Tuesday, September 8, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమోడీ ఓటమే కమ్యూనిస్టుల విజయం

మోడీ ఓటమే కమ్యూనిస్టుల విజయం

- Advertisement -

మళ్లీ అధికారం కోసం ‘సర్‌’పేరుతో బీజేపీ కుట్రలు
రైతుల కోసం జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి
పేదలకు అండదండ ఎర్రజెండా
వారికోసం పోరాడేది కమ్యూనిస్టులే : సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్‌‌రెడ్డి
ప్రజల్ని విభజిస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వంతపాడుతున్న కేంద్ర ఎన్నికల సంఘం
సారంపల్లి జీవితం స్పూర్తివంతం : సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌‌కరత్‌
సారంపల్లి జీవితం ఆదర్శనీయం : సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌‌వెస్లీ
సకలగుణ సంపన్నుడు సారంపల్లి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

నవతెలంగాణ-హైదరాబాద్‌‌బ్యూరో
కేంద్రంలో నరేంద్రమోడీ సర్కారు ఓటమే కమ్యూనిస్టుల విజయం అని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి అన్నారు. దానికోసం వారు శక్తివంచన లేకుండా కష్టపడుతున్నారని చెప్పారు. పేదల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే అని స్పష్టంచేశారు. కమ్యూనిస్టులు ఏనాడూ ఓట్లు, సీట్లను పట్టించుకోలేదనీ, వారి లక్ష్యం పేదల పక్షాన నిలవడమే అని చెప్పారు. సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ర్ట కమిటీ ఆధ్వర్యంలో సోమవారంనాడిక్కడి రవీంద్రభారతిలో రాష్ర్ట కార్యదర్శి జాన్‌‌వెస్లీ అధ్యక్షతన అఖిల భారత కిసాన్‌ ‌సభ జాతీయ ఉపాధ్యక్షులు, సీపీఐ(ఎం) సీనియర్‌ ‌నాయకులు సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ జరిగింది. దానికి సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మరో ముఖ్య అతిధిగా సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌‌కరత్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మల్లారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. సారంపల్లి మల్లారెడ్డి విజ్ఞానాన్ని కొనియాడారు. నడుస్తున్న ఎన్‌‌సైక్లోపిడియా అని కితాబు ఇచ్చారు. రైతాంగం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నాయకుడు అని ప్రసంసించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎన్నికల్లో కలిసినా కలవకపోయినా.. కమ్యూనిస్టుల పోరాటం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడిందని చెప్పారు. అందనం కలసి దేశంలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందిని చెప్పారు. నిన్న మొన్నటి వరకు మత రాజకీయాలను నమ్ముకున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌‌లు ఆ తర్వాత సీబీఐ, ఈడీ వంటి స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థల్ని వాడుకొని అధికారంలోకి వచ్చేలా వ్యూహాలు రూపొందించారని చెప్పారు. ఇప్పుడు ఆ అంశాలను ప్రజలను పట్టించుకోవట్లేదని గమనించి, ప్రజా స్వామ్య యుతంగా ఎన్నికల్లో గెలవలేమని గ్రహించి ‘సర్‌’ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని చెప్పారు. కేవలం మైనార్టీల ఓట్లను మాత్రమే టార్గెట్‌ ‌చేయట్లేదనీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లను తొలగించే చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నారని అన్నారు.


పశ్చిమబెంగాల్ లో చేసినట్టే తెలంగాణలో చేస్తామని బీజేపీ నాయకులు బరితెగించి మాట్లాడుతున్నారని విమర్శించారు. 2014 నుంచి 2023 వరకు వరుస ఎన్నికల్లో బూత్ ల వారీగా ప్రతిపక్షాలకు పోలైన ఓట్లను గమనించి, వాటిని తొలగిస్తున్నారని చెప్పారు. దీనికోసం ప్రయివేటు ఏజెన్సీలను పెట్టి సర్వేలు చేయించి క్రమపద్ధతిలో ఓట్లు తొలగి స్తున్నారన్నారు. రాజ్యాంగబద్దంగా స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్ ను కూడా బీజేపీ రాజకీయాలకు వాడుకుంటున్నదని చెప్పారు. ‘సర్‌’ ప్రారంభానికి ముందు రాష్ర్టవ్యాప్తంగా పలు ఆందోళనలు చేసిన ప్రధాన ప్రతిపక్షం (బీఆర్‌ఎస్‌) ఇప్పుడు ఎందుకు ఒక్క మాటకూడా మాట్లాడట్లేదని ప్రశ్నించారు. దీనివెనుక బీజేపీ, బీఆర్‌ఎస్‌‌కు ఉన్న అవగాహనను కమ్యూనిస్టులు అర్థం చేసుకోవాలని కోరారు. ఓటు పేరుతో ఇప్పుడు పేద ప్రజల ప్రాథమిక హక్కులపైనే దాడి మొదలైందన్నారు. కమ్యూనిస్టులు లేవనెత్తిన ప్రతి సమస్యను అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పరిష్కరించిందని గుర్తుచేశారు. భూమిలేని నిరుపేదలకు కనీస కూలీ ఉండాలని కమ్యూనిస్టులు కొట్లాడితే, కాంగ్రెస్‌‌పార్టీ కనీస వేతన చట్టం తీసుకొచ్చిందనీ, దున్నేవాడికే భూమి నినాదంతో కమ్యూనిస్టులు పోరాడితే 24 లక్షల 56 వేల ఎకరాల అసైన్డ్ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం పంచిందన్నారు. వాటిలో 10 లక్షల ఎకరాలు ఆదివాసీల చేతుల్లో ఉన్నాయని చెప్పారు. గ్రామాల్లో పనులు లేక పేదలు ఇబ్బందులు పడుతుంటే, వారి పక్షాన కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తే, కాంగ్రెస్‌‌పార్టీ ఉపాధి హామీ చట్టం ద్వారా పని కల్పించిందని గుర్తుచేశారు. పేదలు ఆకలితో ఉండొద్దని కమ్యూనిస్టులు గతంలో అంబలి కేంద్రాలు నడిపితే, దాని పరిష్కారం కోసం కాంగ్రెస్‌ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చిందని చెప్పారు. పేదలకు సొంతిళ్లు కావాలని కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తుంటే, తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను తెచ్చిందన్నారు. కమ్యూనిస్టులు పేదల పక్షాన కొట్లాడతారనీ, వారికి స్వీయ అజెండాలు ఉండవని చెప్పారు. ఆ పోరాటాల ద్వారా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు. దేశానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్రమోడీ అనీ, ఆయన ఓటమే కమ్యూనిస్టుల గెలుపు అని తెలిపారు. పేద ప్రజల ఓటు హక్కును కమ్యూనిస్టులు కాపాడాలని కోరారు.

​సకలగుణ సంపన్నుడు సారంపల్లి :సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
సారంపల్లి మల్లారెడ్డి సకలగుణ సంపన్నుడు. ఆయనలో ఒక టీచరు. రైతు, ఇంజినీర్‌ ‌కినిపిస్తాడు. నేను అసెంబ్లీలో వ్యవసాయం గురించి మాట్లాడేది మల్లారెడ్డి సలహాలు, సూచనలతోనే. సముద్రాన్ని చెంబులో ఎలా పట్టవచ్చో ఆయనకే తెలుసు. ప్రాజెక్టులు, నష్టాలు, కష్టాల గురించి తెలుసు. ఓంకార్‌ ‌సమకాలీకులు. ప్రభుత్వ సంస్థకు మల్లారెడ్డి పేరు పెడతామనడం సంతోషకరం. ప్రొఫెసర్లు చెప్పలేని విషయాలు చెప్పేవారు. ఎర్రజెండాలన్నీ ఒకటి కావాలి. ఒకే భావంతో ఉన్న మనమంతా ప్రత్యామ్నాయం కమ్యూనిజమే అనేలా మారాలి

ఆధునిక శాస్ర్తవేత్త :టీజేఎస్‌ అధ్యక్షులు, ఎమ్మెల్సీ కోదండరాం
రైతు ఆత్మహత్యలు జరుగుతున్న కాలంలో మల్లారెడ్డితో కలిసి రైతు సమస్యలపై అనేకసార్లు చర్చించాం. సమాజంలోని మార్పు రావాలనేది ఆయన కోరిక. యూరప్‌, చైనా దేశాల్లో రైతుల విషయాలపై కూడా మాట్లాడేవారు. సామాజిక,ఆర్థిక, రాజకీయ శిక్షణా తరగతులు నిర్వహించాలని చెప్పేవారు.

రైతాంగ ఉద్యమాలకు మార్గదర్శి :సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
మల్లారెడ్డి తెలుగు ఉమ్మడి రాష్ట్రానికి నాయకుడు. ఆయనకు ఆదిలాబాద్‌ ‌నుంచి అనంతపురం, శ్రీకాకుళం నుంచి మహబూబ్‌‌నగర్‌ ‌వరకు అవగాహన ఉంది. కమ్యూనిస్టులకు పోరాటం, అధికారం రెండూ కావాలి. శ్రామికులు, కూలీలంతా కమ్యూనిస్టులే. అమెరికా గడ్డ మీద సోషలిస్ట్‌ ‌పోరాటాలు ముందుకొస్తున్నాయి. వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఐక్యంగా కలిస్తే తప్పకుండా విజయం తథ్యం.

విలీనం గురించి మాట్లాడేవారు :సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్‌.వీరయ్య
రైతాంగ పోరాట యోధుడు సారంపల్లి మల్లారెడ్డి బతికుంటే సెప్టెంబరు 17 విలీన దినం గురించి తప్పకుండా మాట్లాడి ఉండేవారు. ఐలమ్మ వర్థంతిపై కూడా ప్రజలకు చైతన్యం కల్పించేవారు. వీర తెలంగాణ పోరాటం లేకుండా, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు లేకుండా నిజాం సంస్థానం దేశంలో విలీనం కాలేదు. కార్యక్రమంలో మంత్రి మహ్మద్‌ అజారుద్దీన్‌, ఎమ్మెల్యే మదన్‌‌సింగ్‌ ఠాకూర్‌, సీపీఐ(ఎంఎల్‌) ‌మాస్‌‌లైన్‌ ‌రాష్ట్రకార్యదర్శి పోటు రంగారావు, ఎంసీపీఐ(యూ) రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వనం సుధాకర్‌, సీపీఐ(ఎంఎల్‌) ‌న్యూమెమోక్రసీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు గోవర్థన్‌, ఎస్‌‌యూసీఐ(యూ) రాష్ట్రకార్యదర్శి సీహెచ్‌ ‌మురహరి, ఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, సీపీఐఎంఎల్‌ ‌లిబజరేన్‌ ‌రాష్ట్ర కార్యదర్శి రమేష్‌‌రాజా, సీపీఐఎంఎల్‌ ‌రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న ప్రసంగించారు. అలాగే వేదికపై సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి.జ్యోతి, రాష్టకార్యదర్శిర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి(మాజీ ఎమ్మెల్యే), పోతినేని సుదర్శన్‌‌రావు, జి నాగయ్య, నున్నా నాగేశ్వర్‌‌రావు, పాలడుగు భాస్కర్‌, టి సాగర్‌, ఎండీ అబ్బాస్‌, పి ప్రభాకర్‌‌, చుక్క రాములు, మల్లు లక్ష్మి, పి ప్రభాకర్‌, ఎండీ జహంగీర్‌తోపాటు దివంగత మల్లారెడ్డిభార్య భాగ్యలక్ష్మి, కుమారుడు వాసుదేవరెడ్డి తదితరులు ఉన్నారు.

‘నా నాగేటి సాళ్లు’ ఆవిష్కరణ
సారంపల్లి మల్లారెడ్డి స్వీయ రచన ‘ నా నాగేటి సాళ్లు’ పుస్తకాన్ని ప్రకాష్‌‌కరత్‌ ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్క రణలో సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌‌వెస్లీ, నవతెలంగాణ సీజీఎం పి ప్రభాకర్‌, ఎడిటర్‌ ‌రాంపల్లి రమేష్‌, బుక్‌‌హౌస్‌ ఎడిటర్‌ కె.ఆనందచారి, జీఎం వాసు పాల్గొన్నారు.



అనుబంధం మరువలేనిది- జాన్‌‌వెస్లీ
సారంపల్లి మల్లారెడ్డితో అనుబంధం మరువలేనిదని సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌‌వెస్లీ అన్నారు. తాడిత, పీడిత, శ్రామికవర్గాల విముక్తి కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారని చెప్పారు. కామ్రేడ్‌ ‌పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చిన ఆయన చివరి వరకు తన బాధ్యతల్ని అత్యంత క్రమశిక్షణతో , అనుసరణీయమార్గంలో నిర్వర్తించారన్నారు. దేశంలో విద్య,వైద్యం వ్యాపారంగా మారాయనీ, సమాజంలో దోపిడీ పెచ్చరిల్లుతున్నదనీ చెప్పారు. సారంపల్లికి దేశ, అంతర్జాతీయ అంశాలపై పూర్తి అవగాహన ఉందన్నారు. సోషలిస్టు సమాజ స్థాపన కోసం కృషి చేయడమే సారంపల్లికి ఇచ్చే ఘన నివాళి అని చెప్పారు. అనంతరం సీఎం రేవంత్‌‌రెడ్డి సభకు వచ్చిన సమయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును ప్రస్తావించారు.

​​ ప్రజాస్వామ్యానికి ప్రమాదం : సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
మల్లారెడ్డి రాష్ర్ట రైతంగానికి విస్ర్ర్తత సేవలు అందించారు. రైతులు, ప్రజా సమస్యలపై లోతైన అవగాహన ఉండేది. దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉంది. సర్‌ ‌పేరుతో బీజేపీ ప్రభుత్వం ప్రజల ప్రాథమిక హాక్కులకు భంగం కలిగిస్తున్నది. నాకు కూడా నోటీసు వచ్చింది. మీ తండ్రి పేరు సరిగ్గా లేదనీ, వివరాలు ఇవ్వాలని కోరింది. నేను పార్టీ నాయకుడిగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసిన నాకే ఈ పరిస్థితి, సాధారణ ప్రజల గురించి పట్టించుకుంటారా ? ఓటు రూపం మారుతున్నది. ఎన్నుకున్న వాళ్లను కొనేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఫిరాయింపుల చట్టం ఎందుకు పనికిరాకుండా పోతున్నది. ఎమ్మెల్యేలను టోకున కోనేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను చీలుస్తూ బీజేపీ ప్రమాదకర రాజకీయ క్రీడను ఆడుతున్నది. ముస్లీంలు, దళితులు, గిరిజనులకు ఓటే లేకుండా చేసే కుట్రను ‘సర్‌’ తో చేస్తున్నారు.

‘సర్‌’తో ప్రజల మధ్య విభజన :సీసీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌‌కరత్‌
కేంద్ర ఎన్నికల సంఘం నరేంద్రమోడీ ప్రభుత్వానికి తొత్తుగా పనిచేస్తున్నదని సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌‌కరత్‌ అన్నారు. ‘సర్‌’ పేరుతో దేశంలో మూడోవంతు ఓటర్లను తొలగించే కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరిం చారు. దీనివల్ల మైనార్టీలు, మెజారిటీ వర్గ ప్రజలు కాకుండా, ఓటు హక్కు ఉన్నవారు, అది లేనివారు అనే రెండు రకాల ప్రజా విభజన జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, సంఘ్‌‌పరివార్‌ ‌దేశంలో ప్రజాస్వామ్యం, సెక్యులరిజంను సవాలు చేస్తున్నాయని చెప్పారు. జనగణనను మతపరమైన విభజనకు వాడుకొనే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో 92 లక్షల ఓట్ల తొలగింపును చేపట్టారనీ, వయోజన ఓటు హక్కు ప్రమాదంలో పడిందని హెచ్చరించారు. బెంగాల్‌‌లో కూడా లక్షల మంది ఓట్లు తొల గించారనీ, వాటిలో ముస్లిం మైనార్టీలను టార్గెట్‌ ‌చేశారని వివరించారు. ఢిల్లీలోనూ 33 శాతం ఓట్లు గల్లంతు చేశారని చెప్పారు. ‘సర్‌’ పేరుతో ఓ ప్రత్యేక సెక్షన్‌ ‌ప్రజల్ని టార్గెట్‌ ‌చేస్తున్నారన్నారు. ఓటుహక్కు తొలగింపు రాజ్యాంగ విరుద్ధమనీ, మోడీ సర్కార్‌ ‌దాన్నే చేస్తున్నదని చెప్పారు. తెలుగురాష్ర్టాల్లో సారంపల్లి మల రైతాంగ సమస్యలపై వారిని మేల్కొలిపి, పరిష్కారాలకోసం దిక్సూచిగా నిలిచారన్నారు.

పరిశోధనా కేంద్రానికి సారంపల్లి పేరు – సీఎం
మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు వెళ్లి రైతులకోసం తన జీవితాన్ని ధారపోసిన నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి మరణం రైతాంగానికి తీరని లోటు అని సీఎం చెప్పారు. రైతాంగ సమస్యపై అవగాహన, సంస్కారవంతంగా అంశాలను లేవనెత్తడంలో సారంపల్లికి సాటి లేరని ప్రసంసించారు. కౌలు రైతుల సమస్య, పంటలు గిట్టుబాటు ధర కోసం ఆయన ఎంతో పోరాడారనీ, భూమి సారం నుంచి పంట తీసేవరకు సమస్యను పూర్తిగా అర్థం చేసుకున్న ఎన్ సైక్లోపీడియా సారంపల్లి మల్లారెడ్డి అని చెప్పారు. ఆయన రాసిన పుస్తకాలు, లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతాంగ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు. సారంపల్లి మల్లారెడ్డి గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ఏదైనా పరిశోధనా కేంద్రానికి ఆయన పేరు పెడతామన్నారు. దీనిపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

​సీపీఐ(ఎం) నేతలతో ప్రత్యేకంగా భేటీ అవుతా
అసెంబ్లీ సమావేశాల అనంతరం సీపీఐ(ఎం) ప్రతినిధి బృందంతో తాను స్వయంగా భేటీ అవుతానని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును సీపీఐ(ఎం) రాష్ర్ట కార్యదర్శి జాన్‌‌వెస్లీ సభలో ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ పేదల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. వారి సమస్యలు, పరిష్కారాల విషయంపై తానే స్వయంగా వారితో చర్చిస్తానని స్పష్టం చేశారు.





















- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -