సర్కిల్, జోన్లలో ఇష్టారీతిన అనుమతులు, ఓసీలు
ఫిర్యాదులకు
సమాధానాలు కరువు
అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులను పట్టించుకోరు
అసహనంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న బాధితులు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఉన్నతాధికారుల పట్టింపులేమీ.. కొందరు అధికారుల అలసత్వంతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ‘టౌన్ ప్లానింగ్’ విభాగంపై ప్రజల్లో రోజురోజుకూ అసంతృప్తి పెరుగుతోంది. అక్రమ నిర్మాణాలు, వివాదస్పద భూములు, డబుల్ రిజిస్ట్రేషన్లు అయిన వాటికి సైతం అనుమతులను సులభంగా ఇచ్చేస్తున్నారు. అనుమతుల జారీలో అవకతవకలు.. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తదితర అంశాలపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఎంఎంసీ’ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో సగానికిపైగా ఫిర్యాదులు టౌన్ ప్లానింగ్‌కు సంబంధించిన ఫిర్యాదులే ఉంటున్నాయి. వీటికి నెలలు గడుస్తున్నా సమాధానాలు ఇవ్వడం లేదు. ఇక చర్యల సంగతి పక్కనబెడితే.. ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదునే మళ్లీ మళ్లీ ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుంది తప్పితే పరిష్కారాలు మాత్రం రావడం లేదు. తమ ఫిర్యాదులకు స్పందన లేకపోవడంతో కలత చెంది కొందరు ఆత్మహత్యాయ త్నాలకు సైతం వెనకాడటం లేదు. ఇటీవల హయత్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఓ బాధితుడు తన స్థలాన్ని ఆక్రమించి నిర్మాణం చేపడుతున్నాడని ఫిర్యాదు చేయగా, అధికారి ఫీల్డ్కి వెళ్లాడు. అయితే, సదరు ఆఫీసర్ ఆ ఆక్రమణదారుడికి మద్దతు తెలిపేలా వ్యవహరించాడని ఆరోపిస్తూ బాధితుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇదే తరహాలో గతంలో మరో ప్రాంతంలో ఓ వ్యక్తి తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ఫీల్డ్‌కు వెళ్లకుండానే పర్మిషన్లు
నిర్మాణ అనుమతులతోపాటు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు (ఓసీ) జారీ చేసే విషయంలో ‘టౌన్ ప్లానింగ్’ అధికారులు నిబంధనలు పాటించడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సర్కిల్, జోనల్ స్థాయి అధికారులు ఫీల్డ్‌కు వెళ్లి పరిశీలించకుండానే ఫైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా.. ఫిర్యాదులు వచ్చినా.. చర్యలు తీసుకోవడం లేదని ఫిర్యాదుదారులు ఆరోపిస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యాక వాస్తు, ఇతర వాటి కోసం ప్లానింగ్‌లో 10 శాతం వెరియేషన్ వరకు ఓసీలు రిలీజ్ చేసే వెసులుబాటు ఉన్నా.. 20 శాతం వెరియేషన్ కన్నా ఎక్కువ ఉన్నా కొన్ని సర్కిల్స్‌లో ఓసీలు ఇచ్చేస్తున్నారు. ఇక కొందరు అధికారులైతే ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్లను ఏదో ఒక కారణంతో షార్ట్ ఫాల్ చేస్తున్నారు. తిరిగి దరఖాస్తుదారులు అధికారులను కలిసి సెటిల్మెంట్ చేసుకున్నాకే అప్రూవల్ ఇస్తున్నారు.
‘టౌన్ ప్లానింగ్’ పనితీరుపై విమర్శలు
‘ఎంఎంసీ’ టౌన్ ప్లానింగ్ విభాగం పనితీరుపై విమర్శలు వస్తున్నాయి. ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం చేయడం, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం, బాధ్యులపై చర్యల లోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై ప్రతి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నా స్పందన లేకపోవడంతో అధికారులను పలువురు నిలదీస్తున్నారు. రోడ్లపై నిర్మాణాలు జరుపుతున్నారని ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు. గతంలో ఓ అక్రమ నిర్మాణం విషయమై కీసరకు చెందిన బాధితుడు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పరిష్కారం కావడం లేదని నేరుగా కమిషనర్‌తోనే వాగ్వివాదానికి దిగాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కమిషనర్ ‘టౌన్ ప్లానింగ్’ విభాగంపై దృష్టి సారించి సామాన్యులకు ఇబ్బందుల్లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
‘టౌన్‌ప్లానింగ్’ మారేదెప్పుడు..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



