతున్న దాడులకు అద్దం పడుతున్నాయి. ఈ దాడులను వ్యతిరేకించడానికి, మనం కష్టపడి సాధించుకున్న హక్కులను కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది.
జీడీపీపై అంకెల గారడీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్ 7.8 శాతం జీడీపీ వృద్ధి గణాంకం వెల్లడించిన దాని కంటే ఎక్కువగానే దాచిపెడుతోంది. ఇది ప్రధానంగా శ్రామిక వర్గం యొక్క వాస్తవ పరిస్థితులను మరుగుపరుస్తూ అసమానతలను మరింత పెంచే వ్యవస్థను చట్టబద్ధం చేయడానికి ఓ రాజకీయ సాధనంగా పనిచేస్తోంది. ఈ గణాంకాలు తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభం యొక్క వాస్తవికతలను ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నాయి. వ్యవసాయ రంగం కేవలం 3.6 శాతం వృద్ధితో కుంటుపడడం, గనుల రంగం క్షీణించడం వంటి వాస్తవాలను ఇది పట్టించుకోలేదు. కార్మికులు, రైతులపై పెరిగిన పెట్టుబడి వ్యయాన్ని దాచిపెడుతోంది. ధరల పెరుగుదల, పోషకాహార లోపం, నిరుద్యోగం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న సామాన్య ప్రజల కష్టాలను జీడీపీ గణాంకాలు ప్రతిబింబించడం లేదు.
కార్పొరేట్లకు ప్రయోజనాలు
బీజేపీ ప్రభుత్వం సముద్ర మంథన్ ప్రోత్సాహక పథకం, సెమీకండక్టర్ మిషన్ (ఐఎస్‌ఎం)2, మొబైల్ ఫోన్ల తయారీ పథకం ద్వారా ప్రజల సొమ్మును దేశీయ, విదేశీ ప్రయివేటు కార్పొరేట్లకు బదిలీ చేయడానికి సంస్కరణలను ప్రోత్సహిస్తుంది. కేంద్ర ప్రోత్సాహక కార్యక్రమాలకు అనుగుణంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలనే ప్రకటించి, కార్పొరేషన్లకు భారీ మొత్తాలను బదిలీ చేస్తున్నాయి. సుభాష్ చంద్ర కేసు విషయంలో ఎన్‌సీఎల్‌టీ ఇచ్చిన ఉత్తర్వు ఈ వనరుల బదిలీని పూర్తిగా మరో స్థాయికి తీసికెళ్లింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ కోడ్ – 2016 వ్యాపార సౌలభ్యం పేరుతో కార్పొరేట్ సంస్థల ద్వారా ప్రజాధనాన్ని చట్టబద్ధంగా దోచుకోవడానికి వీలు కల్పిస్తోంది. ఐబీసీ – 2016ను తక్షణమే రద్దు చేసి దాని స్థానంలో డిఫాల్టర్లను శిక్షించడానికి, ప్రజాధనం దోపిడీని అరికట్టడానికి పటిష్టమైన చట్టాన్ని తీసుకొని రావాల్సి ఉంది.
జన,కుల గణన దుర్వినియోగం
బీజేపీ తన హిందూత్వ మతతత్వ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి 2027 జనాభా లెక్కలను వాడుకుంటోంది. 16 ఏండ్ల విరామం తర్వాత పౌరసత్వం, ఎన్నికల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యానికి సంబంధించిన అనేక ఇతర ప్రక్రియలు జరుగుతున్న తరుణంలో నిర్వహిస్తున్న ఈ జనగణనకు ప్రాముఖ్యత ఉంది. అయితే సమాచార సేకరణ కోసం ఉపయోగించిన పద్ధతి శాస్త్రీయమైనది కాదు. సమాచారాన్ని ఇతర డేటాబేస్‌లతో అనుసంధానించే అవకాశం తీవ్రమైన సమస్య. వ్యక్తిగత సమాచార సేకరణ, ఓటర్ల జాబితా ధృవీకరణ, పౌరసత్వంపై చర్చలు ఏకకాలంలో జరుగుతున్నాయి. చివరికి ఈ సమాచారాన్ని ఎలా ఉపయోగిస్తారు, ఎలా అనుసంధానిస్తారు అనే దానిపై ఆందోళనలు రేకెత్తుతున్నాయి. జనగణన ద్వారా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవచ్చు. కాబట్టి ఈ లెక్కల సమయం కూడా చాలా ముఖ్యమైనది. భవిష్యత్తులో రాష్ట్రాల మధ్య రాజకీయ ప్రాతినిధ్య పంపిణీపై ప్రభావం చూపవచ్చు. కులగణన కోసం అనుసరించిన పద్ధతి కూడా లోపభూయిష్టంగా ఉంది. ఎస్సీ, ఎస్టీలు మాత్రమే అందుబాటులో ఉన్న జాబితా నుంచి తమ కులాన్ని లేదా తెగను ఎంచుకోగలరు. ఇతరుల విషయంలో దాన్ని ‘ప్రకటించినదిగా’ నమోదు చేస్తారు. సాధారణ కుల సమస్యను నమోదు చేయడానికి సమగ్రమైన, ముందుగా నిర్వచించిన జాబితా లేదా వ్యవస్థీకృత యంత్రాంగం లేకపోవడం వల్ల కులాలు, ఉపకులాల వివరాలు అనేకం నమోదు కావచ్చు. కచ్చితమైన గణాంకాలు లభించవు.
దిద్దుబాటు ప్రచారంపై…
పార్టీ 24వ కాంగ్రెస్ ఆదేశాల మేరకు చేపడుతున్న దిద్దుబాటు ప్రక్రియపై రూపొందించిన నివేదికపై చర్చించడం జరిగింది. పార్లమెంటరీ విధానం వంటి బాహ్య వర్గ ప్రభావాలతో పాటు విధానాల అమలులో ఎదురైన అనుభవాలు, పార్టీలోని అన్ని స్థాయిల్లో సామూహిక పనితీరును బలోపేతం చేసే చర్యలపై కూడా చర్చించడం జరిగింది. అక్టోబర్ 9, 11 తేదీల్లో న్యూఢిల్లీలో సమావేశమయ్యే పార్టీ కేంద్ర కమిటీ ఈ నివేదికపై చర్చిస్తుంది.
దిమాగీ నక్సల్స్ ప్రమాదకర రాజకీయ ఆయుధం
స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ‘దిమాగీ నక్సల్స్’ (మేధావి నక్సల్స్) వ్యాఖ్య చట్టబద్ధమైన రాజకీయ అసమ్మతిని అప్రదిష్టపాలు చేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం. ఈ పదం సాయుధ మావోయిస్టులకు, శాంతియుత ప్రజాస్వామ్య ప్రతిపక్షానికి మధ్య ఉన్న గీతను చెరిపేసే ఓ ప్రమాదకరమైన రాజకీయ ఆయుధం. ఈ వాక్చాతుర్యం భద్రతకు సంబంధించింది కాదు. రాజకీయ బహిష్కరణకు సంబంధించింది. విమర్శకులను అప్రదిష్టపాలు చేయడానికి, అసమ్మతిని అణచివేయడానికి, విద్య, ఉపాధి, ప్రజా సంక్షేమం వంటి విషయాల్లో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి సైద్ధాంతిక శత్రువును సృష్టించేందుకు ఉద్దేశపూర్వకంగా చేసిన ప్రయత్నం.
చాతుర్వర్ణ పోస్టర్లు సిగ్గుచేటు
2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితులు, ఆదివాసీలు, ఇతర వెనుకబడిన తరగతుల వారిపై దాడులు పెరిగాయి. ఐఐటీ మండి వంటి ప్రముఖ సంస్థ అధికారులు చాతుర్వర్ణ వ్యవస్థను ప్రశంసిస్తూ పోస్టర్‌ను విడుదల చేయడం సిగ్గుచేటు. శూద్రుల కర్తవ్యం అగ్రవర్ణాలకు సేవచేయడమేనని ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఇటువంటి చర్యను ముక్తకంఠంతో ఖండించాలి. పోస్టర్‌ను విడుదల చేసిన బాధ్యులపై చర్య తీసుకోవాలి. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో రాజ్యసభ ప్రతిపక్ష నేత పట్ల వ్యవహరించిన తీరును కూడా ఖండించాలి. దోషులను శిక్షించాలి.
ఘర్షణలు – ఉద్రిక్తతలు ఆందోళనకరం
జులై నుంచి అంతర్జాతీయ పరిణామాలు తీవ్రమవుతున్న భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, ఆర్థిక అనిశ్చితితో కూడి ఉన్నాయి. పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న సంఘర్షణల కారణంగా ఇంధన, ఆర్థిక మార్కెట్లలో తలెత్తిన గందరగోళం, అలాగే ప్రధాన ఆర్థిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న అధిక ద్రవ్యోల్బణం, రుణ సంక్షోభాలు వంటి కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా…ముఖ్యంగా
పశ్చిమాసియాలో తీవ్రమవుతున్న ఘర్షణలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ దాడులు మరోసారి మధ్యప్రాచ్యాన్ని, ప్రపంచాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సుకు ఆతిథ్యమిస్తున్న భారత ప్రభుత్వం అమెరికా దురాక్రమణను ఖండించి, తీవ్రవాద దాడులకు గురవుతున్న పాలస్తీనా, ఇరాన్, క్యూబా దేశాలకు సంఘీభావం ప్రకటించాలి.


