దేశ యువత జీవితాల్లో చీకట్లు
నెలవారీ గణాంకాలతో ఉద్యోగ సంక్షోభాన్ని దాచేస్తున్న కేంద్రం
నిరుద్యోగం తగ్గిపోయిందంటూ ప్రచారం..
అసలు ఉపాధి నాణ్యతపై లెక్కలు కరువు
కాలానుగుణ పనులనే శాశ్వత
ఉద్యోగాలుగా చూపిస్తున్న మోడీ సర్కారు
దేశంలో నిరుద్యోగం తగ్గుతోందంటూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తాజా గణాంకాలను ప్రచారం చేసుకుంటున్నది.. ఆ సంఖ్యల వెనుక భారత కార్మిక మార్కెట్ అసలు వాస్తవం దాగిపోయే ప్రమాదం కనిపిస్తోంది. వారంలో ఏడు రోజుల ఉపాధి పరిస్థితిని ఆధారంగా తీసుకుని నిరుద్యోగాన్ని కొలిచే విధానం.. ఉద్యోగం దొరికిందా లేదా అన్నదే చెప్తుంది తప్ప… ఆ పని ఎంతకాలం ఉంటుంది? ఎంత వేతనం వస్తుంది? క్రమం తప్పకుండా జీతం అందుతుందా? ఆ ఉద్యోగం జీవన భద్రత కల్పిస్తుందా? వంటి కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు. అసంఘటిత రంగమే ఆధారంగా కోట్లాది మంది బతుకుతున్న భారత్‌లో కేవలం నిరుద్యోగ శాతాన్ని తగ్గిందని చూపించడం.. దేశంలోని ఉపాధి సంక్షోభాన్ని సంఖ్యలతో కప్పిపుచ్చడమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ : దేశంలో నిరుద్యోగ సమస్యను కొలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఒక కొల మానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ గణాంకాలు కూడా భారత ఉద్యోగ మార్కెట్‌లోని ఒక కోణాన్ని మాత్రమే చూపిస్తున్నా యనే ఆందోళన వ్యక్తమ వుతోంది. నెలవారీ నిరుద్యోగ గణాం కాలను విడుదల చేయడం మంచి పరిణా మమే అయినప్పటికీ.. వాటితో దేశంలోని కోట్లాది మంది కార్మికుల అసలు జీవన పరిస్థితిని అర్థం చేసుకోవడం సాధ్యం కాదని నిపుణు లు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్‌ఎస్) ద్వారా నిరుద్యోగ పరిస్థితిని మరింత తరచుగా కొలిచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో కరెంట్ వీక్లీ స్టేటస్ (సీడబ్ల్యూఎస్) విధానాన్ని అనుసరిస్తున్నారు. అంటే.. సర్వేకు ముందు ఉన్న ఏడు రోజులలో ఒక వ్యక్తి ఏ పని చేశాడనే అంశాన్ని బట్టి ఆయన ఉపాధి స్థితిని నిర్ణయిస్తారు. కానీ అసలు సమస్య ఇక్కడే ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఒక వ్యక్తికి ఏదో ఒక పని దొరికిందా లేదా అన్నది మాత్రమే కాకుండా.. ఆయన చేస్తున్న పని స్వభావం ఏమిటి? ఎంత వేతనం వస్తోంది? ఆ వేతనం క్రమం తప్పకుండా అందుతోందా? పని ఎన్ని రోజులు ఉంటుంది? కుటుంబాన్ని పోషిం చేం దుకు ఆ ఆదాయం సరిపో తుందా? అనే ప్రశ్నలకు కూడా సమా ధానం దొరకాలి. ఉద్యోగం ఉందనే ఒక్క మాటతో ఉపాధి సమస్య పరిష్కా రమైందని చెప్పలే మన్నదే అసలు వాస్తవ మంటూ నిపుణులు చెప్తున్నారు.
అసంఘటిత రంగాన్ని ఎలా కొలుస్తారు?
భారత్‌లో కార్మిక మార్కెట్‌లో అత్యధిక భాగం అసంఘటిత రంగంపైనే ఆధారపడి ఉంది. వివిధ అధ్యయనాల ప్రకారం దేశంలోని దాదాపు 90 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తు న్నారు. ఈ రంగంలో పని దొరికిన రోజు ఆదాయం ఉంటుంది. మరుసటి రోజు పని ఉంటుందో లేదో తెలియదు. వేతనం ఎంత వస్తుందో, ఎప్పుడు అందుతుందో కూడా స్పష్టత ఉండదు. అలాంటి పరిస్థితుల్లో ఒక వారంలో ఏదైనా పని చేశాడని ఆ వ్యక్తిని ఉపాధి పొందిన వ్యక్తిగా లెక్కించడం.. నిజమైన ఆర్థిక పరిస్థితిని ప్రతిబిం బించదు. అందుకే భారత్ వంటి దేశంలో నిరుద్యోగ శాతాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని కార్మిక మార్కెట్ ఆరోగ్యకరంగా ఉందని చెప్పడం ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగాల సంఖ్యతోపాటు వాటి నాణ్యత కూడా అంతే ముఖ్యమని అంటున్నారు.
జులైలో నిరుద్యోగం తగ్గిందట!
తాజా పీఎల్‌ఎఫ్‌ఎస్ గణాంకాల ప్రకారం.. 15 ఏండ్లు పైబడిన వారిలో నిరుద్యోగం జులైలో నాలుగు నెలల కనిష్టానికి చేరి 5.1 శాతంగా నమోదైంది. కేంద్ర ప్రభుత్వం దీనిని ఉద్యోగ రంగంలో మెరుగుదలకు సంకేతంగా చూపించే అవకాశం ఉంది. కానీ జులై నెల ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ఉధృతంగా ఉండే కాలం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో తాత్కాలిక ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. నిర్మాణ రంగం, వ్యవసాయం, చిన్న వ్యాపారాలు, రవాణా, స్థానిక సేవలు వంటి రంగాల్లో కూడా సీజన్‌ను బట్టి ఉపాధి అవకాశాలు మారుతూ ఉంటాయి. అందువల్ల జులైలో నిరుద్యోగం తగ్గడం దేశంలో శాశ్వత, నాణ్యమైన ఉద్యోగాలు భారీగా పెరిగాయని చెప్పడానికి ఆధారం కాదని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నెలవారీ నిరుద్యోగ గణాంకాలను కార్మిక మార్కెట్‌కు ఒక ముందస్తు సూచికగా మాత్రమే చూడాలని, దేశంలోని ఉపాధి పరిస్థితికి పూర్తి నిదర్శనంగా భావించకూడదని అంటున్నారు.
తగ్గిన నిరుద్యోగం వెనుక గ్రామీణ వలస కూలీలు
జులైలో మొత్తం నిరుద్యోగం తగ్గడానికి ప్రధాన కారణం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తగ్గడమే. గ్రామీణ నిరుద్యోగం 5 శాతం నుంచి 4.5 శాతానికి తగ్గింది. అయితే దీనిని ఉద్యోగ రంగంలో భారీ పురోగతిగా చూడటం సరైనది కాదని నిపుణులు అంటున్నారు. భారత్‌లో ప్రతి సంవత్సరం సుమారు 3 నుంచి 3.5 కోట్ల మంది సీజనల్ కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళుతున్నారని స్వతంత్ర కార్మిక అధ్యయనాలు అంచనా వేస్తున్నాయి. వీరే నగరాల్లో నిర్మాణ రంగం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఇతర తాత్కాలిక పనులకు వెన్నెముకగా నిలుస్తున్నారు. అయితే ఒక రాష్ట్రంలో పని లేకపోయి మరో రాష్ట్రానికి వలస వెళ్లే కార్మికుడి ఉపాధి పరిస్థితిని సరిగ్గా కొలవడం ఇప్పటికీ పెద్ద సవాలుగానే ఉంది.
ఉపాధి నాణ్యతపై మౌనం
నిరుద్యోగం తగ్గిందా లేదా అనే అంశంతోపాటు వేతనాలు పెరుగుతున్నాయా? కార్మికులు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు? ఉద్యోగ భద్రత ఉందా? ఏ రంగం నుంచి ఏ రంగానికి కార్మికులు మారుతున్నారు? కొత్త ఉద్యోగాలు ఏ రంగాల్లో వస్తున్నాయి? అనే వివరాలు కూడా కీలకం. కానీ ప్రస్తుత నెలవారీ నిరుద్యోగ గణాంకాల్లో ఈ స్థాయి సమగ్ర సమాచారం కనిపించడం లేదని విమర్శలు ఉన్నాయి.
గణాంకాలు పెరిగినా.. సమాచారం పూర్తి కాదు
ఉద్యోగ మార్కెట్‌ను మరింత సమగ్రంగా అర్థం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు డేటా వనరులను బలోపేతం చేసే ప్రయత్నం చేసింది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో), ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) పేరోల్ వివరాలు, జీఎస్టీ ఆధారిత సంస్థల సమాచారం, ఆదాయపు పన్ను రికార్డులు, కార్పొరేట్ పేరోల్ వివరాలు, గిగ్ ఎకానమీ ఉద్యోగాలు, గ్రామీణ వేతనాల సమాచారం వంటి వనరులను ఉపయోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సమాచారం అంతా విడివిడిగా ఉంది. సమగ్ర కార్మిక మార్కెట్ ముఖ చిత్రాన్ని అందించే ఒకే వ్యవస్థ ఇంకా అందుబాటులో లేదు. భారత్‌లో మాత్రం కోట్లాది మంది అసంఘటిత కార్మికుల వివరాలను సేకరించడం ఇప్పటికీ పెద్ద సవాలుగానే ఉంది.
లెక్కలు కాదు.. నిజ జీవితాలు కనిపించాలి
పీఎల్‌ఎఫ్‌ఎస్‌ను మరింత తరచుగా నిర్వహించడం ఒక ముఖ్యమైన పురోగతే. అయితే సర్వేను నెలవారీగా నిర్వహించడం మాత్రమే సమస్యకు పరిష్కారం కాదు. గణాంకాలు ఎంత తరచుగా విడుదల అవుతున్నాయన్నది కాదు.. అవి భారత కార్మిక మార్కెట్‌లోని అసలు పరిస్థితిని ఎంత నిజాయితీగా ప్రతిబిం బిస్తున్నాయన్నదే అసలు ప్రశ్న. ఒక వారం పని దొరికిందని ఉపాధి ఉన్నట్టు చెప్పడం, నిరుద్యోగం తగ్గి ఉద్యోగ సంక్షోభం తగ్గిపోయిందని ప్రచారం చేయడం వల్ల కోట్లాది మంది యువత, వలస కార్మికులు, రోజువారీ కూలీలు ఎదుర్కొంటున్న వాస్తవం మారదని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే భారత్‌కు ఇప్పుడు అవసరమైంది కేవలం తరచుగా విడుదలయ్యే నిరుద్యోగ గణాంకాలు కాదు. ఉద్యోగాల సంఖ్యతోపాటు వాటి నాణ్యత, వేతనాలు, పని భద్రత, పని గంటలు, వలసలు, దాగి ఉన్న నిరుద్యోగాన్ని కూడా పట్టుకునే విశ్వసనీయమైన కార్మిక మార్కెట్ సూచిక అని నిపుణులు సూచిస్తున్నారు.
లెక్కల్లో మాయాజాలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



