Monday, April 20, 2026
E-PAPER
Homeజాతీయంరాజకీయ వ్యూహమే..

రాజకీయ వ్యూహమే..

- Advertisement -

1957లోనే జనసంఘ్‌ మ్యానిఫెస్టోలో ‘యూనిటరీ స్టేట్‌’ అంశం
– కేంద్రం ఆధిపత్యాన్ని పెంచడమే లక్ష్యం
– రాజకీయ వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం
– 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో అనిశ్చితి..
– వ్యవస్థను అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ యత్నం
– డీలిమిటేషన్‌పై రాజకీయ నిపుణులు క్రిస్టోఫ్‌ జాఫ్రెలోట్‌


న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వివాదాస్పద రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చి దేశంలో తీవ్ర చర్చకు తెరలేపింది. బిల్లు వీగిపోవడంతో కేంద్రం అప్రతిష్టను మూటగట్టుకుంది. అయితే ఈ బిల్లులను తీసుకురావడంతో మోడీ ప్రభుత్వ స్వార్థపూరిత ప్రయోజనాలను రాజకీయ విశ్లేషకులు, నిపుణులు బయటపెడుతున్నారు. భారత పార్లమెంటులో అకస్మాత్తుగా ప్రవేశపెట్టబడిన డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌, లోక్‌సభ సీట్లను 850కి పెంచే ప్రతిపాదనలు దేశ రాజకీయ వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపొచ్చని రాజకీయ శాస్త్రవేత్త క్రిస్టోఫ్‌ జాఫ్రెలోట్‌ హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం పాలనా మార్పు కాకుండా కేంద్రం ఆధిపత్యాన్ని బలపరిచే దిశగా పెద్ద వ్యూహం కావచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ది వైర్‌’కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన అభిప్రాయాలను వెలిబుచ్చారు.

ఇటీవల పార్లమెంటులో చోటు చేసుకున్న పరిణామాలను వ్యాఖ్యాత సీమా చిష్తీ ప్రస్తా వించారు. మహిళా రిజర్వేషన్‌ చట్టం ఇప్పటికే 2023లో ఆమోదం పొందినప్పటికీ.. దానిని అమలు చేయడానికి వెంటనే డీలిమిటేషన్‌ ప్రతిపాదన చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదిం చడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. కొత్త జనగణన జరుగుతున్న సమయంలో 2011 జనగణన ఆధారంగా 850 లోక్‌సభ సీట్లు నిర్ణయించడం రాజకీయంగా పెద్ద మార్పులకు దారి తీస్తుందని చెప్పారు.

హిందీ ప్రాంతాలకు సీట్లు పెరిగితే అధికార పార్టీకి లాభం
డీలిమిటేషన్‌ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశా లపై ఆయన మాట్లాడారు. హిందీ ప్రాంతాలకు జనాభా ఆధారంగా ఎక్కువ ప్రాతినిధ్యం లభించే అవకాశం ఉందని వ్యాఖ్యాత అన్నారు. ఈ పరిణామం అధికార పార్టీకి లాభదాయకంగా ఉండవచ్చని వివరించారు. అలాగే 850 సీట్లతో మరిన్ని నియోజకవర్గాల సరిహద్దులను మార్చుకునే అవకాశాలు పెరుగుతాయని కూడా తెలిపారు.

‘యూనిటరీ స్టేట్‌’ కోసం జనసంఘ్‌ యత్నం
ఈ అంశంపై ఆయన స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఇది ఎన్నికల లాభం కోసమే కాకుండా.. దీర్ఘకాలిక సిద్ధాంతపరమైన లక్ష్యాల తో కూడుకున్నదని అన్నారు. జనసంఫ్‌ు 1957 మ్యానిఫెస్టోలోనే భారత్‌ను యూనిటరీ స్టేట్‌గా మార్చాలనే ఆలోచన ఉన్నదని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాల మధ్య భాషా ఆధారిత విభజనను వారు అంగీకరించలేదనీ, కేంద్రం నుంచి నేరుగా స్థానిక సంస్థలతో సంబంధాలు పెంచే విధానం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను తగ్గించాలని భావించారని వివరిం చారు.

జమ్మూకాశ్మీర్‌ పరిస్థితి ఒక ఉదాహరణ
”అఖండ భారత్‌” అనే భావనను కూడా ఆయన ప్రస్తావించారు. ఇది కేవలం భౌగోళిక సరిహద్దుల గురించి కాకుండా.. ఒక సాంస్కృ తిక-ఆధ్యాత్మిక దృష్టికోణమని చెప్పారు. ఈ దృక్పథంలో భాష కంటే భూభాగం, నదులు, పర్వతాలకు ప్రాధాన్యం ఉంటుందని వివరించారు. జమ్మూకాశ్మీర్‌లో 2019లో ఆర్టికల్‌ 370 రద్దు చేసి రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయాన్ని కూడా ఆయన ఇదే ధోరణిలో చూశారు. దీంతో కేంద్రానికి నేరుగా నియంత్రణ పెరిగిందనీ, రాష్ట్ర స్వయం ప్రతిపత్తి తగ్గిందని చెప్పారు. ఇదే విధమైన కేంద్రీకరణ ధోరణి ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తోందని అన్నారు.

భవిష్యత్‌ రాజకీయాలను నిర్ణయించే మూడు ప్రధాన శక్తులు
ఇందిరాగాంధీ కాలంలో కూడా కేంద్రం రాష్ట్రాలపై నియంత్రణ పెంచే ప్రయత్నాలు చేసిందనీ, కానీ అవి ప్రతికూల ఫలితాలు ఇచ్చాయని ఆయన గుర్తు చేశారు. స్వతంత్ర భారత మొదటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రాంతీయ గుర్తింపులను అంగీకరించి, రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వడం ద్వారా సమస్యలను తగ్గించే ప్రయత్నం చేశారని తెలిపారు. ఇప్పుడు భారత రాజకీయాల్లో కుల, మత రాజకీయాలు, ప్రాంతీయ-భాషా గుర్తింపు అనే మూడు ప్రధాన శక్తులు పని చేస్తున్నాయని ఆయన విశ్లేషించారు. ఈ మూడు శక్తుల మధ్య పోటీ భవిష్యత్‌ రాజకీయాలను నిర్ణయిస్తుందని అన్నారు.

రాజ్యసభ ప్రాధాన్యత తగ్గొచ్చు
లోక్‌సభ సీట్ల సంఖ్య పెరిగితే రాజ్యసభ ప్రాధాన్యం తగ్గే అవకాశం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల ప్రతినిధిగా లోక్‌సభను బలపర్చడం ద్వారా కేంద్రానికి మరింత శక్తి కేంద్రీకృతమవుతుందని చెప్పారు. ఇది ప్రజాస్వామ్య సమతుల్యతను ప్రభావితం చేయొచ్చని హెచ్చరించారు.

2024 ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్‌
లోక్‌సభ స్థానాలపై ప్రొఫెసర్‌ జాఫ్రెలోట్‌ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఆయన ఉదాహరణగా తీసుకున్నారు. కొంతకాలంగా అధికారంలో ఉన్న నాయకులు ఎన్నికల ఫలితాల అనిశ్చితిని గమనించి, ముందుగానే వ్యవస్థలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారని అన్నారు. 2024 ఎన్నికల్లో (బీజేపీ) పూర్తి ఆధిపత్యం సాధించలేకపోయిన పరిస్థితిలో.. భవిష్యత్‌ ఆర్థిక, అంతర్జాతీయ సంక్షోభాలు పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.

రాబోయే ఎన్నికలు కీలకం
ఇక భవిష్యత్‌ గురించి ప్రశ్నించగా.. ఆయన స్పష్టంగా ఒకే దిశలో పరిణామాలు సాగవని అన్నారు. హంగేరీలో జరిగిన మార్పులను ఉదాహరణగా చూపుతూ.. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మరో ప్రభుత్వం మార్చగలదని చెప్పారు. రాబోయే ఎన్నికలు, ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. కుల గణన, ప్రాంతీయ ఐక్యతలు, ఆర్థిక పరిస్థితులు అన్నీ కలిసిపోతే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులకు అవకాశం ఉండవచ్చని తెలిపారు. ఆయన హిందూత్వ ప్రభావం మరింత బలపడే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేదు. ఎన్నికలు జరుగుతున్నంత కాలం ప్రజాస్వామ్యంలో మార్పులకు అవకాశం ఉంటుందని
ఆయన అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -