వచ్చే పార్లమెంటు సెషన్‌లోనే బిల్లు ?
పీఎఫ్ ఆర్‌డీఏ చట్టంలో సవరణలకు కసరత్తు
బీమా రంగంలాగే పెన్షన్ల రంగంలోకి ఎఫ్‌డీఐలు
పీఎఫ్ ఆర్‌డీఏ నుంచి ఎన్‌పీఎస్ ట్రస్ట్‌ను వేరుచేయాలనే ప్రతిపాదన- 15 మంది నిపుణులతో ఎన్‌పీఎస్ ట్రస్ట్ పర్యవేక్షణ
న్యూఢిల్లీ : పెన్షన్ రంగంలో కీలక సంస్కరణకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) పరిమితిని 100 శాతానికి పెంచాలని సర్కారు భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనతో కూడిన బిల్లును వచ్చే (జులై లేదా ఆగస్టు) పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే బీమా రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశాన్ని కల్పించిన సర్కారు, ఇప్పుడు పెన్షన్ల రంగంలోనూ అదే తరహా సంస్కరణ చేసే దిశగా అడుగులు వేస్తోంది. బీమా రంగంలోకి ఎఫ్‌డీఐల పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచే బిల్లును గత సంవత్సరమే పార్లమెంటు ఆమోదించింది. అంతకంటే ముందు 2015లో బీమా చట్టం – 1938లో కీలక సవరణలు చేసి, బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచారు.
వర్షాకాల సెషన్ లేదా శీతాకాల సెషన్
ప్రస్తుతానికి భారత్‌లోని పెన్షన్ ఫండ్లలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై పరిమితి 49 శాతం ఉంది. దీన్ని 100 శాతానికి పెంచేందుకుగానూ ఈమేరకు ‘పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్ ఆర్‌డీఏ ) చట్టం – 2013’లో పలు సవరణలను ప్రతిపాదించనున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి అనుమతులు లభించే వేగాన్ని బట్టి ఈ ఏడాది పార్లమెంటు వర్షాకాల సెషన్ లేదా శీతాకాల సెషన్‌లో ఈ సవరణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
ఎన్‌పీఎస్ ట్రస్ట్‌ను వేరుచేసే ప్రతిపాదన
భారత పౌరులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను కల్పించేందుకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్సీఎస్)ను భారత ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఇదొక స్వచ్ఛంద, దీర్ఘకాలిక పదవీ విరమణ పొదుపు పథకం. దీన్ని పీఎఫ్ ఆర్‌డీఏ సంస్థ నియంత్రిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అనేది ఒక పెన్షన్ పథకం. కేవలం దీన్ని పర్యవేక్షించడానికి పీఎఫ్ ఆర్‌డీఏ ఏర్పాటుచేసిన ప్రత్యేక విభాగమే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ (ఎన్‌పీఎస్ ట్రస్టు ). పీఎఫ్ ఆర్‌డీఏ పరిధి నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌ను వేరు చేయాలనే సవరణ కూడా ప్రతిపాదిత పెన్షన్ బిల్లులో ఉంటుందని తెలుస్తోంది.
ఛారిటబుల్ ట్రస్టు లేదా కంపెనీగా ఎన్‌పీఎస్ ట్రస్ట్
ప్రస్తుతానికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్‌కు సంబంధించిన అధికారాలు, విధులు, బాధ్యతలకు ‘పీఎఫ్ ఆర్‌డీఏ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్) రెగ్యులేషన్స్ – 2015’లోని నిబంధనలు దిశానిర్దేశం చేస్తున్నాయి. ఇకపై ప్రత్యేక ఛారిటబుల్ ట్రస్టుగా లేదా కంపెనీల చట్టం ప్రకారం ఎన్‌పీఎస్ ట్రస్ట్ పనిచేసేలా సవరణను పెన్షన్ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
భారత పెన్షన్ రంగ నియంత్రణ సంస్థ పీఎఫ్ ఆర్‌డీఏతో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేసేలా ఎన్‌పీఎస్ ట్రస్టును మార్చాలని సర్కారు యోచిస్తోంది. దాని నిర్వహణ కోసం 15 మంది నిపుణులతో కూడిన ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తారని సమాచారం. ఎన్‌పీఎస్ ట్రస్టుకు సమకూరే నిధుల్లో సింహ భాగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచే లభిస్తుంటుంది. అందుకే ఎన్‌పీఎస్ ట్రస్టును నియంత్రించే 15 మంది నిపుణుల్లో మెజారిటీ సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచే ఉంటారని చెబుతున్నారు.
ఏమిటీ పీఎఫ్ ఆర్‌డీఏ?
భారత ప్రభుత్వం 2003 ఆగస్టు 23న పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్ ఆర్‌డీఏ)ను ఏర్పాటు చేసింది. దీనితో ముడిపడిన చట్టాన్ని 2013లో పార్లమెంటు ఆమోదించింది. ఇది 2014 ఫిబ్రవరి 1 నుంచి పూర్తిస్థాయి చట్టబద్ధమైన సంస్థగా అందుబాటులోకి వచ్చింది. భారతదేశంలో పెన్షన్ వ్యవస్థను ఆధునీకరించడానికి, పారదర్శకంగా మార్చడానికి దీన్ని ఏర్పాటు చేశారు. పీఎఫ్ ఆర్‌డీఏ అనేది పింఛను పథకాలను క్రమబద్ధీకరించడంతో పాటు వాటి ఆరోగ్యకరమైన అభివృద్ధిని ప్రోత్సహించింది.
ప్రభుత్వ ఉద్యోగుల కోసం 2004 జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్సీఎస్)ను సైతం పీఎఫ్ ఆర్‌డీఏ పర్యవేక్షిస్తోంది. పెన్షన్ ఫండ్లలో ప్రజలు దాచుకున్న సొమ్ముకు రక్షణ కల్పిస్తోంది. మోసాలు జరగకుండా చూస్తోంది. అసంఘటిత రంగ కార్మికులతో సహా అందరికీ పదవీ విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం అందేలా అటల్ పెన్షన్ యోజన లాంటి కొత్త పథకాలను అమలు చేస్తోంది. పెన్షన్ నిధులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నియమాలు రూపొందించి, చందాదారులకు మంచి లాభాలు వచ్చేలా పీఎఫ్ ఆర్‌డీఏ వ్యూహరచనలు చేస్తోంది.
ఓపీఎస్ నుంచి ఎన్‌పీఎస్ దిశగా
భారత ప్రభుత్వం ప్రస్తుతం పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) నుంచి నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్) వైపుగా అడుగులు వేస్తోంది. పాత పెన్షన్ స్కీం ప్రకారం పీఎఫ్ చందాదారులకు ప్రయోజనాన్ని కల్పించే విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది. కానీ ఎన్‌పీఎస్‌లో ప్రయోజనం కల్పించే విషయంలో ప్రభుత్వం కంటే చందాదారుడి నిర్ణయాలు, మార్కెట్ పనితీరు పాత్రే ఎక్కువగా ఉంటాయి. అంటే ఎన్‌పీఎస్‌లో చందాదారుడి బాధ్యత పెరిగింది.
ఎన్‌పీఎస్‌లో ప్రభుత్వం కేవలం నిర్ణీత వాటాను మాత్రమే అందిస్తుంది. కానీ రిటైర్మెంట్ తర్వాత, చందాదారుడికి అంతే పెన్షన్ వస్తుందనే గ్యారంటీని ఇవ్వదు. ఎందుకంటే ఎన్‌పీఎస్‌లోని చందాదారుల డబ్బును స్టాక్ మార్కెట్, బాండ్లలో పెట్టుబడి పెడతారు. ఎన్‌పీఎస్‌లోని చందాదారులు తమ డబ్బును ఏ సంస్థ నిర్వహించాలో స్వయంగా నిర్ణయించుకోవాలి. పీఎఫ్ డబ్బులో ఎంత శాతం షేర్ మార్కెట్‌లో ఉండాలి, ఎంత శాతం సేఫ్ బాండ్లలో ఉండాలి అనేది కూడా చందాదారులే డిసైడ్ చేసుకోవాలి. చందాదారుల నిర్ణయం తప్పు అయితే, వచ్చే నష్టానికి వారే బాధ్యులుగా పరిగణించనున్నది. దీనిపై ఉద్యోగ, ప్రజాసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
పెన్షన్ల రంగంలో 100 శాతం ఎఫ్‌డీఐ
- Advertisement -
- Advertisement -


