– నివాసాల మీదుగా 33, 11 కేవీ విద్యుత్ లైన్లు
– ప్రమాదాల బారిన జనం
– పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
– పీసీసీ అధ్యక్షులు చొరవ చూపాలంటున్న ప్రజలు
నవతెలంగాణ- నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
హై టెన్షన్ వైర్లు ప్రజల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. పలుచోట్ల ఇండ్ల పై నుంచి, పక్క నుంచి ఉండటంతో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇది వరకే పలువురు విద్యుద్ఘాతంతో మృతిచెందారు. ప్రమాదకరంగా మారిన వాటిని దూరంగా జరపాలని విన్నవించుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. నిజామాబాద్‌లో ఇండ్ల పై నుంచే 33 కేవీ, 11 కేవీ విద్యుత్ వైర్లు ఉండటంతో నివాసాల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. సదరు ఇండ్లను విక్రయించి వేరే చోటుకు వెళ్దామని అనుకున్నా.. వైర్లను చూసి ఎవరూ ముందుకు రావడం లేదు. గతంలో ఎలక్ట్రిసిటీ అధికారులు ఎస్టిమేషన్ రూపొందించి ప్రభుత్వానికి నివేదించినా అనుమతి రాలేదు. ప్రస్తుత ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయించి ఇండ్లపై నుంచి హైటెన్షన్ వైర్లు తొలగించాలని కోరుతున్నారు. టీపీసీసీ అధ్యక్షులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని విన్నవించుకుంటున్నారు.
నిజామాబాద్ నగరం విస్తరించకముందే సబ్ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేసేందుకు 33 కేవీ, 11 కేవీ హై టెన్షన్ (హెచ్‌టీ) విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో పొలాలు ఉండటంతో వాటి మీదుగా వెళ్లాయి. క్రమంగా నగరం విస్తరించడం, పొలాలు ప్లాట్లుగా మారాయి. నిబంధనలకు విరుద్ధంగా వైర్ల కిందనే ప్లాట్లు వెలిశాయి. ఆ సమయంలో కూనె ఇండ్లు కట్టుకోవడంతో వైర్లతో పెద్ద ప్రమాదం లేకుండా పోయింది. పెరిగిన అవసరాలతో కూనె పెంకుల ఇండ్లు కాస్తా డాబాలు అయ్యాయి. దాంతో ఇండ్లపై విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా మారాయి. వాటిని మార్చాలని పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ప్రజలు వాపోతున్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బందిని అడిగితే.. నగరం మొత్తం ఎంత కరెంట్ బిల్లు వస్తదో అంత కడితే మార్చుతామని ఎద్దేవా చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు.
ముట్టుకుంటే అంతే..
నిజామాబాద్ నగరంలో సూర్యనగర్, చంద్రనగర్, సీతారామ్‌నగర్ కాలనీలతోపాటు ఇతర చోట్ల పదుల సంఖ్యలో ఇండ్ల మీదుగా 33 కేవీ హెచ్‌టీ లైన్లు ఉన్నాయి. ఇంటి స్లాబ్ మీదకు వెళ్తే భుజాలను తాకేలా వైర్లు ఉన్నాయి. వైర్లకు దగ్గరగా వెళ్తే గురు.. మంటు శబ్ధం వస్తుంది. వర్షాల సమయంలో ఎక్కడ ఎర్తింగ్ వచ్చి కరెంట్ షాక్ వస్తుందోనని స్థానికులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
ఇది వరకే పలువురు మృతి
ఇంటిపై ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లతో ఇది వరకే పలువురు ప్రాణం కోల్పోయారు. తాజాగా 8వ డివిజన్లోని సీతారాంనగర్ కాలనీలో ఇంటి నిర్మాణ సమయంలో ప్రమాదవశాత్తు పెయింటర్ వైర్లకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వీటిని ఇండ్ల మీదుగా నుంచి మార్చాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ఎలక్ట్రిసిటీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. గతంలో సుమారు కోటిన్నర రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అంత చెల్లిస్తే ప్రమాదాల నుంచి దూరం చేయొచ్చనేది అధికారుల అభిప్రాయం.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బాధ్యతలు
నిజామాబాద్ నగరంతోపాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఇదే విధంగా విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా ఇంటి పైన, ఇంటికి ఆనుకొని ఉన్నాయి. నెల రోజుల కిందట భిక్కనూర్ మండలం జంగంపల్లిలో ఇంటిపై పెయింట్ వేసేందుకు వెళ్లిన వ్యక్తి 33కేవీ విద్యుత్ వైర్లు తగిలి మృతిచెందాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సైతం ఓ కాలనీలో ప్రమాదకరంగా మారిన విద్యుత్ స్తంభాన్ని మార్చాలని పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోకపోవడంతో మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తన సొంత డబ్బులతో పనులు చేయించారని అంటున్నారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పందించి విద్యుత్ లైన్లను సరిచేసేందుకు చొరవ చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
దండం పెడతాం..
మా గల్లీలో మొత్తం నాలుగు ఇండ్ల మీద నుంచి పెద్ద లైన్ ఉంది. వాటిని దూరంగా వేయాలని అడుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది. అక్కడికి మార్చాలని కోరుతున్నా లెక్కచేస్తలేరు. భయంభయంగానే బతుకులీడుస్తున్నాం. మీకు దండం పెడతాం.
– ఊర్మిళ-సూర్యనగర్
నిజామాబాద్ మొత్తం కరెంట్ బిల్లు కట్టాలటా..
మా ఇంటి మీద నుంచి కరెంట్ వైర్లు తొలగించాలని కోరితే.. నిజామాబాద్ నగరానికి మొత్తం వచ్చే కరెంట్ బిల్లు కడితే తీసెస్తారట. బీడీలు చుడుతూ చిన్నచిన్న పనులు చేసే మాతోటి ఎక్కడ అయితది. చిన్న పిల్లలున్నారు. బంగ్ల మీదకు వెళ్దామంటే భయం. ఎక్కడ ఎప్పుడు ఎలాంటి ప్రమాదం వస్తదోనని భయంతోనే గడుపుతున్నాం. మా ఇండ్లపై నుంచి ఉన్న పెద్ద లైన్లను తొలగించాలి.
-గృహిణి మాధవి
ఉన్నతాధికారులకు నివేదిస్తాం
నిజామాబాద్ నగరంలో పలు చోట్ల ఇండ్లపై నుంచి 33 కేవీ విద్యుత్ లైన్లు ఉన్న విషయం నా దృష్టికి వచ్చింది. నేను రాకముందే ఎస్టిమేషన్ వేసి పంపినట్టు సమాచారం. ఈ సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
– టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ రాజేశ్వర్



