Tuesday, September 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఇంటింటికీ జ్వరమే!

ఇంటింటికీ జ్వరమే!

- Advertisement -

విజృంభిస్తున్న విషజ్వరాలు.. గొంతునొప్పి, ఒళ్లునొప్పులతో విలవిలా
వారం వ్యవధిలోనే కరీంనగర్‌ జీజీహెచ్‌లో 7వేల మందికిపైగా ఓపీ
సిరిసిల్లలో డెంగ్యూతో ఒకరు, జగిత్యాల జిల్లాలో విషజ్వరాలతో ఇద్దరు చిన్నారులు మృతి

పడకేసిన 
పారిశుధ్యం
నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
​ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను విషజ్వరాలు కమ్మేశాయి. అకస్మాత్తుగా మారిన వాతావరణం, పారిశుధ్య లోపం, దోమల దండయాత్ర కలిసి జనాన్ని మంచాన పడేస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఒకరిద్దరు తీవ్ర జ్వరం, పొడి దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులతో అల్లాడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు బాధితులతో కిక్కిరిసిపోతుండగా, ప్రయివేటు దవాఖానలు సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నాయి. ఇటీవల జగిత్యాల జిల్లాలో ఇద్దరు చిన్నారులు, సిరిసిల్ల జిల్లాలో బాలిక డెంగ్యూ, విషజ్వరాల బారినపడి ప్రాణం కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

​రికార్డు స్థాయిలో కరీంనగర్‌ జీజీహెచ్‌ ఓపీ..
కరీంనగర్‌ ప్రభుత్వ ప్రధానాస్పత్రికి జ్వరపీడితులు పోటెత్తుతున్నారు. ఆగస్టు 6 నుంచి ఈనెల7 వరకు ఏకంగా 10,487 మంది ఓపీ కోసం రాగా, ఒక్క ఈ వారంలోనే 7వేల మంది వరకు వచ్చారు. గత నెలలో రోజువారీ ఓపీ సగటున 800-1000 ఉండగా, ప్రస్తుతం రోజుకు 1,200 నుంచి 1,400 వరకు పెరిగింది. ఉమ్మడి జిల్లా ప్రభుత్వాస్పత్రుల్లో పక్షం రోజుల్లోనే 37,384 మంది వైరల్‌ జ్వరాలతో ఓపీ నమోదవ్వగా, ఒక్క కరీంనగర్‌జిల్లాలో 28 వేలకుపైగా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికీ రోజుకు సుమారు 700 మంది, వేములవాడ ఏరియాస్పత్రికి రోజుకు 400-500 మంది (ఇందులో 100 మంది జ్వర పీడితులే) ఓపీ కోసం వస్తున్నారు.

​ ప్రాణం కోల్పోయిన చిన్నారులు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జ్వరాలధాటికి ముగ్గురు చిన్నారుల ప్రాణం కోల్పోయారు. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లికి చెందిన సహస్ర(8) ఆగస్టు 25న డెంగ్యూతో హైదరాబాద్‌ ఆస్పత్రిలో మృతిచెందింది. జగిత్యాల జిల్లా పోరండ్లకు చెందిన కాముని వరుణ్‌తేజ్‌ (6) తీవ్రజ్వరంతో బాధపడుతూ కరీంనగర్‌లో గత నెల మృతిచెందాడు. అదే గ్రామానికి చెందిన దన్నుల హరిస్మిత (6) కూడా తీవ్ర జ్వరంతో మర్నాడు ప్రాణం కోల్పోయింది.

​ప్రయివేటులో బాదుడు
డెంగ్యూ, టైఫాయిడ్‌ లక్షణాలపై సరైన అవగాహన లేక గ్రామీణ ప్రజలు మొదట ఆర్‌ఎంపీ, పీఎంపీలను ఆశ్రయిస్తున్నారు. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గకపోవడంతో చివరకు జిల్లా ఆస్పత్రులకు లేదా ప్రయివేటు దవాఖానలకు పరుగెడుతున్నారు. రోగుల భయాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రయివేటు ఆస్పత్రులు 2-3 రోజుల చికిత్సకు రూ. రూ.20వేల నుంచి రూ.30వేల వరకు, వారం చికిత్సకు ఏకంగా రూ.లక్ష వరకు గుంజుతూ బాధితులను ఆర్థికంగా ముంచేస్తున్నాయి.

పడకేసిన పారిశుధ్యం..
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో రెండు కార్పొరేషన్లు కరీంనగర్‌, రామగుండం, 13 మున్సిపాలిటీలు సహా పల్లెల్లోనూ పారిశుధ్య నిర్వహణ పూర్తిగా పడకేసింది. వర్షాలు సమృద్ధిగా కురవకపోయినా, డ్రెయిన్ల పూడిక తీయకపోవడంతో మురుగు నీరు నిలిచి దోమల సంతానోత్పత్తి కేంద్రాలుగా మారాయి. ఏ మున్సిపాలిటీలో చూసినా ఫాగింగ్‌ యంత్రాలు పాడయ్యాయని, నిధులు లేవని క్షేత్రస్థాయి సిబ్బంది చెబుతోంది. పాత టైర్లు, నీటి ట్యాంకుల్లో లార్వా నివారణకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. మురికికూపాల్లో గంబూషియా చేపలను వదిలి దోమలను అరికట్టే ప్రక్రియను కూడా మున్సిపల్‌ సిబ్బంది ఇంకా ప్రారంభించలేదు.

​కాలాగుణ ఇన్‌ఫెక్లన్ల వల్లే..
ప్రస్తుతం కాలానుగుణ ఇన్ఫెక్షన్ల వల్లే జ్వరాలు వస్తున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు 16 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. రెండు దశల్లో ఇంటింటి జ్వర సర్వే పూర్తి చేయగా 10వేల మంది జ్వరపీడితులు ఉన్నట్టు గుర్తించాం. ప్రాథమిక కేంద్రాల నుంచి జిల్లా ఆస్పత్రి వరకు సరిపడా మందులు, ఫ్లూ కిట్లు అందుబాటులో ఉన్నాయి.
డాక్టర్‌ బి.రాజగోపాల్‌ రావు, 
డీఎంహెచ్‌ఓ, కరీంనగర్‌

​జిల్లా ఆస్పత్రిలోనూ డెంగ్యూ నిర్ధారణ
ఆస్పత్రిలో రోజుకు వందలాది మందికి డెంగ్యూ పరీక్షలు చేస్తున్నాం. రోగులకు ఇబ్బంది లేకుండా చికిత్స అందిస్తున్నాం. ఏ జ్వరం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.
 డాక్టర్‌ వీరారెడ్డి, 
సూపరింటెండెంట్‌, కరీంనగర్‌ జీజీహెచ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -