Saturday, September 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్ కొత్త జనగణన ప్లాన్

ట్రంప్ కొత్త జనగణన ప్లాన్

- Advertisement -

హెచ్-1బీ ఉద్యోగులు, భారతీయ విద్యార్థులు లెక్కల నుంచి మినహాయింపు?
2030 అమెరికా జనగణనలో
గ్రీన్‌కార్డు లేని విదేశీయులను పక్కన పెట్టే ప్రతిపాదన
అంతర్జాతీయ విద్యార్థులు, శరణార్థులపై ప్రభావం
కాంగ్రెస్ సీట్లు, సమాఖ్య నిధుల కేటాయింపుల్లో మార్పులు

వాషింగ్టన్ : అమెరికాలో నివసిస్తున్న హెచ్-1బీ వీసాదారులు, భారతీయ విద్యార్థులు సహా తాత్కాలిక వీసాలపై ఉన్న లక్షలాది మంది విదేశీయులపై ప్రభావం చూపే విధంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాలన 2030 జనగణన విధానంలో భారీ మార్పులకు ప్రతిపాదనలు చేసింది. శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డు) లేని విదేశీయులను.. కాంగ్రెస్ ప్రతినిధుల సంఖ్యను నిర్ణయించే జనాభా లెక్కల నుంచి మినహాయించే అవకాశాన్ని ఈ ప్రతిపాదన పరిశీలిస్తోంది. 2030లో నిర్వహించనున్న అమెరికా తదుపరి పూర్తి స్థాయి జనగణన కోసం కొత్త నిబంధనలను రూపొందించాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గతేడాది అమెరికా జనగణన బ్యూరోను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అమెరికా వాణిజ్య శాఖ పరిధిలోని జనగణన బ్యూరో తాజాగా ప్రతిపాదనను సమర్పించింది. ఈ ప్రతిపాదన ప్రకారం… చట్టబద్ధ శాశ్వత నివాస హోదా కంటే తక్కువ కాలపరిమితి లేదా తాత్కాలిక హోదా కలిగిన విదేశీయులను కాంగ్రెస్ స్థానాల కేటాయింపునకు సంబంధిం చిన జనాభా లెక్కల నుంచి మినహాయించే అవకాశం ఉంది. ఇప్పటివరకు అమెరికాలో నివసిస్తు న్న విదేశీ పౌరులను కూడా జనాభా లెక్కల్లో చేర్చే పద్ధతి కొనసాగుతోంది.

గ్రీన్‌కార్డు లేనివారిపై ప్రభావం
ఈ ప్రతిపాదన ప్రధానంగా అక్రమ వలసదారులను జనగణన లెక్కల నుంచి తొలగించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ… దాని పరిధి మరింత విస్తరించే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శాశ్వత నివాస హోదా లేని వారిని ‘నిజమైన నివాసితులు’గా లేదా జనగణనకు అవసరమైన ‘సాధారణ నివాసం’ కలిగిన వారిగా పరిగణించకపోవచ్చని ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీంతో హెచ్-1బీ వంటి తాత్కాలిక ఉద్యోగ వీసాలపై పనిచేస్తున్నవారు, అంతర్జాతీయ విద్యార్థులు, శరణార్థులు, ఆశ్రయం కోరుతున్నవారు, తాత్కాలిక రక్షణ హోదా కలిగినవారు, అక్రమ వలసదారులు జనాభా లెక్కల నుంచి మినహాయింపునకు గురయ్యే అవకాశం ఉందని పౌర హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

భారతీయులకు ఎందుకు కీలకం?
అమెరికాలో భారీ సంఖ్యలో భారతీయులు హెచ్-1బీ వీసాలపై ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, ఆరోగ్య, ఇంజినీరింగ్, ఇతర ప్రత్యేక రంగాల్లో పనిచేస్తున్న భారతీయ నిపుణులు ఈ వీసాపై అమెరికాలో నివసిస్తున్నారు. అలాగే ప్రతి ఏడాదీ వేలాది మంది భారతీయ విద్యార్థులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య కోసం చేరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రతిపాదనను యథాతథంగా అమలు చేస్తే.. గ్రీన్‌కార్డు లేని హెచ్-1బీ ఉద్యోగులు, అంతర్జాతీయ విద్యార్థులు కూడా కాంగ్రెస్ స్థానాల కేటాయిం పునకు ఉపయోగించే జనాభా లెక్కల్లో చేరకపో వచ్చనే ఆందోళన నెలకొంది. అయితే ఈ వర్గాలపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదనీ, ప్రతిపాదనపై అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్టు సమాచారం.

కాంగ్రెస్ సీట్లు, నిధులపై ప్రభావం
అమెరికా జనగణన కేవలం దేశ జనాభా వివరాలను సేకరించడానికే పరిమితం కాదు. ప్రతి రాష్ట్రానికి అమెరికా ప్రతినిధుల సభలో ఎన్ని సీట్లు రావాలనే విషయాన్ని కూడా జనాభా లెక్కల ఆధారంగానే నిర్ణయిస్తారు. మొత్తం 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్థానాల కేటాయింపులో జనాభా కీలక పాత్ర పోషిస్తుంది. జనాభా లెక్కల ఆధారంగానే కాంగ్రెస్ నియోజకవర్గాల సరిహద్దుల పునర్విభజన, ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల కేటాయింపు, పలు సమాఖ్య నిధుల పంపిణీ వంటి అంశాలు ప్రభావితమవుతాయి. దీంతో వలసదారులు అధికంగా నివసించే రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం, నిధుల వాటాపై ప్రభావం పడే అవకాశం ఉందని విమర్శకులు చెబుతున్నారు.

శతాబ్దాల సంప్రదాయానికి విఘాతం
ఈ ప్రతిపాదన అమెరికాలో శతాబ్దాలుగా కొనసాగుతున్న జనగణన విధానాన్ని మార్చే అవకాశం ఉందని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి. వలసదారులు అధికంగా ఉన్న ప్రాంతాలకు అవసరమైన ప్రభుత్వ సేవలు, సమాఖ్య నిధులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లీడర్‌షిప్ కాన్ఫరెన్స్ ఆన్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్‌కు చెందిన జనగణన విభాగం సీనియర్ డైరెక్టర్ మీతా ఆనంద్ మాట్లాడుతూ.. ఈ విధానం హెచ్-1బీ వీసాదారులు, ఇతర వీసా హోల్డర్లు, శరణార్థులు, ఆశ్రయం పొందినవారు, తాత్కాలిక రక్షణ హోదా కలిగినవారు, అక్రమ వలసదారులను మినహాయించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రశ్నలకూ కోత?
2030 జనగణన ప్రశ్నావళిలో కూడా మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు ప్రతిపాదనలో సూచనలు ఉన్నాయి. శతాబ్దాలుగా సేకరిస్తున్న జాతి, వంశీయతకు సంబంధించిన ప్రశ్నలను తొలగించడంతోపాటు లైంగిక ధోరణికి సంబంధించిన ప్రశ్నలను అడగకుండా ఉండే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ట్రంప్ మొదటి అధ్యక్ష పదవీకాలంలో జనగణన ఫారంలో పౌరసత్వానికి సంబంధించిన ప్రశ్నను చేర్చేందుకు చేసిన ప్రయత్నాన్ని అమెరికా సుప్రీంకోర్టు అడ్డుకుంది. ఈ నేపథ్యంలో తాజా ప్రతిపాదన కూడా న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2030 అమెరికా జనగణనకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ట్రంప్ ప్రభుత్వ తాజా ప్రతిపాదన ఇప్పటికే వలసదారుల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, సమాఖ్య నిధుల పంపిణీపై పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా అమెరికాలో తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న భారతీయ ఉద్యోగులు, విద్యార్థులకు ఈ ప్రతిపాదన కీలకంగా మారింది. అయితే తుది నిబంధనలు ఎలా ఉంటాయి? హెచ్-1బీ ఉద్యోగులు, భారతీయ విద్యార్థులను వాస్తవంగా జనాభా లెక్కల నుంచి మినహాయిస్తారా? అనే ప్రశ్నలకు రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -