Monday, April 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమౌలిక వసతుల్లోనూ కులాల మధ్య అంతరాలు

మౌలిక వసతుల్లోనూ కులాల మధ్య అంతరాలు

- Advertisement -

– ఎస్టీ కొలాం కమ్యూనిటీలో 64 శాతం ఇండ్లకు అందని నల్లా నీరు
– అత్యల్పంగా ఓసీ జైనుల్లో 3.2 శాతం
– ఇరుకైన చిన్న గదుల్లో 75శాతం ఎస్టీలు.. 73శాతం ఎస్సీలు
– ఓసీల్లో 47 శాతం కుటుంబాలు
– కరెంట్‌లేనీ ఎస్టీ,ఎస్సీల శాతం 11, 8.3
– రాష్ట్ర సగటు 5.8 శాతం కాగా ఓసీల్లో 2.7 శాతం మాత్రమే
– సీసెక్‌ సర్వే వివరాలతో ఆందోళన

ఉరగొండ మల్లేష్‌
రాష్ట్రంలో గత పదేండ్లలో పెద్దఎత్తున అభివృద్ధి జరి గిందని చెప్పుకుంటున్నప్పటికీ, వివిధ వర్గాల ప్రజల ప్రాథమిక జీవన ప్రమాణాల్లో తీవ్రమైన అంతరాలు ఉన్నట్టు తెలంగాణ సామాజిక-ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సీపెక్‌) ఫలితాలు వెల్లడించాయి. మౌళిక వసతుల కల్పనలో షెడ్యుల్‌ తెగలు, షెడ్యుల్‌ కులాలు, బీసీల్లోని కొన్ని వర్గాలు తీవ్ర వెనకబాటును అనుభవిస్తున్నాయి. ఈ వర్గాలకు ఇప్పటికీ విద్యుత్‌, ట్యాప్‌ వాటర్‌, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు లేవు. తెలంగాణ లోని ప్రజల సామాజిక, ఆర్థిక వెనుకబాటుతనానికి జీవన పరిస్థితుల మధ్య ఉన్న భేధాలను సర్వే స్పష్టం చేసింది. అత్యంత దిగువ స్థాయిలో ఎస్టీ కొలాం సమాజంలోని 64.7 శాతం కుటుంబాలకు కుళాయి నీటి సౌకర్యం లేదు. ఇది రాష్ట్ర సగటు కంటే మూడు రెట్లకు పైగా ఉంది. బీసీ-డీ మాలిలు, ఎస్సీ మహార్లు, ఎస్టీ గోండులు 50 నుంచి 60 శాతం అంతరాన్ని కలిగి ఉన్నారు. ఈ వర్గాలు తీవ్రమైన మౌలిక సదుపాయాల వెనుకబాటుతనానికి గురవుతు న్నారు. కుళాయి నీరు లేని వారి నిష్పత్తి ఓసీ జైనులలో అత్యల్పంగా కేవలం 3.2శాతంగా ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఓసీ అయ్యగార్లు, రాజులు, బ్రాహ్మణులు, కోమట్లు, రెడ్లు ఉన్నారు. ఈ కులాలు రాష్ట్ర సగటు కంటే నాలు గింతలు మెరుగ్గా ఉన్నారు. 95 శాతానికి పైగా వీరి ఇండ్లల్లో నిత్యం మంచి నీరు అందుబాటులో ఉందని తేలింది. మొత్తంగా చూస్తే 29.2 శాతం ఎస్టీ, 19 శాతం ఎస్సీ, 20 శాతం బీసీ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు లేవు. మంచి నీటి సరఫరా లేకపోవడం ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రభావం చూపడమే కాకుండా, నీటిని సేకరించే బాధ్యతను మోసే మహిళలు తరుచూ ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారని తేలింది.

6.5లక్షల కుటుంబాలకు నో కరెంట్‌
రాష్ట్రంలో 6.56లక్షల కుటుంబాలకు విద్యుత్‌ సౌకర్యం లేదని సీపెక్‌ సర్వే వెల్లడిం చింది. అయితే విద్యుత్‌ కొరత అన్ని వర్గాల్లో ఒకేలా లేదని పేర్కొంది. కొన్ని వర్గాల్లో ఈ అంత రాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యుత్‌ వసతుల కల్పనలో షెడ్యుల్‌ తెగలు(ఎస్టీ) వర్గాలు తీవ్ర అసమానతలకు గురవుతు న్నాయి. అందరికి విద్యుత్‌ అందించామని చెబుతున్నప్పటికీ ఈ వర్గాల్లో 11 శాతం ఇండ్లకు కరెంట్‌ లేదు. ఇది రాష్ట్ర సగటు 5.8 శాతానికి రెట్టింపుగా ఉంది. షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ (ఎస్సీ) కుటుంబాల్లో 8.3శాతం, వెనుకబ డిన తరగతుల్లో (బీసీ) 4.7 శాతం, ఇతర కులాల్లో (ఓసీ) 2.7శాతం మందికి విద్యుత్‌ సౌకర్యం లేదు. మొత్తం ఫలితాలను బట్టి చూస్తే రాష్ట్రంలో అట్టడుగు వర్గాలు ఇప్పటికీ ఈ ప్రాథమిక సదుపాయాన్ని పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

75 శాతం ఎస్టీలు ఇరుకు ఇండ్లల్లో..
రాష్ట్రంలో గృహ పరిస్థితులు కూడా తీవ్రమైన అసమానతలను ప్రతిబింబిస్తున్నాయి. సీపెక్‌ సర్వే ప్రకారం అణగారిన వర్గాల వారు, ఇప్పటికీ ఇరుకైన చిన్న చిన్న ఇండ్లలో నివసిస్తున్నారు. 75 శాతం ఎస్టీలు, 73 శాతం ఎస్సీలు రెండు గదుల కన్నా తక్కువ ఉన్న ఇండ్లలో ఉంటున్నారు. బీసీల విషయంలో ఈ సంఖ్య 63 శాతం కాగా, ఓసీల విషయంలో 47శాతంగా ఉంది. దీనికి విరుద్ధంగా, కేవలం 17 శాతం ఎస్టీలు, 18శాతం ఎస్సీలు మూడు లేదా అంతకంటే ఎక్కువ గదులున్న సౌకర్యవంతమైన ఇండ్లల్లో నివసిస్తున్నారు. బీసీల్లో ఈ సంఖ్య 28 శాతం కాగా, ఓసీల్లో 42శాతంగా ఉంది.

13.3 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు కరువు
తెలంగాణలోని 13.3 శాతం కుటుంబాలకు ఇంట్లో మరుగుదొడ్ల సౌకర్యం లేదు. అత్యధికంగా ఎస్టీ వర్గాల్లో 32 శాతం కుటుంబాలు మరుగుదొడ్లకు దూరంగా ఉన్నాయి. షెడ్యూల్డ్‌ కులాల (ఎస్సీ) కుటుంబాలలో 18.8శాతం, వెనుకబడిన తరగతుల (బీసీ) కుటుంబాల్లో 10.8శాతం, ఇతర కులాలు (ఓసీ) 4.5శాతం మందికి మరుగుదొడ్లు లేవు. మరుగుదొడ్లు లేకపోవడం కేవలం ఒక అసౌకర్యం మాత్రమే కాదనీ, ఇది మహిళలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని సర్వే తేల్చింది. దీర్ఘకాలంగా ఉన్న అసమానతలను పరిష్కరించడానికి స్వచ్ఛమైన నీరు, పారిశుధ్యం, విద్యుత్‌, తగిన గృహవసతి అందుబాటులో ఉండటం కీలకమని సీపెక్‌ సర్వే పేర్కొంది.


- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -