తల్లిదండ్రులను ఇంట్లోంచి గెంటేసిన కొడుకులు
జగిత్యాల జిల్లాలో దారుణం
ఆర్డీఓకు ఫిర్యాదు
నవతెలంగాణ – జగిత్యాల టౌన్
వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాచుకుని ఉండాల్సిన కొడుకులు.. మమకారం మరిచి అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో
వెలుగుజూసింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం సర్వాపూర్ గ్రామానికి చెందిన రామంచ సాయబు భూమయ్య (87), మల్లవ్వ (85) సోమవారం తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది హరి అశోక్ కుమార్ సాయంతో జగిత్యాల ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. కొడుకులపై వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆ వృద్ధ తల్లిదండ్రులు సీనియర్ సిటిజెన్స్ కార్యాలయంలో విలేకరుల ఎదుట తమ గోడును తెలిపారు. ఇద్దరు కొడుకులకు ఎకరం భూమి ఇచ్చామని, తాము కట్టుకున్న పాత ఇల్లు కూల్చేసి ఇద్దరు చెరో ఇల్లు కట్టుకున్నారని చెప్పారు. వారి ఇండ్లలో ఉండనివ్వక, పోషించక తమను వెళ్లగొట్టారని కన్నీటి పర్యంతమయ్యారు. అదే గ్రామంలో ఉన్న చర్చిలో దుర్భర పరిస్థితుల్లో ఉంటూ బతుకుతున్నామని తెలిపారు. రెండు గదుల చిన్న ఇల్లు కట్టించి, పోషణ, వైద్య ఖర్చుల కింద ప్రతి నెలా రూ.20వేలు ఇద్దరు కొడుకుల నుంచి ఇప్పించాలని, ఇల్లు కట్టించే వరకు మాకు నివాస వసతి కల్పించాలని ఆర్డీఓను కోరామన్నారు. భోజనం, వసతి సౌకర్యాలు కల్పించి సాయం చేసిన సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సాయంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. వారి వెంట వృద్ధుల సంరక్షణ కాన్సిలియేషన్ అధికారులు పిసి.హన్మంత్ రెడ్డి, వి.ప్రకాష్ రావు, ప్రభుత్వం కమిటీ సభ్యులు కండ్ల గంగాధర్, పబ్బా శివానందం ఉన్నారు.
కనిపెంచినా కనికరం ఏది?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



