ఆవిష్కరణలు,
స్వావలంబనతో దేశ ప్రగతికి దోహదం
మాదకద్రవ్య రహిత
భారత నిర్మాణానికి సమిష్టి
కృషి చేయాలి : తెలంగాణ
గవర్నర్ శివప్రతాప్ శుక్లా
ఘనంగా ఓయూ 85వ స్నాతకోత్సవం
నవతెలంగాణ–ఉస్మానియా యూనివర్సిటీ
యువత ఉద్యోగాలు కోరేవారీగా కాకుండా సృష్టించేవారీగా ఎదగాలని తెలంగాణ గవర్నర్, ఓయూ ఛాన్స్లర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. దేశాన్ని బలోపేతం చేయడంలో పారిశ్రామిక ప్రగతి, స్వావలంబన, సమిష్టి కృషి కీలకమన్నారు. హైదరాబాద్లోని ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో మంగళవారం జరిగిన 85వ స్నాతకోత్స వానికి గవర్నర్ అధ్యక్షత వహించారు. విద్యార్థులకు, పరిశోధకులకు 71 బంగారు పతకాలు, 640 పీహెచ్డీ పట్టాలను గవర్నర్ ప్రదానం చేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయ చారిత్రక ప్రాధాన్యతను కొనియాడారు. ముఖ్యంగా యువతను మాదకద్రవ్యాల దుష్ప్రభావాల నుంచి రక్షించేందుకు సమాజం సమిష్టిగా కృషి చేసి మాదకద్రవ్య రహిత భారతదేశ నిర్మాణానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మెన్ డాక్టర్ కృష్ణ ఎం.ఎల్లా మాట్లాడుతూ.. యువత ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సూచించారు. తమ పిల్లలకు విద్య అందించేందుకు భారతీయ తల్లిదండ్రులు భూములు, నగలు సైతం విక్రయించి త్యాగాలు చేస్తారని, విద్య జీవితాలను మార్చగల శక్తిగా వారు విశ్వసించడమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డారు. సమాజంలో ఇప్పటికే అనేక రకాల విభజనలు ఉన్నాయని, యువతలో కొత్త రకాల విభజనలకు దారితీసే ధోరణులు ప్రయోజనకరం కావని చెప్పారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మనస్తాపం గణనీయంగా తగ్గిందని, ఆవిష్కరణలు, పారిశ్రామిక ప్రగతి, జ్ఞానం, ఉత్పాదకత ద్వారా భారత్ తన స్థానాన్ని తిరిగి బలోపేతం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు. జాతీయ విద్యా విధానం-2020 స్ఫూర్తికి అనుగుణంగా మాతృభాషలో అభ్యసన ప్రాధాన్యతను వివరించారు. కృత్రిమ మేధస్సు(ఏఐ) వంటి ఆధునిక సాంకేతికతలను యువత మరింత సృజనాత్మకంగా, ఉత్పాదకంగా వినియోగించాలని కోరారు. సోషల్ మీడియాలో సమయాన్ని వృథా చేయకుండా ఆధునిక సాంకేతికతను ఉత్పాదకంగా ఉపయోగించు కోవాలని సూచించారు. సామాజిక సమస్యలకు పరిష్కారాలను సృష్టించే శక్తిగా యువత నిలవాలన్నారు. వీసీ ప్రొ.కుమార్ మొలుగరం విశ్వవిద్యాలయ ప్రగతి, విజయాలు, భవిష్యత్ దిశను ప్రతిబింబించే నివేదికను సమర్పించారు. విద్యా ప్రావీణ్యం, పరిశోధన, ఆవిష్కరణలు, సంస్థాగత అభివృద్ధికి ఓయూ నిరంతరం కట్టుబడి ఉందన్నారు. విశ్వవిద్యాలయ విజయాలు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, సిబ్బంది సమిష్టి కృషి ఫలితమని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఉద్భవిస్తున్న కొత్త సవాళ్లు, అవకాశాలను సమర్థవంతంగా ఎదుర్కొనేలా విద్యార్థులు, పరిశోధకులను సిద్ధం చేయాల్సిన అవసరాన్ని చెప్పారు. ఓయూ తన ఘనమైన విద్యా వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూనే శ్రేష్టత, సామాజిక ప్రభావానికి కొత్త మార్గాలను సృష్టిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, డీన్లు, అధ్యాపకులు, పరిశోధకులు, బంగారు పతక గ్రహీతలు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ప్రముఖ అతిథులు పాల్గొన్నారు.
యువత ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఎదగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



